తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు పడిపోవడంతో చలి విపరీతంగా పెరిగిపోతోంది. రాత్రి నుంచి మరుసటి రోజు ఉదయం ఎండ కాసేంతవరకూ ఇళ్ల నుంచి బయటకు రావడానికి కూడా ఇబ్బంది జనం పడుతున్నారు. అత్యల్ప స్థాయిలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు అవుతుండటంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. వచ్చే ఐదు రోజులకు సంబంధించి హైదరాబాద్ వాతావరణ కేంద్రం రాష్ట్రంలో నెలకొనే వాతావరణ అంచనాలను విడుదల చేసింది. దీని ప్రకారం.. 


డిసెంబరు 23న తెలంగాణలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. కానీ, ఉష్ణోగ్రతలు మాత్రం రాత్రి వేళ అత్యల్పంగా నమోదు కానున్నాయి. కొన్ని చోట్ల సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది. ఆ తర్వాత 24వ తేదీ నుంచి 26వ తేదీ వరకూ తెలంగాణలో పొడి వాతావరణమే ఉండనుంది. చలికి సంబంధించి ఎలాంటి హెచ్చరికలు జారీ చేయలేదు.






గడిచిన 24 గంటల్లో మాత్రం ఆదిలాబాద్ జిల్లాలో అత్యల్పంగా 6.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లుగా హైదరాబాద్ వాతావరణ విభాగం ట్వీట్ చేసింది. ఆ తర్వాత మెదక్‌లో 8.3 డిగ్రీలు, రామగుండంలో 10.4, హన్మకొండలో 10.5 డిగ్రీల చొప్పున కనిష్ఠంగా నమోదైంది. హైదరాబాద్‌లో మాత్రం బేగంపేటలో 11.2, రాజేంద్రనగర్‌లో 8, హయత్ నగర్‌‌లో 9, హకీంపేట్‌లో 13.3, పటాన్ చెరులో 8 డిగ్రీల చొప్పున కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. 


Also Read: Delmicron Varient: ఒమిక్రాన్ తర్వాత పొంచి ఉన్న మరో వేరియంట్, ఆ రెండూ కలిసిపోయి కొత్తగా.. దీని తీవ్రత ఎంతంటే..!


ఏపీలో ఇలా..
అమరావతిలోని వాతావరణ కేంద్రం ట్వీట్ చేసిన వివరాల ప్రకారం.. రాగల ఐదు రోజుల్లో ఉత్తర కోస్తా యానం ప్రాంతాల్లో పొడి వాతావరణం ఉంటుంది. కనిష్ఠ ఉష్ణోగ్రతలు సగటు ఉష్ణోగ్రతల కంటే 2 నుంచి 4 డిగ్రీల సెంటీగ్రేడ్ తక్కువగా నమోదయ్యే అవకాశం ఉంటుంది. దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో కూడా పొడి వాతావరణం ఉంటుంది. కనిష్ఠ ఉష్ణోగ్రతలు సగటు ఉష్ణోగ్రతల కంటే 2 నుంచి 4 డిగ్రీల సెంటీగ్రేడ్ తక్కువగా నమోదయ్యే అవకాశం ఉంటుంది.






కోస్తాంధ్ర తీర ప్రాంతంలో ఉత్తర దిశ నుంచి గాలులు వీస్తున్నాయి. రాయలసీమలో, తెలంగాణలో ఈశాన్య దిశ నుంచి బలమైన గాలులు వీస్తున్నాయని వీటి ప్రభావంతో ఉష్ణోగ్రతలు పడిపోతాయని వాతావరణ కేంద్రం తెలిపింది.


విజయవాడలో 50 ఏళ్ల రికార్డు
అయితే, ఏపీ వెదర్ మ్యాన్ వెల్లడించిన వివరాల ప్రకారం.. విజయవాడలో రికార్డు స్థాయిలోనే కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. డిసెంబరు 22న విజయవాడలో 12.9 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదు అయింది. గత 50 ఏళ్లలో ఇంత తక్కువ ఉష్ణోగ్రత ఎప్పుడూ నమోదు కాలేదని ఏపీ వెదర్ మ్యాన్ వెల్లడించారు.



Also Read: Corona Cases: దేశంలో కొత్తగా 6,317 మందికి కరోనా.. 213కు చేరిన ఒమిక్రాన్ కేసుల సంఖ్య


Also Read: Divorce: దుబాయ్ రాజు విడాకులు.. భార్యకు భరణం ఎన్ని కోట్లు చెల్లించాలో తెలుసా


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి