ఈరోజు ద్రోణి ఉత్తర కర్ణాటక నుండి తెలంగాణ మీదుగా దక్షిణ ఛత్తీస్ గఢ్ వరకు సగటు సముద్రమట్టం నుండి 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు కొనసాగుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. రాగల మూడు రోజులు   తెలంగాణ రాష్ట్రంలో  తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు చాలా చోట్ల వచ్చే అవకాశం ఉంది. రాష్ట్రంలో రాగల 5 రోజులలో పగటి ఉష్ణోగ్రతలు కొన్ని చోట్ల 30 డిగ్రీల కన్నా తక్కువ నమోదు అయ్యే అవకాశం ఉంది. రాగల మూడు రోజులు తెలంగాణ రాష్ట్రంలో ఉరుములు, మెరుపులు, వడగళ్లు, ఈదురు గాలులు (ఈ రోజు 40 నుండి 50 కిలో మీటర్ల గాలి వేగంతో) కూడిన వర్షాలు అక్కడక్కడ వచ్చే అవకాశం ఉంది. 


తెలంగాణలో నేడు జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, నాగర్ కర్నూల్ తదితర జిల్లాల్లో ఉరుములు, మెరుపులు ఈదురుగాలులు (40-50 కిలో మీటర్లు) వడగండ్లతో కూడిన  భారీ వర్షం అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. ఈ జిల్లా్లలో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. మిగిలిన కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో, వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ అధికారులు అంచనా వేశారు. 


హైదరాబాద్ లో ఇలా
‘‘హైదరాబాద్ లో ఆకాశం పాక్షికంగా మేఘాలు పట్టి ఉంటుంది. తేలికపాటి నుంచి మోస్తరు వర్షం లేదా ఉరుములు, వడగండ్లతో ఈదురు గాలులు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో వర్షాలు పడే అవకాశం ఉంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 30 డిగ్రీలు, 22 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఆగ్నేయ దిశ నుంచి గాలులు 8 నుంచి 10 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 32.8 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 21 డిగ్రీలుగా నమోదైంది. గాలిలో తేమ 98 శాతం నమోదైంది.


ఏపీలో నేడు వాతావరణం ఇలా
నేడు ఆంధ్రప్రదేశ్ లోని అన్ని జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని అమరావతిలోని వాతావరణ కేంద్రం వెల్లడించింది. వేగంగా గాలులు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో అక్కడక్కడ వీచే అవకాశం ఉందని అంచనా వేశారు. 


‘‘కర్ణాటక నుంచి వస్తున్న బలమైన వర్షాలు, పిడుగులు మెల్లగా అనంతపురం, సత్యసాయి జిల్లాల్లోకి విస్తరించనున్నాయి. ఈ వర్షాలు పిడుగులతో అక్కడక్కడ పడనున్నాయి. రానున్న రెండు గంటల్లో అనంతపురం జిల్లా కల్యాణదుర్గం - అనంతపురం పరిసర భాగాల్లో కొన్ని వర్షాలు, అలాగే సత్యసాయి జిల్లా ధర్మవరం పరిసర భాగాల్లో కొన్ని వర్షాల అవకాశాలు కనిపిస్తున్నాయి. రాత్రికి కర్నూలుతో పాటు అనంత​, సత్యసాయి జిల్లాల్లో వర్షాలు బాగా ఉండనున్నాయి.


కాకినాడ జిల్లా అన్నవరం - తుని పరిసర ప్రాంతంలో కొన్ని వర్షాలు ఉండే అవకాశాలు ఉన్నాయి. మరో వైపున రాయలసీమ జిల్లాల్లో కూడా వర్షాలు మొదలయ్యాయి. కర్నూలు నగరంతో పాటుగా కర్నూలు జిల్లాలో అక్కడక్కడ వర్షాలు, అలాగే అనంతపురం జిల్లాలో కూడా అక్కడక్కడ వర్షాలు ఉంటాయి. కానీ ఇవన్నీ మనకు రానున్న రోజుల్లో కురవబోయే వర్షాలకు ట్రైలర్ మాత్రమే. నేడు రాత్రి అలాగే రేపు మనకు రాయలసీమ జిల్లాల్లో ముఖ్యంగా వర్షాలు విస్తారంగా ఉంటాయి. 


నేడు మనకు ఏర్పడ్డ గాలుల కేంద్రం మెల్లగా బలపడుతోంది కాబట్టి వర్షాలు రాయలసీమ జిల్లాలైన కర్నూలు, అనంతపురం, కడప​, సత్యసాయి జిల్లాల్లో విస్తారంగా కురవనున్నాయి. భారీ పిడుగులతో మధ్యాహ్నం, రాత్రి అర్ధరాత్రి భారీ వర్షాలుంటాయి. కానీ మే 1న ఈ వర్షాలు కోస్తాంధ్ర వైపుగా వెళ్తాయి’’ అని ఏపీ వెదర్ మ్యాన్ వివరించారు.