హుజురాబాద్ ఉపఎన్నికల్లో మరోసారి "దళిత బంధు" హాట్ టాపిక్ అయింది. అయితే ఈ సారి అమలు చేస్తున్నందుకు కాదు. ఆగిపోయినందుకు. దళిత బంధు అమలు చేయకుండా ఎన్నికల సంఘం ఆదేశాలివ్వడానికి కారణం మీరంటే మీరని ఆరోపిస్తూ బీజేపీ, టీఆర్ఎస్ నేతలు పరస్పర ఆరోపణకు దిగుతున్నారు. ముందుగా టీఆర్ఎస్ నేతలు ..  ఈటల రాజేందర్‌పై ఆరోపణలు గుప్పిస్తున్నారు. దళిత బంధు ఆగి పోవడానికి ప్రధాన కారణం ఈటల రాజేందరేనని పాడి కౌశిక్ రెడ్డి స్పష్టం చేశారు. అట్టడుగు వర్గాల్లో ఉన్న దళితుల్ని ఆదుకోవడానికి కేసీఆర్ అమలు చేయాలనుకున్న దళిత బంధు ని ఆపివేయడానికి ఈటల రాజేందర్ కుట్రపన్నారని, దానికి ఖచ్చితంగా ఓట్ల రూపంలో దళితులు సమాధానం ఇస్తారన్నారు. 


Also Read : "పోడు భూముల" సమస్యకు శాశ్వత పరిష్కారం.. 23న కేసీఆర్ అత్యున్నత భేటీ !


అయితే బీజేపీ నేతలు  ఇన్నాళ్లు దళిత బంధు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేసిన సీఎం  కేసీఆర్‌ ఇప్పుడు దళిత బంధు నిలిపేశారని ఆరోపిస్తూ ఆందోళనలు ప్రారంభించారు. హుజురాబాద్‌తో పాటు ఇతర చోట్ల కూడా నిరసనలు చేపట్టారు. పలుచోట్ల సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మలను దగ్ధం చేసేందుకు ప్రయత్నించారు. మార్చి నెల నుంచి ఇన్నాళ్లు ఏం చేశారని బీజేపీ నేతలు ప్రశ్నించారు. దళిత బంధుకు బీజేపీ వ్యతిరేకం కాదని కేసీఆరే కుట్ర పన్నారని ఆరోపిస్తున్నారు.  


Also Read : జానారెడ్డి కన్నా ఈటల పెద్ద లీడరా ? 9 నెలలు పార్టీ పని మీదే ఉంటామన్న కేటీఆర్ !


బీజేపీ, టీఆర్ఎస్ తోడు  దొంగలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. దళితులపై కేసీఆర్‌కు ఏ మాత్రం పట్టింపు లేదన్నారు. ఎన్నికల కోడ్ కిందకు రాకుండా ఉండటానికే ముందు అమలు చేయడం ప్రారంభించారని ఇప్పుడు.. ఈసీ వద్దని లేఖ రాస్తే ఎందుకు ఊరుకున్నారని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ముందే దళిత బంధు డబ్బులు ఇస్తే అందరూ కాంగ్రెస్‌కు ఓటు వేస్తారన్న భయం పట్టుకుందని రేవంత్ విమర్శించారు. 


Also Read : కేసీఆర్ మాటలకు అర్థాలే వేరా ? తెలంగాణలో ముందస్తు ఖాయమేనా ?


మరో వైపు దళిత బంధు పథకం అమలుకు సంబంధించిన పనులన్నింటినీ అధికారులు ఆపేశారు. బీజేపీ నేతలు ఫిర్యాదు చేయడంతోనే పథకాన్ని ఆపాల్సి వచ్చిందని మంత్రి కేటీఆర్ కూడా ప్రకటించారు. బీజేపీ నేత ప్రేమేందర్ రెడ్డి ఈసీకి లేఖ రాశారని అన్నారు. అయితే పథకాన్ని వారం మాత్రమే ఆపగలరని ఆ తర్వాత ఎలా అడ్డుకుంటారని కేటీఆర్ ప్రశ్నించారు. ఇప్పటికే రెండు పార్టీల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు ప్రారంభమయ్యాయి.  పోలింగ్ వరకూ దళిత బంధు చుట్టూ రాజకీయం జరగడం ఖాయంగా కనిపిస్తోంది. 


Also Read : గుర్తులతో గుబులు... దుబ్బాక సీన్ రిపీట్ అవుతుందా..?... ప్రధాన పార్టీల అభ్యర్థుల్లో ఆందోళన


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి