Light to Moderate Rain to Occur at Isolated Places over Andhra Pradesh: అరేబియా సముద్రంలో ఏర్పడనున్న అల్పపీడనం ప్రభావంతో గత రెండు మూడు రోజులుగా దక్షిణాది రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతం నుంచి వీచే గాలుల ప్రభావంతో ఏపీ, తెలంగాణలో మరో మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం పేర్కొంది. తమిళనాడు, యానాంలోనూ ఉరుములు, మెరుపులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు కురవనున్నాయని అంచనా వేశారు. తీరం వెంట 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయని, మత్స్యకారులు వేటకు వెళ్లడం ప్రమాదకరమని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. వర్షాల నేపథ్యంలో ధాన్యం తడవకుండా రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. 


Telangana Temperature Today: తెలంగాణలో కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురవనున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని సూచించారు. హైదరాబాద్ నగరంలో, చుట్టుపక్కల ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉంది. రాష్ట్రంలో నేడు గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు 39 డిగ్రీలు, 27 డిగ్రీలుగా నమోదుకానున్నాయి. నైరుతి దిశ నుంచి వీచే గాలుల ప్రభావంతో కొన్ని చోట్ల ఉష్ణోగ్రత తగ్గి ఎండల నుంచి ప్రజలకు ఊపశమనం కలగనుంది. 


యానాంతో పాటు ఉత్తర కోస్తాంధ్ర ప్రాంతాలైన శ్రీకాకుళం, పార్వతీపురం మణ్యం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు (పాడేరు), అనకాపల్లి జిల్లాల్లో పిడుగులు, ఈదురుగాలులతో వర్షాలుంటాయి. విశాఖ నగరం పరిసర ప్రాంతాలైన అనకాపల్లి, పెందుర్తి, పరవాడలో ఓ మోస్తరు వర్షాలు కురవనున్నాయి. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లోనూ ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. విజయనగరం జిల్లా సాలూరు వైపుగా కొన్ని భారీ వర్షాలు విస్తరిస్తున్నాయి. ఇవి నేరుగా విశాఖ ఏజెన్సీ ప్రాంతం పాడేరు, అరకు వైపుగా వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరో వైపున నల్లమల అటవీ ప్రాంతంలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. 






అనంతపురం జిల్లా అనంతపురం-కదిరి బెల్ట్ లో భారీ పిడుగులతో పాటుగా వర్షాలు విస్తరిస్తున్నాయి. ఇవి మెళ్లగా కడప జిల్లాలోకి ప్రవేశించనున్నాయి. సత్యసాయి (పుట్టపర్తి) జిల్లా, అనంతపురం జిల్లాతో పాటుగా కర్నూలు, కడప జిల్లాలోని పలు భాగాల్లో ఈదురుగాలులు గంటకు 45 కి.మీ. దాకా వీచే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొన్ని చోట్ల రాత్రి నుంచి తెల్లవారిజామున దాక ఈ వర్షాలు ఓ మోస్తరు కురుస్తాయి. కడప నగరంతో పాటుగా ప్రొద్దట్టూరు, మైదుకూరులో భారీ వర్షాలతో పాటుగా పిడుగు సూచన ఉందని ఆంధ్రప్రదేశ్ వెదర్ మ్యాన్ పేర్కొంది. చిత్తూరు జిల్లాలోని కొన్ని పశ్చిమ భాగాల్లో అక్కడక్కడ వర్షాలు, పిడుగులు విస్తరిస్తున్నాయి. కుప్పం-వి.కోట పరిధిలో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని హెచ్చరించారు.