Punjab Kings vs Mumbai Indians: ఐపీఎల్ 2023 సీజన్‌లో నేడు (శనివారం) రాత్రి జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై పంజాబ్ కింగ్స్ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 214 పరుగులు సాధించింది. అనంతరం ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. కామెరాన్ గ్రీన్ (67: 43 బంతుల్లో, ఆరు ఫోర్లు, మూడు సిక్సర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. సూర్యకుమార్ యాదవ్ (57: 26 బంతుల్లో, ఏడు ఫోర్లు, మూడు సిక్సర్లు) మెరుపు అర్థ సెంచరీ సాధించాడు. పంజాబ్ బౌలర్లలో అర్షదీప్ సింగ్ నాలుగు వికెట్లు పడగొట్టాడు. చివరి ఓవర్లో అర్షదీప్ వేసిన రెండు బంతులు వికెట్లను విరగ్గొట్టడం విశేషం.
పంజాబ్ కింగ్స్ తరఫున కెప్టెన్ శామ్ కరన్ (55: 29 బంతుల్లో, మూడు ఫోర్లు, నాలుగు సిక్సర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. శామ్ కరన్‌కు హర్‌ప్రీత్ సింగ్ భాటియా (41: 28 బంతుల్లో, నాలుగు ఫోర్లు, రెండు సిక్సర్లు) నుంచి చక్కటి సహకారం లభించింది. చివర్లో జితేష్ శర్మ (25: 7 బంతుల్లో, నాలుగు సిక్సర్లు) సిక్సర్లతో చెలరేగాడు. చివరి 30 బంతుల్లో పంజాబ్ కింగ్స్ ఏకంగా 96 పరుగులు సాధించింది.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో పంజాబ్ మొదట బ్యాటింగ్‌కు దిగింది. అయితే ఓపెనర్ మాథ్యూ షార్ట్ విఫలం అయ్యాడు. కానీ ప్రభ్‌సిమ్రన్ సింగ్, అధర్వ తైడే వికెట్ల పతనాన్ని కాసేపు నిలువరించారు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 47 పరుగులు జోడించారు. అయితే వీరిద్దరితో లియామ్ లివింగ్‌స్టోన్ కూడా కాస్త వ్యవధిలోనే అవుట్ అయ్యాడు. దీంతో పంజాబ్ 83 పరుగులకే నాలుగు వికెట్లు నష్టపోయింది.
అయితే శామ్ కరన్, హర్‌ప్రీత్ సింగ్ భాటియా పంజాబ్‌ను ముందుకు నడిపించారు. మొదట వీరు కొంచెం నిదానంగా ఆడారు. శామ్ కరన్ మొదటి 10 బంతుల్లో కేవలం మూడు పరుగులు మాత్రమే చేశాడు. కానీ మెల్లగా గేర్లు మార్చారు. సిక్సర్లు, ఫోర్లతో చెలరేగారు. అర్జున్ టెండూల్కర్ వేసిన ఒక ఓవర్లో 31 పరుగులు రాబట్టారు. వీరు అవుటయ్యాక వచ్చిన జితేష్ శర్మ కూడా సిక్సర్లతో చెలరేగాడు. దీంతో పంజాబ్ 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది. ముంబై ఇండియన్స్ బౌలర్లో పీయూష్ చావ్లా, కామెరాన్ గ్రీన్ రెండేసి వికెట్లు తీసుకున్నారు. జోఫ్రా ఆర్చర్, బెహ్రెండాఫ్, అర్జున్ టెండూల్కర్‌లకు తలో వికెట్ దక్కింది.