Munugode Bypoll Result 2022: మునుగోడు ఉప ఎన్నికల కౌంటింగ్ లో 3వ రౌండ్ ముగిసేసరికి ఓవరాల్ గా 500 పైచిలుకు ఓట్లతో బీజేపీ లీడ్ లో ఉంది. మంత్రి మల్లారెడ్డి ఇంఛార్జ్ గా ఉన్న అరెగూడెం, రెడ్డి బావిలో బీజేపీకి లీడ్ వచ్చింది.
కౌంటింగ్ సెంటర్ నుండి వెళ్లిపోయిన పాల్వాయి స్రవంతి
మునుగోడు కౌంటింగ్ సెంటర్ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతి వెళ్లిపోయారు. మూడో రౌండ్ కౌంటింగ్ కొనసాగుతుండగా ఆమె బయటికి వచ్చారు. అందరికంటే ముందుగానే ఆమె కౌంటింగ్ కేంద్రానికి చేరుకుని గెలుపుపై ధీమాను వ్యక్తం చేశారు. మొదటి రెండు రౌండ్లలో స్రవంతికి బీజేపీ, టీఆర్ఎస్ కంటే తక్కువ ఓట్లు వచ్చాయి.
తెలంగాణ వ్యాప్తంగా ఎదురుచూస్తున్న మునుగోడు ఉప ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం అయింది. ఆదివారం ఉదయం 8 గంటలకు అధికారులు ఓట్ల లెక్కింపు మొదలుపెట్టారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకు లెక్కింపు పూర్తి కానుందని అధికారులు భావిస్తున్నారు. మొత్తం 15 రౌండ్లలో కౌంటింగ్ ముగియనుంది. నల్లగొండ శివారు ఆర్జాలబావి స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ గోదాంలో ఓట్ల లెక్కింపు జరుగుతోంది. అధికార టీఆర్‌ఎస్ పార్టీతో పాటు బీజేపీ, కాంగ్రెస్ తమ గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నాయి. 3వ తేదీన జరిగిన ఉపఎన్నికలో మొత్తం 2,41,855 ఓట్లకు గాను 2,25,192 ఓట్లు (93.16 శాతం) పోలైయ్యాయని అధికారులు తెలిపారు.
ఏ రౌండ్లలో ఏ మండలం ఓట్ల లెక్కింపు..
1,2,3 రౌండ్లలో చౌటుప్పల్ మండలం ఓట్లు లెక్కింపు
4,5,6 రౌండల్లో నారాయణపురం మండలం ఓట్ల లెక్కింపు
7,8 రౌండ్లలో మునుగోడు మండలం ఓట్ల లెక్కింపు
9,10 రౌండ్లలో చండూరు మండలం ఓట్ల లెక్కింపు
11, 12, 13, 14, 15 రౌండ్లలో మర్రిగూడ, నాంపల్లి, గట్టుప్పల్ మండలాల ఓట్లు లెక్కింపు
తొలుత పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు..
మునుగోడు ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ శనివారం తెలిపారు. ఈవీఎంలు ఉన్న స్ట్రాంగ్ రూమ్ ను ఉదయం 7:30 గంటలకు అబ్జర్వర్, పోటీ చేసిన అభ్యర్థులు, ఎలక్షన్ ఏజెంట్ల సమక్షంలో తెరిచారు. ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద మూడు అంచెల భద్రతను ఏర్పాటు చేశామన్నారు. ఆదివారం ఉదయం 8:00 గంటలకు నల్గొండ జిల్లా అర్జాలబావి తెలంగాణ స్టేట్ వేర్‌హౌసింగ్ కార్పొరేషన్ గోడౌన్స్ లో ఓట్ల లెక్కింపు మొదలైంది. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ప్రారంభమైన 30 నిమిషాల తర్వాత, EVM లెక్కింపు ప్రారంభమవుతుందన్నారు. 21 టేబుళ్లను ఏర్పాటు చేసి 15 రౌండ్లలో కౌంటింగ్ పూర్తి చేయనున్నారు. ప్రతి రౌండ్ కౌంటింగ్‌లో, అబ్జర్వర్ టేబుల్‌పై రిజల్ట్ షీట్‌తో ఎంచుకున్న 2 పోలింగ్ స్టేషన్‌ల ఫలితాన్ని క్రాస్ చెక్ చేస్తారు. EVM కౌంటింగ్ పూర్తయిన తర్వాత, VVPAT కౌంటింగ్ బూత్ వద్ద ఎంపిక చేసిన 5 VVPAT స్లిప్‌లను తప్పనిసరిగా లెక్కించాలని సీఈఓ ఆదేశించారు. మునుగోడు ఉపఎన్నికలో 298 పోలింగ్ స్టేషన్లలో మొత్తం 2,25,192 ఓట్లు పోలయ్యాయి. 680 పోస్టల్ బ్యాలెట్లను 80 ఏళ్లు పైబడిన ఓటర్లు, వికలాంగులు వేశారు. ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా రెండింటికీ 150 సీటింగ్ కెపాసిటీతో ప్రత్యేక హాలు ఏర్పాటు చేశారు. ఈ హాలులో మైక్-సెట్, స్క్రీన్‌తో రౌండ్ వారీగా ఫలితాన్ని ప్రదర్శించేందుకు సదుపాయం ఉందని సీఈఓ తెలిపారు
మధ్యాహ్నం 1 గంటకు కౌంటింగ్ పూర్తి
మునుగోడు పోలింగ్ అనంతరం ఈవీఎంలను స్ట్రాంగ్‌రూమ్‌లలో భద్రపర్చారు. స్ట్రాంగ్ రూమ్స్ వద్ద కేంద్ర, రాష్ట్ర బలగాలు పహారా కాస్తున్నాయి. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వినయ్‌కృష్ణా రెడ్డి లెక్కింపు అధికారులు, సిబ్బందికి మార్గనిర్దేశం చేశారు. కౌంటింగ్ టేబుళ్ల వద్ద అభ్యర్థులు లేదా పార్టీ ఏజెంట్లు కూర్చోడానికి అనువుగా అన్ని ఏర్పాట్లుచేస్తున్నారు. రేపు ఉదయం 8 గంటలకు అభ్యర్థులు లేదా పార్టీల ఏజెంట్ల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్‌లు తెరుస్తారు. ముందుగా ఆర్.ఓ టేబుల్ వద్ద పోస్టల్ బ్యాలెట్లను లెక్కించనున్నారు. అనంతరం ఈవీఎంలలో ఓట్ల లెక్కింపు ప్రారంభిస్తారని అధికారులు వెల్లడించారు. 7 మండలాల్లో మొత్తం 298 పోలింగ్ కేంద్రాల్లో 298 ఈవీఎంలను ఓటింగ్ లో ఉపయోగించారు. గంటకు 3 నుంచి 4 రౌండ్ల ఫలితాలు ప్రకటించనుండగా, మధ్యాహ్నం 1 గంటకల్లా కౌంటింగ్ పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయని అధికారులు అంటున్నారు.