‘‘నిన్నటి అల్పపీడనం ఈ రోజు ఉదయం తీవ్ర అల్పపీడనంగా బలపడి ప్రస్తుతం ఉత్తర ఆంధ్రప్రదేశ్ - దక్షిణ ఒడిశా తీరాల్లోని, పశ్చిమ మధ్య పరిసరాల్లోని వాయువ్య బంగాళాఖాతంలో సగటు సముద్ర మట్టం నుండి 7.6 కి.మీ ఎత్తు వరకు కొనసాగుతుంది.
ఈ తీవ్ర అల్పపీడనం సుమారుగా రాగల 24 గంటలలో వాయుగుండంగా బలపడే అవకాశం ఉంది. ఈ వాయుగుండం నెమ్మదిగా వాయువ్య దిశగా కదులుతూ ఉత్తర ఆంధ్రప్రదేశ్- దక్షిణ ఒడిశా తీరాలను చేరుకునే అవకాశం ఉంది. రుతుపవన ద్రోణి ఈ రోజు జైసల్మేర్, కోట, గుణ, రాయ్‌పూర్, భవానీపట్నం, పశ్చిమ మధ్య, ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతం మీదుగా ఉత్తర ఆంధ్రప్రదేశ్-దక్షిణ ఒడిశా తీరాల మీదుగా ఉన్న అల్పపీడన ప్రాంత కేంద్రం గుండా వెళుతుంది. అక్కడి నుండి తూర్పు-ఆగ్నేయ దిశగా తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు సగటు సముద్ర మట్టానికి 1.5 కి.మీ ఎత్తు వరకు విస్తరించి ఉంది.’’ అని హైదరాబాద్ లోని వాతావరణ కేంద్రం అధికారులు సోమవారం (జూలై 25) ఓ ప్రకటనలో వెల్లడించారు.
ఈ రోజు షీయర్ జోన్ 17°N అక్షాంశం వెంబడి సగటు సముద్ర మట్టం నుండి 5.8 కిమీ నుండి 7.6 కిమి ఎత్తువరకు స్థిరంగా కొనసాగుతూ ఎత్తుకు వెళ్లే కొలది దక్షిణ దిశ వైపు వంగి ఉంది. రాగల మూడు రోజులు భారీ వర్షాలు కొన్ని చోట్ల, భారీ నుండి అతిభారీ వర్షాలతో పాటు అత్యంత భారీ వర్షాలు తెలంగాణలో కొన్ని జిల్లాలలో అక్కడక్కడ వచ్చే అవకాశాలు ఉన్నాయి. రాగల 4 రోజులు తెలంగాణ రాష్ట్రంలో ఉరుములు మెరుపులతో పాటు ఈదురుగాలులు, గాలి వేగం గంటకు 40 నుండి 50 కి.మీ. వేగంతో వీచే అవకాశం ఉంది.
ఈ జిల్లాల్లో అతి భారీ, అత్యంత భారీ వర్షాలు (రెడ్ అలర్ట్)
ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలతో పాటు అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ఆరెంజ్ అలర్ట్ ఈ జిల్లాల్లో
నిజామాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్, హన్మకొండ, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్ గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగిలిన జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేశారు.
ఏపీలో ఇలా
రాష్ట్రంలో మరో మూడు రోజులు విస్తారంగా వర్షాలు పడతాయని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డా. బి.ఆర్ అంబేద్కర్ అన్నారు. రేపు అక్కడక్కడ భారీ వర్షాలు ఎల్లుండి నుంచి రెండు రోజు లపాటు మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించారు.
నేడు అల్లూరి సీతారామరాజు, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు, మిగిలిన చోట్ల మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని అలాగే శ్రీకాకుళం, పార్వతీపురంమన్యం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, కోనసీమ, పశ్చిమగోదావరి, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్ఆర్, శ్రీ సత్యసాయి, అనంతపురం జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడనున్నట్లు వివరించారు. భారీ వర్షాలు నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రైతులు వ్యవసాయ పనుల్లో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఉరుములతో కూడిన వర్షం కురిసేపుడు వ్యవసాయ పనుల్లోని రైతులు, పొలాల్లో పనిచేసే కూలీలు, గొర్రెల కాపరులు చెట్ల కింద ఉండరాదని అన్నారు.