ఈ రోజు కింది స్థాయిలోని గాలులు తూర్పు, ఆగ్నేయ దిశల నుంచి తెలంగాణ రాష్ట్రం వైపుకి వీస్తున్నాయని హైదరాబాద్ లోని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో ఈ రోజు, రేపు, ఎల్లుండి రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. తెలంగాణ వ్యాప్తంగా ఎలాంటి హెచ్చరికలు జారీ చేయలేదు.
హైదరాబాద్‌లో వాతావరణం
హైదరాబాద్ లో ఆకాశం పాక్షికంగా మేఘావృతం అయి కనిపించనుంది. ఉదయం వేళల్లో హైదరాబాద్ నగరంలో పొగ మంచు ఏర్పడే అవకాశం ఉంటుంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 32 డిగ్రీలు, 23 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఉపరితల గాలులు గంటకు 4 నుంచి 8 కిలో మీటర్ల వేగంతో తూర్పు దిశల్లో వీచే అవకాశం ఉంది. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 31.2 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 23.2 డిగ్రీలుగా నమోదైంది. గాలిలో తేమ 81 శాతంగా నమోదైంది.
నవంబరు 4 నుంచి 8 వరకూ తెలంగాణలోని వివిధ జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. వచ్చే 4 రోజుల పాటు మధ్య తెలంగాణ, దక్షిణ తెలంగాణ జిల్లాలకు స్వల్ప వర్ష సూచన ఉందని అంచనా వేశారు. 31 నుంచి 5 రోజుల పాటు తెలంగాణ జిల్లాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణంగానే నమోదు కానున్నట్లు అంచనా వేశారు. కనిష్ఠ ఉష్ణోగ్రతలు మాత్రం అన్ని జిల్లాల్లో సాధారణంగానే నమోదవుతున్నాయని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
ఏపీలో ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం
తేలిక పాటి నుండి ఒక మోస్తరు చినుకులు లేదా జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. దక్షిణ కోస్తాంధ్రప్రదేశ్ లో కూడా తేలిక పాటి నుండి ఒక మోస్తరు జల్లులు కురిసే అవకాశం ఉంది. రాయలసీమలోనూ వాతావరణం పొడిగా ఉంటుందని వాతావరణ అధికారులు అంచనా వేశారు.
‘‘బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడి దక్షిణ తమిళనాడు, కేరళ ప్రాంతం మీదుగా అరేబియా సముద్రం వరకూ విస్తరించి ఉంది. దీని కదలిక ప్రకారమే తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు ఉంటాయి. అరేబియా సముద్రంలో బాగా వర్షాలు పడే అవకాశం ఉంది. దీని ప్రభావం దక్షిణ తెలంగాణ, దక్షిణ కోస్తా ఆంధ్ర మధ్య కోస్తాంధ్రలో చెదురుమొదురు వర్షాలు ఉండే అవకాశం ఉంది. ఉత్తర కోస్తా ప్రాంతాల్లో సాధారణంగా కంటే తక్కువ వర్ష పాతం ఉండొచ్చు.
అల్ప పీడనం అరేబియా సముద్రాన్ని తాకగానే బలమైన అల్పపీడనంగా మారుతుంది. ఈ సమయంలో ఇది బంగాళాఖాతంలో ఉన్న తేమ గాలులకు ఆకర్షిస్తుంది. ఈ సమయంలో రాయలసీమ ప్రాంతంలో గాలుల సంగమం ఏర్పడుతుంది ’’ అని ఏపీ వెదర్ మ్యాన్ తెలిపారు.