ఈ రోజు ద్రోణి / గాలిలోని అనిచ్చితి  వాయువ్య మధ్యప్రదేశ్ నుండి ఇంటీరియర్ మహారాష్ట్ర, ఇంటీరియర్ కర్నాటక మీదుగా దక్షిణ తమిళనాడు వరకు సగటు సముద్ర మట్టంకి 0.9 కి మీ ఎత్తు వద్ద కొనసాగుతుందని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఈ రోజు, రేపు, ఎల్లుండి తెలంగాణ రాష్ట్రంలో  తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు   కొన్ని చోట్ల వచ్చే అవకాశం ఉంది. రాగల ఐదు రోజులకు రాష్ట్రంలో  పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెంటీగ్రేడ్ కన్నా తక్కువగా అనేక చోట్ల నమోదు అయ్యే అవకాశం ఉందని తెలిపారు. ఈరోజు, రేపు తెలంగాణ రాష్ట్రములో ఉరుములు మెరుపులతో పాటు ఈదురు గాలులు (30 - 40 కి.మి) తో కూడిన వర్షాలు కొన్నిచోట్ల వచ్చే అవకాశం ఉందని అంచనా వేశారు.


నేడు తెలంగాణ రాష్ట్రంలోని మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో, ఈదురు గాలులతో (30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో) కూడిన వర్షం అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని వాతావరణ అధికారులు తెలిపారు.


హైదరాబాద్ లో ఇలా
‘‘హైదరాబాద్ లో ఆకాశం పాక్షికంగా మేఘాలు పట్టి ఉంటుంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 37 డిగ్రీలు, 24 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఆగ్నేయ దిశ నుంచి గాలులు గంటకు 4 నుంచి 8 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది’’ అని వెదర్ బులెటిన్ లో పేర్కొ్న్నారు. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 35.3 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 23.8 డిగ్రీలుగా నమోదైంది. గాలిలో తేమ 56 శాతం నమోదైంది. 


ఏపీలో ఎండలు ఇలా
శుక్రవారం నుండి సోమవారం వరకు నాలుగు రోజుల పాటు ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములతో పాటు వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ రోజుల్లో ఉత్తర కోస్తా, యానాం, దక్షిణ కోస్తా , రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలుంటాయని తెలిపింది. అంతేకాకుండా గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తాయని కూడా అధికారులు అంచనా వేశారు. ​వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. ప్రస్తుతం దక్షిణ ప్రాంతం, యానాం మీదుగా అల్ప ట్రోపోస్పిరిక్ దక్షిణ, నైరుతి గాలులు వీస్తున్నాయి.


నిన్న మధ్యాహ్నం అరకు వ్యాలీ - చింతపల్లి కొండ ప్రాంతాలైన అల్లూరి సీతారామరాజు జిల్లాలో మొదలైన వర్షాలు నేరుగా దిగువనే ఉన్న అనకాపల్లి, విజయనగరం జిల్లాల్లోకి ప్రవేశించాయి. విశాఖ నగరం శివారు ప్రాంతాలైన గోపాలపట్నం, అనకాపల్లి, పెందుర్తిలో భారీ వర్షాలు పడ్డాయి. విశాఖపట్నం ముఖ్య నగరంలో మాత్రం గాలులు అనుకూలించడం లేనందున తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు మాత్రమే పడ్డాయి. విజయనగరం నగరంలోనూ భారీ వర్షాలు పడ్డాయి.


ఢిల్లీలో వాతావరణం ఇలా ఉంది..
దేశ రాజధాని ఢిల్లీతోపాటు పరిసర ప్రాంతాల్లో శనివారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. కొన్ని చోట్ల వడగళ్ల వాన కురిసిన సమాచారం కూడా ఉంది. దీంతో ఆదివారం వాతావరణం ఆహ్లాదకరంగా మారింది. ఆదివారం తేలికపాటి వర్షం, చినుకులు, ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ శాస్త్రవేత్తలు తెలిపారు. దీంతో పాటు మేఘావృతమైన వాతావరణం ఉండే అవకాశం ఉందని చెప్పారు.


ఢిల్లీలో నేటి గరిష్ట ఉష్ణోగ్రత సుమారు 37 డిగ్రీల సెల్సియస్ మరియు కనిష్ట ఉష్ణోగ్రత 21 డిగ్రీల సెల్సియస్‌గా ఉండే అవకాశం ఉంది. ఆదివారం కొన్ని చోట్ల ఈదురు గాలులతో కూడిన వర్షం పడే అవకాశం ఉంది. ఏప్రిల్ 24న కూడా వాతావరణం సాధారణంగానే ఉంటుందని, అయితే ఏప్రిల్ 25 నుంచి ఉష్ణోగ్రత పెరగడం మొదలవుతుందని, ఏప్రిల్ 28 నాటికి పగటి ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్సియస్‌ను దాటుతుందని అంచనా.