'ఆదిపురుష్' (Adipurush Movie) విడుదల వాయిదా పడింది. ఆ విషయంలో మరో సందేహానికి ఛాన్స్ లేదని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. సంక్రాంతికి సినిమా రావడం లేదని ఆల్రెడీ డిస్ట్రిబ్యూటర్లతో చెప్పేశారట. ఎందుకు వాయిదా పడింది? అంటే... టీజర్ విడుదలైన తర్వాత వచ్చిన ట్రోల్స్, మీమ్స్! ప్రభాస్ (Prabhas) డై హార్డ్, హార్డ్ కోర్ ఫ్యాన్స్ నుంచి కూడా విమర్శలు వచ్చాయి. దాంతో టీమ్ వీఎఫ్ఎక్స్ మీద రీ వర్క్ చేయాలని డిసైడ్ అయిందని సమాచారం.
రావణుడి లుక్ మారుతోంది!?
'ఆదిపురుష్' మీద వచ్చిన విమర్శల్లో ముఖ్యమైనది లంకాధిపతి రావణాసురుడిగా సైఫ్ అలీ ఖాన్ లుక్ బాలేదని! ఆయన రావణుడిగా లేడని, కార్టూన్ క్యారెక్టర్ టైప్ లుక్ ఉందని ట్రోల్స్ వచ్చాయి. ఆయన లుక్ చేంజ్ చేయాలని దర్శకుడు ఓం రౌత్ అండ్ టీమ్ భావిస్తోందట. ఒక్క సైఫ్ లుక్ మాత్రమే కాదు... హనుమంతుడు, వానర సైన్యం లుక్స్ కూడా మారనున్నాయట. అందుకని, సంక్రాంతి నుంచి సినిమా శ్రీరామ నవమి సందర్భంగా మార్చి 30కి లేదంటే ఆ తర్వాత వేసవికి వాయిదా వేయాలని ఆలోచిస్తున్నది.
ప్రజెంట్ 'ఆదిపురుష్' వీఎఫ్ఎక్స్ రీ వర్క్ స్టార్ట్ అయ్యిందని తెలుస్తోంది. ఆ లుక్స్ ఎలా ఉంటాయన్నది కొన్ని రోజుల్లో తెలుస్తుంది. ఈ న్యూస్ ప్రభాస్ అభిమానులకు సంతోషాన్ని ఇస్తుందని చెప్పవచ్చు.
Also Read : విశ్వక్ సేన్‌తో ఎప్పటికీ సినిమా చేయను - తెర వెనుక ఏం జరిగిందో వివరించిన అర్జున్
ప్రజల మనోభావాలు, సెంటిమెంట్లను దెబ్బ తీసేలా 'ఆదిపురుష్'లో సన్నివేశాలు ఉన్నాయని బీజేపీ అధికార ప్రతినిధి మాళవికా అవినాష్ పేర్కొన్నారు. మధ్యప్రదేశ్ హోమ్ మంత్రి నరోత్తమ్ మిశ్రా సైతం టీజర్ విడుదలైన తర్వాత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉత్తర ప్రదేశ్‌లోని బ్రాహ్మణ సంఘాలు నిరసన తెలిపాయి. అయోధ్యలోని పూజారి సినిమాపై నిషేధం విధించాలని డిమాండ్ చేశారు. ప్రమోద్ పాండే అనే న్యాయవాది కోర్టులో కేసు వేశారు. ఆ కేసు విషయంలో చిత్ర బృందం నోటీసులు కూడా అందుకుంది.
విమర్శలపై ఒకానొక సమయంలో దర్శకుడు ఓం రౌత్ ఘాటుగా స్పందించారు. ఈ సినిమాను యూట్యూబ్‌లో కాకుండా సిల్వర్ స్క్రీన్ మీద త్రీడీలో చూస్తే బావుంటుందని చెప్పుకొచ్చారు. ఈతరం ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా సినిమా తీశానని, రామాయణాన్ని ఇప్పటి తరానికి తగ్గట్టు చెబుతున్నానని ఆయన వివరించారు. ఆయన మాటలను ప్రేక్షకులు పరిగణలోకి తీసుకోలేదు. సినిమా విడుదలైన తర్వాత కంటెంట్ చూశాక ఫ్యాన్స్ హ్యాపీగా ఉంటారని టీమ్ భావిస్తోంది. టీజర్ విడుదల తర్వాత వచ్చిన ట్రోల్స్ ప్రభావంతో పలు థియేటర్లలో త్రీడీలో టీజర్ ప్రదర్శించారు. అప్పుడు విజువల్ గ్రాండియర్ కొంత వరకు ప్రేక్షకులకు తెలిసింది. అయితే... లుక్స్ మీద మాత్రం ఇంకా విమర్శలు వస్తున్నాయి.
'ఆదిపురుష్'లో ప్రభాస్ సరసన సీత పాత్రలో కృతి సనన్ (Kriti Sanon), లక్ష్మణుడిగా సన్నీ సింగ్ (Sunny Singh), లంకేశ్ పాత్రలో హిందీ హీరో సైఫ్ అలీ ఖాన్ (Saif Ali Khan) నటించారు. ఈ చిత్రాన్ని టీ సిరీస్ సంస్థ నిర్మిస్తోంది. సుమారు 500 కోట్ల రూపాయల భారీ నిర్మాణ వ్యయంతో సినిమా రూపొందుతోంది.