హైదరాబాద్ లోని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపిన వివరాల మేరకు.. నిన్నటి తీవ్ర అల్పపీడనం ఈ రోజు కూడా ఉత్తర ఆంధ్రప్రదేశ్ - దక్షిణ ఒడిశా తీరాల్లోని, పశ్చిమ మధ్య, పరిసరాల్లోని వాయువ్య బంగాళాఖాతంలో స్థిరంగా ఉంది. తీవ్ర అల్పపీడనానికి అనుబంధంగా ఉన్న ఆవర్తనం సగటు సముద్ర మట్టం నుండి 7.6 కి మి ఎత్తు వరకు స్థిరంగా కొనసాగుతుంది. ఈ తీవ్ర అల్పపీడనం వాయువ్య దిశగా  నెమ్మదిగా కదులుతూ ఉత్తర ఆంధ్రప్రదేశ్- దక్షిణ ఒడిస్సా తీరాలను చేరుకునే అవకాశం ఉంది.


రుతుపవన ద్రోణి ఈ రోజు జైసల్మేర్, కోట, రైజన్, మాండ్ల, దుర్గ్, పశ్చిమ మధ్య మరియు ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతం మీదుగా ఉత్తర ఆంధ్రప్రదేశ్-దక్షిణ ఒడిశా తీరాల మీదుగా ఉన్న అల్పపీడన ప్రాంత కేంద్రం గుండా వెళుతుంది. అక్కడి నుండి తూర్పు-ఆగ్నేయ దిశగా తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు సగటు సముద్ర మట్టానికి 1.5 కి.మీ ఎత్తు వరకు విస్తరించి ఉంది. ఈ రోజు  షీయర్ జోన్ 20°N అక్షాంశం వెంబడి సగటు సముద్ర మట్టం నుండి 3.1 కిమీ నుండి 7.6 కిమి ఎత్తువరకు స్థిరంగా కొనసాగుతూ ఎత్తుకు వెళ్లే కొలది దక్షిణ దిశ వైపు వంగి ఉంది.


ఈ జిల్లాల్లో అతి భారీ, అత్యంత భారీ వర్షాలు (రెడ్ అలర్ట్)
భారీ నుండి అతి భారీ వర్షాలతో పాటు అత్యంత భారీ వర్షాలు తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. భారీ నుండి అతి భారీ వర్షాలు తెలంగాణ రాష్ట్రంలో కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.


భారీ వర్షాలు తెలంగాణ రాష్ట్రంలో ఆదిలాబాద్, నిర్మల్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో ఈదురు గాలులు గాలి వేగం గంటకు 40-50 కి.మీ.తో వీచే అవకాశం ఉంది.


ఏపీలో ఇలా
ఐఎండీ అంచనా ప్రకారం పశ్చిమ మధ్య, దానిని ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతం మీదుగా ఉత్తరాంధ్ర - దక్షిణ ఒడిశా తీరంలో అల్పపీడనం కేంద్రీకృతమైందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డా. బి.ఆర్ అంబేద్కర్ వెల్లడించారు. ఇది నెమ్మదిగా వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉందన్నారు. దీని ప్రభావంతో రాష్ట్రంలో  విస్తారంగా వర్షాలు పడతాయన్నారు. రేపు అక్కడక్కడ భారీ వర్షాలు, ఎల్లుండి నుంచి తేలికపాటి  నుంచి  మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందన్నారు.


రేపు (జూలై 27) అల్లూరి సీతారామరాజు, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగిలిన చోట్ల  మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని అలాగే శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, కోనసీమ, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్ఆర్, శ్రీ సత్యసాయి, అనంతపురం జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడనున్నట్లు చెప్పారు.


ప్రస్తుత వాతావరణ అంచనా బట్టి ఎల్లుండి నుంచి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడనున్నట్లు వివరించారు. భారీ వర్షాలు, వరదలు  నేపధ్యంలో ప్రభావిత జిల్లాల యంత్రంగాన్ని అప్రమత్తం చేసి తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా సూచించారు.


బుధవారం (జూలై 26) సాయంత్రం 6 గంటల నాటికి  శ్రీకాకుళం జిల్లా తామడలో 145 మిమీ, విజయనగరం జిల్లా గోవిందపురంలో 136 మిమీ, శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లలో 114 మిమీ, విశాఖపట్నంలో 111 మిమీ అధిక వర్షపాతం, దాదాపు 41 ప్రాంతాల్లో 60 మి.మీ కన్నా ఎక్కువ వర్షపాతం నమోదైందని తెలిపారు.