'బ్రో' (Bro The Avatar Movie) కోసం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) 21 రోజులు మాత్రమే షూటింగ్ చేశారు. ఇది ఎవరో చెప్పింది కాదు, ప్రీ రిలీజ్ వేడుక (Bro Movie Pre Release Event)లో ఆయన నోటి వెంట వచ్చిన మాటే. ఇంతకు ముందు కూడా 'బ్రో' సినిమా షూటింగ్ డేస్, రెమ్యూనరేషన్ గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడారు. అందువల్ల, సినిమాలో ఆయన కొంత సేపు మాత్రమే కనపడతారని, అతిథి పాత్రల కంటే కాస్తంత ఎక్కువ నిడివి ఉంటుందని భావించారంతా! ఆ రకమైన ఊహాగానాలకు పవన్ కళ్యాణ్ చెక్ పెట్టారు. 


గెస్ట్ రోల్ కాదు... 80 పర్సెంట్ ఉంటా! - పవన్ కళ్యాణ్
తన రాజకీయ షెడ్యూళ్ళను దృష్టిలో పెట్టుకుని 'బ్రో' చిత్ర నిర్మాతలు అన్ని చోట్లా సెట్స్ వేసి రెడీగా పెట్టారని పవన్ కళ్యాణ్ తెలిపారు. వాళ్ళకు తాను సమయం ఇవ్వడమే తప్ప, మరొకటి ఏదీ లేదన్నారు. ఇంకా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ''ఉదయం ఏడు గంటలకు షూటింగుకు వెళ్ళేవాడిని. నేను షూటింగ్ చేసిన 21 రోజుల్లో ప్రతి రోజూ ఆరు నుంచి ఎనిమిది గంటలు పని చేశా. 80 పర్సెంట్ సినిమాలో ఉంటాను. ఇది గెస్ట్ క్యారెక్టర్ ఏమీ కాదు. కాకపోతే సినిమాను చాలా ఫాస్ట్ ఫాస్ట్ గా చేశారు. ఇలా చేయడానికి మూల కారణం నిర్మాతలు టీజీ విశ్వప్రసాద్ గారు, వివేక్ కూచిభొట్ల గారు'' అని చెప్పారు.


Also Read : తమిళ చిత్రసీమ తమిళులకే అంటే ఎలా? మీరూ 'ఆర్ఆర్ఆర్' తీయాలి - పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి


టీజీ విశ్వప్రసాద్ గారు అమెరికాలో ఉంటున్నప్పటికీ... తెలుగు సినిమాపై ప్రేమతో ఎంతో ప్రతిషాత్మకంగా సినిమాలు నిర్మిస్తున్నారని పవన్ కళ్యాణ్ చెప్పారు. 'బ్రో' సినిమాను కూడా ప్రతిషాత్మకంగా తెరకెక్కించారని ఆయన వివరించారు.


దర్శకుడు సముద్రఖనిపై ప్రశంసల జల్లు
'బ్రో' చిత్ర దర్శకుడు సముద్రఖనిపై పవన్ కళ్యాణ్ ప్రశంసల జల్లు కురిపించారు. ఈ సినిమా కోసం ఆయన తెలుగు నేర్చుకున్నారని, తనకు తెలుగులో స్క్రిప్ట్ చదివి వినిపించారని చెప్పుకొచ్చారు. పూర్తిస్థాయిలో తెలుగు మాట్లాడలేకపోతున్న వాళ్ళు అందరికీ సముద్రఖని కమిట్మెంట్ ఒక చెంపపెట్టు లాంటిదని పవన్ అన్నారు. 'బ్రో' ప్రీ రిలీజ్ వేదికపై సముద్రఖనిని ఒక ప్రామిస్ చేశారు. తనకు తమిళ్ వచ్చు అని, అయితే ఇంకా నేర్చుకుని తమిళంలో తిరుక్కళ్ చెబుతానని ఆయన చెప్పారు. 


Also Read పవన్ కళ్యాణ్ దైవాంశ సంభూతుడు, గెలిపించాలి - బ్రహ్మానందం సంచలన వ్యాఖ్యలు


'బ్రో'లో పవన్ కళ్యాణ్, ఆయన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej) నటించారు. ఈ శుక్రవారం (ఈ నెల 28న) ప్రేక్షకుల ముందుకు సినిమాను తీసుకు వస్తున్నారు. 


ఈ సినిమాకు సముద్రఖని దర్శకత్వం వహించారు. ఆయన తీసిన తమిళ హిట్ 'వినోదయ సీతం' ఆధారంగా రూపొందిన చిత్రమిది. అయితే... తెలుగులో పవన్ కళ్యాణ్ ఇమేజ్ దృష్టిలో పెట్టుకుని, తెలుగు నేటివిటీకి తగ్గట్లు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు, స్క్రీన్ ప్లే అందించారు. ఈ చిత్రానికి టీజీ విశ్వప్రసాద్ నిర్మాత. తమన్ సంగీత దర్శకుడు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, జీ స్టూడియోస్ సంస్థలు తెరకెక్కించాయి. సాయి తేజ్ జోడీగా కేతికా శర్మ, కీలక పాత్రలో ప్రియా ప్రకాష్ వారియర్ నటించారు. 'మై డియర్ మార్కండేయ' పాటలో ఊర్వశి రౌతేలా స్టెప్పులు వేశారు.





ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial