‘‘నిన్నటి తీవ్రఅల్పపీడనం ఈ రోజు అల్పపీడనంగా బలహీన పడి ప్రస్తుతం దక్షిణ ఒడిశా, పరిసరాల్లోని ఉత్తర ఆంధ్రప్రదేశ్ వద్ద కొనసాగుతుంది. ఈ అల్పపీడనంకి అనుబంధంగా ఉన్న ఆవర్తనం సగటు సముద్ర మట్టం నుండి 7.6 కి మి ఎత్తు వరకు కొనసాగుతుంది. రుతుపవన ద్రోణి ఈ రోజు బికనేర్, కోట, రైజన్, దుర్గ్, దక్షిణ ఒడిశా, పరిసరాల్లోని ఉత్తర ఆంధ్రప్రదేశ్ లోని అల్పపీడన ప్రాంతము మీదగా తూర్పు ఆగ్నేయ దిశగా పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు సగటు సముద్ర మట్టానికి 1.5 కి.మీ ఎత్తు వరకు విస్తరించి ఉంది.
ఈ రోజు షీయర్ జోన్ 18°N అక్షాంశం వెంబడి సగటు సముద్ర మట్టం నుండి 3.1 కిమీ నుండి 7.6 కిమి ఎత్తువరకు స్థిరంగా కొనసాగుతూ ఎత్తుకు వెళ్లే కొలది దక్షిణ దిశ వైపు వంగి ఉంది’’ అని హైదరాబాద్ లోని వాతావరణ కేంద్రం అధికారులు గురువారం (జూలై 27) ఓ ప్రకటనలో వెల్లడించారు.
అసాధారణ వర్షాలు
నేడు భారీ నుండి అతి భారీ వర్షాలతో పాటు అత్యంత భారీ వర్షాలు (అసాధారణమైన వర్షం (>24 cm)) తెలంగాణ రాష్ట్రంలో నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.
భారీ నుండి అతి భారీ వర్షాలు తెలంగాణ రాష్ట్రంలో ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, మహబూబ్ నగర్ జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.
భారీ వర్షాలు తెలంగాణ రాష్ట్రంలో నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో ఈదురు గాలులు గాలి వేగం గంటకు 40-50 కి.మీ.తో వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
ఏపీలో ఇలా
ఎగువ రాష్ట్రాల్లో భారీ వర్షాల ప్రభావంతో గోదావరి వరద ఉధృతి ధవళేశ్వరం వద్ద మరో రెండు రోజులు వరకు పెరుగున్నట్లు విపత్తుల సంస్థ ఎండి డా.బిఆర్ అంబేద్కర్ తెలిపారు. గురువారం రాత్రి 7 గంటలకు గోదావరి వరద ప్రవాహం భద్రాచలం వద్ద రెండవ ప్రమాద హెచ్చరిక కోనసాగుతుందని నీటిమట్టం 47.80 అడుగులు, ధవళేశ్వరం బ్యారేజి వద్ద ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 13.05 లక్షల క్యూసెక్కులు ఉందని రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసినట్లు వెల్లడించారు.
రెండవ ప్రమాద హెచ్చరిక వలన ప్రభావితమయ్యే అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి, ఏలూరు, కాకినాడ, కోనసీమ, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని 42 మండలాల్లో 458 గ్రామాల వరకు క్షేత్రస్థాయిలో నిరంతరం అప్రమత్తం చేస్తున్నామని తెలిపారు.
విపత్తుల సంస్థ ఎప్పటికప్పుడు వరద ప్రవాహాన్ని పర్యవేక్షిస్తూ సంబంధిత జిల్లాల యంత్రాంగానికి సూచనలు జారీ చేస్తున్నామన్నారు. అత్యవసర సహాయక చర్యలకోసం 3NDRF, 4 SDRF మొత్తం 7 బృందాలు ఉన్నట్లు విపత్తుల సంస్థ ఎండి తెలిపారు. ప్రజల ఫోన్లకు హెచ్చరిక, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సందేశాలు పంపుతున్నామన్నారు. పూర్తిస్థాయిలో వరద తగ్గే వరకు గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మరో వైపు ప్రకాశం బ్యారేజి వద్ద 1.42 లక్షల ఔట్ ఫ్లో ఉందని కృష్ణా లొతట్టు ప్రాంత ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రజలు అత్యవసర సహాయం, సమాచారం కోసం 24 గంటలు అందుబాటులో ఉండే స్టేట్ కంట్రోల్ రూమ్ నెంబర్లు 1070, 1800 425 0101 సంప్రదించాలన్నారు.