NTR Trust Musical Night: 'మీరు కొనే ప్రతీ టికెట్ సమాజ సేవకే' - ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ నెల 15న మ్యూజికల్ నైట్
Vijayawada News: సేవా కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి తెలిపారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ నెల 15న విజయవాడలో మ్యూజికల్ నైట్ నిర్వహించనున్నట్లు చెప్పారు.

NTR Trust Musical Night In Vijayawada: 'సమాజమే దేవాలయం.. ప్రజలే దేవుళ్లు' అని ఎన్టీఆర్ నమ్మారని సీఎం చంద్రబాబు సతీమణి, ఎన్టీఆర్ ట్రస్ట్ (NTR Trust) మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి (Nara Bhuvaneswari) అన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విజయవాడలో నిర్వహించనున్నట్లు మ్యూజికల్ నైట్ (Musical Night) వివరాలను ఆమె గురువారం వెల్లడించారు. తలసేమియా బాధితులకు సహయార్థం ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ నెల 15న మ్యూజికల్ నైట్ ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ ఆధ్వర్యంలో జరగనుందని చెప్పారు. ఈ షోను తాను చేయడం చాలా సంతోషంగా ఉందని మ్యూజిక్ డైరెక్టర్ తమన్ అన్నారు. నారా భువనేశ్వరి.. తలసేమియా బాధితుల కోసం ఈ కార్యక్రమం అని చెప్పగానే తాను వెంటనే వస్తానని చెప్పినట్లు తెలిపారు. తనపై నమ్మకంతో ఇంత పెద్ద కార్యక్రమం తన చేతిలో పెట్టారని అన్నారు. టికెట్‌పై పెట్టే ప్రతీ రూపాయి తలసేమియా బాధితులకు వెళ్తుందని స్పష్టం చేశారు. కాగా, ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అతిథులుగా హాజరు కానున్నారు.
'టికెట్ ఉంటేనే ఎంట్రీ..'
విజయవాడలో (Vijayawada) నిర్వహించే మ్యూజికల్ నైట్‌కు సీఎం అయినా, ఆయన వెంట వచ్చే పీఏలు, భద్రతా సిబ్బంది.. ఎవరైనా టికెట్ కొనుగోలు చేస్తేనే లోనికి అనుమతి ఉంటుందని భువనేశ్వరి తెలిపారు. చంద్రబాబే తమ కుటుంబ సభ్యులకు రూ.6 లక్షలు వెచ్చించి మ్యూజికల్ నైట్ టికెట్లు కొని టేబుల్ బుక్ చేశారని చెప్పారు. ఎవరి కాళ్ల మీద వాళ్లే నిలబడాలి అని భావించే వ్యక్తి చంద్రబాబని.. అందుకే ట్రస్ట్ కార్యక్రమాల గురించి ఆయన్ను తానేమీ అడగనని.. అడిగినా వెంటనే అంగీకరించరని తెలిపారు. 'ఎన్టీఆర్ స్ఫూర్తితో ట్రస్ట్ ఏర్పాటు చేశాం. అందరూ రక్తదాన కార్యక్రమాల్లో పాల్గొనాలి. ఇది చాలామంది జీవితాలను నిలబెడుతుంది. రక్తదానం చేసిన వారు ఇతరుల జీవితాల్లో వెలుగులు నింపుతారు. ఫండ్ రైజింగ్ కోసం మ్యూజికల్ నైట్ నిర్వహిస్తున్నాం. ప్రతి టికెట్‌పై వచ్చే రూపాయి తలసేమియా బాధితులకు అందిస్తాం. తమన్ ఈ షో ఫ్రీగా చేస్తానని గొప్ప హృదయంతో చెప్పారు. ప్రతి ఒక్కరు తెలుగు తల్లి రుణం తీర్చుకోవాలి. సమాజ సేవా కార్యక్రమాలు ప్రతి ఒక్కరు చేయాలి. మనం వెళ్లేటప్పుడు మన వెంట డబ్బు రాదు. ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తే అందరికి గుర్తు ఉంటుంది. ప్రతి ఒక్కరు కొనే టికెట్ సమాజ సేవకే ఉపయోగపడుతుంది.' అని భువనేశ్వరి పేర్కొన్నారు.
కాగా, విజయవాడలోని ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా 'యుఫోరియా మ్యూజికల్ నైట్ నిర్వహించనున్నారు. రాజకీయ రంగంలో ఏమీ ఆశించకుండా ప్రజల కోసం ముందుకు నడిచిన వ్యక్తి ఎన్టీఆర్ అని భువనేశ్వరి కొనియాడారు. తలసేమియా బారిన పడిన వారికి సహాయం చేసేందుకు బ్లడ్ బ్యాంక్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అందరూ కుటుంబ సమేతంగా వచ్చి ఈ మ్యూజికల్ నైట్‌లో పాల్గొనాలని పిలుపునిచ్చారు.