నటన & నిర్మాణం... టాక్ & కుకింగ్ షోలు... సినిమాలతో బిజీగా ఉంటూ సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు మంచు లక్ష్మీ. ప్రస్తుతం ‘అగ్నినక్షత్రం’ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న ఆమె... మొట్టమొదటిసారి తన తండ్రితో కలిసి పూర్తిస్థాయి సినిమాలో కనిపించనున్నారు. ఈ క్రమంలోనే తాను స్థాపించిన స్వచ్ఛంద సంస్ధ ‘టీచ్ ఫర్ ఛేంజ్’ ద్వారా హైదరాబాద్‌తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో పలు ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకుంటూ వస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలనే లక్ష్యంతో వాటిని దత్తత తీసుకుని డిజిటలైజ్ చేస్తున్నారు. ఇప్పటి వరకు 167 పాఠశాలలను దత్తత తీసుకున్నారు. హైదరాబాద్‌లో 15, రంగారెడ్డిలో 25, యాదాద్రిలో 81, శ్రీకాకుళంలో 16, ఇటీవల గద్వాలలో 30 స్కూళ్లను ఆమె దత్తత తీసుకున్నారు.
మారుతున్న కాలానికి తగ్గట్టుగా వినూత్నమైన బోధనా పద్ధతులతో ప్రస్తుత విద్యా వ్యవస్థకు భిన్నంగా, పిల్లలను చదువులో చురుకుగా చేసేందుకు టీచ్ ఫర్ ఛేంజ్ సంస్థ ప్రయత్నిస్తోంది. మంచు లక్ష్మి తీసుకున్న ఈ నిర్ణయం ఎంతో మంది పేద విద్యార్థులకు భవిష్యత్ ను నిర్ణయిస్తోంది. దీని వల్ల ఇప్పటివరకు 16,497 మంది విద్యార్థులు లబ్ధి పొందారు. ఒకవైపు సినిమాలు చేస్తూనే.. మరోవైపు టీచ్ ఫర్ ఛేంజ్ బాధ్యతలు చూసుకుంటూ మల్టీ టాస్కింగ్ చేస్తున్నారు లక్ష్మి. అయినప్పటికీ తన మల్టీటాస్కింగ్ స్కిల్స్‌తో రెండు పడవలను బ్యాలెన్స్ చేస్తూ తన సత్తా చాటుకుంటున్నారు.
"పాఠశాలల ఎంపికలో మేము నిర్దిష్ట ప్రమాణాలను పాటిస్తున్నాం. 1 నుంచి 5వ తరగతి వరకు ఉండే ప్రాథమిక పాఠశాలల్లో కనీసం 50 విద్యార్థులు ఉండే పాఠశాలలను ఎంపిక చేస్తాం. అలాగే, ఏ పాఠశాల్లో అస్సలు డిజిటల్ క్లాస్‌రూంల యాక్సెస్ లేదో చూస్తాం. టీచ్ ఫర్ ఛేంజ్ స్మార్ట్ క్లాస్‌రూం పాఠ్యాంశాలను స్వీకరించడానికి ఆయా పాఠశాలలు సుముఖంగా ఉన్నాయా లేదా చూస్తాం. అలాగే, విద్యార్థుల పురోగతిని పరీక్షించడంలో భాగంగా బేస్‌లైన్, మిడ్‌లైన్, ఎండ్‌లైన్ పరీక్షలు నిర్వహించడానికి ఆయా పాఠశాలలు సంసిద్ధంగా ఉండాలి" అని మంచు లక్ష్మి ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు.
ఇక మంచు లక్ష్మి 'టీచ్ ఫర్ ఛేంజ్' మేనేజింగ్ ట్రస్టీగా కొనసాగుతూ కీలక బాధ్యతను పోషిస్తున్నారు. 'టీచ్ ఫర్ ఛేంజ్' చేపడుతున్న కార్యక్రమాల్లో భాగంగా ప్రతిరోజూ జరిగే కార్యకలాపాలను ఆమె క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. కేవలం పాఠశాలలను ఎంపిక చేయడం మాత్రమే కాకుండా ప్రతీ పాఠశాలల్లో జరిగే ట్రైనింగ్ పైనా ఆమె దృష్టి పెడతున్నారు. ఉపాధ్యాయులకు తమ నుంచి ఎలాంటి సహకారం అందుతోంది వంటి విషయాలను ఆమె ఎప్పటికప్పుడు అడిగి తెలుసుకుంటున్నారు. దీని వల్ల టీచ్ ఫర్ ఛేంజ్ ప్రతినిధులు ఆడియో-వీడియో పాఠ్యాంశాలను రూపొందించడం, నివేదికలను తయారుచేయడం, పిల్లల పురోగతిని అంచనా వేయడంలో చురుకుగా పాల్గొంటున్నారు.
ఒకవైపు నటిగా, నిర్మాతగా తనకు కమిట్‌మెంట్స్ ఉన్నా.. ‘అగ్ని నక్షత్రం’ పోస్ట్ ప్రొడక్షన్ పనులలో పాల్గొంటున్నా.. తన విలువైన సమయాన్ని ఎఫెక్టివ్‌గా వాడుకుంటున్నారు లక్ష్మి. ‘నాకు మల్టీటాస్కింగ్ అంటే చాలా ఇష్టం. దానికి అనుగుణంగానే నేను నా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటాను. నా టీమ్‌కు నేను అన్ని వేళలా అందుబాటులో ఉంటాను. ప్రముఖులతో జరిగే సమావేశాల్లో నేను స్వయంగా పాల్గొంటాను. నాకు ఒక మంచి డెడికేటెడ్ టీమ్ దొరకడం నా అదృష్టం’ అని లక్ష్మి ఈ సందర్భంగా వెల్లడించారు.
Read Also : Peddha Kapu Songs : 'పెద కాపు'లో తొలి పాట - రెండు రోజుల్లో విడుదల
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial