Tollywood Film Chamber Special Awards : తెలుగు ఫిల్మ్ ఛాంబర్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.ఇకపై ప్రతి సంవత్సరం ఛాంబర్ నుంచి అవార్డులు ఇవ్వాలని నిర్ణయించారు. ఫిబ్రవరి 6 తెలుగు సినిమా పుట్టిన రోజు వేడుకల్లోనే అవార్డులు ఇవ్వాలని నిర్ణయించారు. ప్రభుత్వం ఇచ్చే అవార్డులతో పాటు ఫిల్మ్ ఛాంబర్ నుంచి అవార్డులు ఉంటాయని తెలిపారు. తెలుగు సినిమా పుట్టినరోజున ప్రతి సినిమా నటుడు తన ఇంటిపై, థియేటర్ల వద్ద ప్రత్యేకంగా జెండా ఆవిష్కరించాలనే కట్టుబాటు పెట్టుకున్నారు. తెలుగు సినిమా పుట్టినరోజు జెండా రూపకల్పన బాధ్యతను పరిచూరి గోపాలకృష్ణకు అప్పగించింది ఫిల్మ్ ఛాంబర్. అయితే ఉగాది రోజున ప్రభుత్వం గద్దర్ అవార్డులు ఇస్తూంటే అంతకు ముందే తాము అవార్డుల వేడుక నిర్వహించుకుంటామని ప్రకటించడం చాలా మందిని ఆశ్చర్య పరుస్తోంది.
ఫిల్మ్ చాంబర్ ఇప్పటి వరకూ ఎలాంటి అవార్డుల కార్యక్రమాలు పెట్టుకోలేదు. హఠాత్తుగా అవార్డులు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. అయితే ఈ ఏడాది ఇవ్వడం లేదు. వచ్చే ఏడాది నుంచి ప్రారంభిస్తారు. ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వాలు నంది అవార్డులు ఇచ్చేవి. అయితే తెలంగాణ ఉద్యమం ఊపందుకున్న తర్వాత వాటిని ఇవ్వడం మానేశారు. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో ఎలాంటి అవార్డుల ప్రకటన చేయలేదు. సింహ అవార్డులు ఇస్తామని ప్రతిపాదించారు కానీ కార్యాచరణలోకి రాలేదు. ఏపీలో ఓ సారి అవార్డుల్ని ప్రకటించారు. సినిమా ఇండస్ట్రీకి చెందినవారే అవార్డుల ఎంపిక కమిటీలో ఉన్నప్పటికీ ఇండస్ట్రీ వాళ్లే ఆ అవార్డులపై ఆరోపణలు చేయడంతో ప్రభుత్వం అసలు పూర్తిగా పక్కన పెట్టేసింది. సినిమా ఇండస్ట్రీని ప్రోత్సహించడం పనికి మాలిన పని అనుకుంది.
తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం అసలు పట్టించుకోలేదు. పైగా సినీ పరిశ్రమతో అంత సన్నిహిత సంబంధాలు కొనసాగించలేదు. తెలంగాణలో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం గద్దర్ పేరుతో సినీ అవార్డులు ఇస్తామని చెప్పింది. గద్దర జయంతి రోజున ఇస్తామని చెప్పి టాలీవుడ్ కు కబురు పంపింది. అయితే ఎవరూ ఆసక్తి చూపించలేదు. గద్దర్ పేరుతో ఏదో ఓ అవార్డు అంటే సరే కానీ.. పూర్తిగా నంది పేరు తీసేసి గద్దర్ పేరుతో ఇస్తామనేసరికి టాలీవుడ్ ఆసక్తి చూపించలేదు. ఈ కారణంగా ప్రక్రియ ముందుగా సాగలేదు. ఇటీవల పరిణామాలతో మళ్లీ కదలిక వచ్చింది.
గద్దర జయంతి సభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఉగాది రోజున గద్దర్ అవార్డులను ప్రదానం చేస్తామన్నారు. ఈ అంశంలో టాలీవుడ్ అంత ఆసక్తిగా లేదని స్పష్టమవుతోంది. అయితే ప్రభుత్వ ఒత్తిడి కారణంగా తీసుకోవాల్సిన పరిస్థితులు వస్తాయని అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో గద్దర్ అవార్డుల కంటే ముందే.. ఫిల్మ్ చాంబర్ అవార్డులను ప్రకటిస్తే.. మంచిదన్న అభిప్రాయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. గద్దర అవార్డుల పేరు మార్చాలని కొంత మంది ప్రభుత్వానికి ప్రతిపాదనలు పెట్టే ప్రయత్నాలు చేస్తున్నా సానుకూల స్పందన రావడం లేదని అంటున్నారు. అందుకే ఫిల్మ్ చాంబర్ సొంత అవార్డులను ప్రకటించిందన్న అభిప్రాయానికి ఎక్కువ మంది వస్తున్నారు.