‘‘నిన్న దక్షిణ ఒడిశా, పరిసరాల్లోని ఉత్తర ఆంధ్రప్రదేశ్ వద్ద ఉన్న అల్పపీడనం ఈ రోజు బలహీన పడింది. ఈ రోజు షీయర్ జోన్ 18°N అక్షాంశం వెంబడి సగటు సముద్ర మట్టం నుండి 5.8 కిమీ ఎత్తు వద్ద  కొనసాగుతూ ఉంది. ఈ రోజు దిగువ స్థాయిలోని గాలులు పశ్చిమ దిశ నుండి తెలంగాణ రాష్ట్రం వైపునకు వీస్తున్నాయి’’ అని హైదరాబాద్ లోని వాతావరణ కేంద్రం అధికారులు శుక్రవారం (జూలై 28) ఓ ప్రకటనలో వెల్లడించారు.


తగ్గనున్న వర్షాలు
ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో  తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు చాలా చోట్ల రేపు, ఎల్లుండి కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈ రోజు భారీ వర్షాలు  తెలంగాణలో అదిలాబాద్, నిర్మల్, కొమురం భీమ్, మంచిర్యాల జయశంకర్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అక్కడక్కడ వచ్చే అవకాశాలు ఉన్నాయి.


ప్రస్తుతం తెలంగాణపై నైరుతి పవనాల ప్రభావం అత్యధికంగా ఉంది. గత 24 గంటల్లో నిజామాబాద్, నిర్మల్, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల తదితర చోట్ల భారీ వర్షాలు కురిశాయి. ఇకపై వచ్చే 5 రోజుల పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు మాత్రమే పడే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.


హైదరాబాద్ లో ఆకాశం మేఘావృతం అయి కనిపించనుంది. నగరంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 27 డిగ్రీలు, 22 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఉపరితల గాలులు గంటకు 8 నుంచి 12 కిలో మీటర్ల వేగంతో పశ్చిమ దిశగా ఉండే అవకాశం ఉంది. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 24.4 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 21.7 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది.


ఏపీలో ఇలా
ఏపీలో గడచిన 48 గంటలు భారీ నుంచి అతి భారీ వర్షాలు ముఖ్యంగా కోస్తాంధ్ర జిల్లాలను ముంచెత్తింది. అటు ఉత్తరాంధ్ర జిల్లాలు, అటు మధ్య ఆంధ్ర జిల్లాల్లో బాగా పడింది. అత్యధికంగా శ్రీకాకుళం జిల్లాలోని టమాడ లో 218 మిల్లీమీటర్లు నమోదయ్యింది. విశాఖ నగరంలో అత్యధికంగా సీతమ్మధారలో 112 మిల్లీమీటర్ల అతిభారీ వర్షాలు నమోదయ్యింది. ప్రకాశం తీర ప్రాంతాల నుంచి కాకినాడ జిల్లా వరకు మొన్న రాత్రి నుంచి మోస్తరు నుంచి భారీ వర్షాలు పడ్డాయి. అలాగే ఉత్తరాంధ్ర మీదుగా వాయుగుండం వెళ్లింది కాబట్టి భారీ నుంచి అతిభారీ వర్షాలు పడ్డాయి. నేటి నుంచి వర్షాలు తగ్గుముఖం పట్టనుంది. అటు ఉత్తరాంధ్రలోను, అటు కోస్తాంధ్ర​, రాయలసీమలోనూ వర్షాలు తగ్గుముఖం పట్టనుంది.


రాష్ట్రమంతటా భారీ నుంచి అతిభారీ వర్షాలు తగ్గుముఖం పట్టినట్టేనని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. శనివారం, ఆదివారం తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకట్రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. అలాగే బలమైన గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో వీచే ఛాన్స్ ఉందని వాతావరణ అధికారులు అన్నారు. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లోనూ శని, ఆదివారాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల, బలమైన గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వీచే అవకాశం ఉందని అంచనా వేశారు. రాయలసీమలో రేపు, ఎల్లుండి తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి రెండు ప్రాంతాల్లో పడే ఛాన్స్, 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు పలు చోట్ల వీచే అవకాశం ఉంది.