కరోనా, కోర్టు కేసులు, ఇతర పరిస్థితుల నేపథ్యంలో నూతన సచివాలయ భవన సముదాయ నిర్మాణ పనులు 2021 జనవరిలో ప్రారంభమయ్యాయి. 28 ఎకరాల్లోని విశాల స్థలంలోని 7,79,982 చదరపు అడుగులు విస్తీర్ణంలో 265 అడుగుల ఎత్తుతో భవనం నిర్మించారు. ఇంత ఎత్తైన సచివాలయం ఏ రాష్ట్రంలోనూ లేదు. కొత్త సచివాలయం భిన్న సంస్కృతుల సమ్మేళనం. దేశంలోని అతిపెద్ద సచివాలయాల్లో ఇదీ ఒకటి. భవనం పైన ఏర్పాటుచేసిన సౌర ఫలకాలతో సచివాలయంలో వినియోగించే దీపాలకు అవసరమైన విద్యుత్తును సోలార్ పద్ధతిలో ఉత్పత్తి చేస్తున్నారు. పనులు మొదలయ్యాక 26 నెలల రికార్డు సమయంలో సచివాలయ నిర్మాణాన్ని పూర్తి చేశారు. ఇంత భారీ నిర్మాణానికి సాధారణంగా ఐదేళ్ళైనా పడుతుంది. కానీ రెండేళ్లలోనే ఫినిష్ చేశారు.


కళ్లు చెదిరే కట్టడం ప్రత్యేకతలు ఇవే


డోమ్స్‌, పిల్లర్ల నిర్మాణం కోసం గాల్వనైజ్డ్ రీఇన్ఫోర్స్ కాంక్రీట్ (జీఆర్ సీ) టెక్నాలజీని వినియోగించారు.



  • ఈ విధానంలో పిల్లర్ల తయారీకే 6 నెలల సమయం పట్టింది.

  • రోజూ 3 వేల మందికి పైగా కార్మికులు పనిచేశారు.

  • మొత్తం 1000 లారీల రెడ్ శాండ్ స్టోన్ వినియోగించారు

  • భవన నిర్మాణానికి రూ.617 కోట్ల మేర పరిపాలన అనుమతులు ఇచ్చారు.

  • ఇప్పటి వరకు రూ.550 కోట్ల వరకు ఖర్చు చేశారు.

  • అనుకున్న దానికంటే 20-30 శాతం వ్యయం పెరిగింది.

  • ఎప్పటికప్పుడు సీఎం కేసీఆర్ పర్యవేక్షించడం, అన్ని పనులు ఒకే నిర్మాణ సంస్థకు అప్పగించడం వల్ల త్వరగా పూర్తయింది.

  • ఆరు అంతస్తులతో నిర్మించిన సచివాలయంలో 635 గదులు ఉన్నాయి.

  • ఏసీ కోసం ప్రత్యేకంగా ఒక ప్లాంటునే నెలకొల్పారు.

  • 24 లిఫ్టులను ఏర్పాటు చేశారు.

  • అన్ని రకాల అవసరాల కోసం 5.60 లక్షల లీటర్ల నిల్వ ఉంచేలా ఏర్పాట్లు చేశారు.

  • కరెంట్ పొదుపు చేయడానికి సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

  • ప్రత్యేకంగా 30 కాన్ఫరెన్స్ హాళ్లను ఏర్పాటు చేశారు.

  • ఇక్కడి నుంచే క్షేత్రస్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ లు నిర్వహించే అవకాశం ఉంది.

  • మొత్తం 28 ఎకరాల విస్తీర్ణం అయితే, అందులో రెండున్నర ఎకరాల్లో భవనాన్ని నిర్మించారు.

  • సచివాలయం ముందువైపు రెండు బ్యాంకులు, పోస్ట్ ఆఫీస్, ఏటీఎమ్ సెంటర్లు, రైల్వే కౌంటర్, బస్ కౌంటర్, క్యాంటీన్ ఉన్నాయి.

  • వెనుకవైపు ఉద్యోగుల అసోసియేషన్, ఇండోర్ గేమ్స్, హౌసింగ్ సొసైటీ కార్యాలయాల కోసం నాలుగు అంతస్తులతో ఒక బిల్డింగ్ ను నిర్మించారు.

  • సచివాలయంతో పాటు గుడి, మసీదు, చర్చిలను కూడా నిర్మించారు. వాటి పక్కనే ముందువైపు రిసెప్షన్ హాల్, ఎన్ ఆర్ ఐ సెంటర్, పబ్లిసిటీ సెల్ పక్కనే మీడియా కోసం గదులు నిర్మించారు.

  • మంత్రులు మొదలుకుని అధికారులందరూ ఇక్కడే ఉండడంతో సమస్యలతో వచ్చే ప్రజలకు వెంటనే పరిష్కారం లభిస్తుంది.

  • భద్రత దృష్ట్యా స్మార్ట్ కార్డుతో కూడిన పాస్‌లు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నారు.

  • ఆరో అంతస్తుపైన డోమ్‌కు మధ్య 4,500 చదరపు అడుగుల చొప్పున రెండు అంతస్తులను నిర్మించారు.

  • రాష్ట్ర పర్యటనకు వచ్చే రాష్ట్రపతి, ప్రధానమంత్రితో పాటు విదేశీ అతిధుల కోసం వీటిని వినియోగిస్తారు. వీటిలో పర్షియన్ మోడల్లో రాయల్ డైనింగ్ హాల్స్ ను ఏర్పాటు చేశారు.

  • వీటితో పాటు రాయల్ కాన్ఫరెన్స్ హాళ్లను కూడా నిర్మించారు.

  • మొత్తం 4 ద్వారాలను ఏర్పాటు చేశారు.

  • తూర్పు వైపు ఉన్న ప్రధాన ద్వారం నుంచి సీఎం, సీఎస్, డీజీపీ, మంత్రులు, ప్రజాప్రతినిధులు వస్తారు.

  • పడమర వైపు ద్వారాన్ని అత్యవసర పరిస్థితుల్లో వినియోగిస్తారు.

  • ఈశాన్య గేటు నుంచి అన్ని శాఖల ఉద్యోగులు వస్తారు.

  • ఆగ్నేయ ద్వారం నుంచి సందర్శకులు వస్తారు.

  • ప్రతీ చోట ఎక్కడికక్కడే పార్కింగ్ సౌకర్యం కల్పించారు.

  • విశాలమైన పచ్చిక బయళ్లు, భారీ ఫౌంటెయిన్లతో ఆకట్టుకుంటున్న సచివాలయ భవనం.

  • విద్యుత్ దీపాలతో పాలనా సౌధం ధగధగలాడుతోంది.

  • విశాలమైన పచ్చిక బయళ్లు, భారీ ఫౌంటెయిన్లతో చూపర్లను ఆకట్టుకుంటోంది.

  • ఎత్తైన స్థంభాలు, భారీ గుమ్మటాలతో ఆకర్షణీయంగా కనిపిస్తోంది.

  • విశాలమైన పోర్టికోతో ఉన్న ప్రధాన ముఖద్వారం సచివాలయ సౌధం అందాన్ని ద్విగుణీకృతం చేస్తోంది.

  • ఇదంతా కేసీఆర్ మదిలో నుంచి వచ్చిన ఆలోచనే.