ఆస్ట్రేలియా దిగ్గజ స్పిన్నర్ స్టువర్ట్ మెక్ గిల్ డ్రగ్ కేసులో ఇరుక్కున్నాడు. డ్రగ్ స్మగ్లింగ్ ఆరోపణలతో అతనికి తాజాగా కోర్టు శిక్ష విధించింది. అయితే అతనికి జైలుకు బదులుగా 22 నెలల ఇంటెన్సివ్ కరెక్షన్స్ తో పాటు 495 గంటల సామాజిక సేవ చేయాలని ఆదేశించింది. గత రెండునెలల కిందటే ఈ 54 ఏళ్ల స్పిన్నర్ నేరం చేశాడని తేలింది. అయితే అప్పుడు తీర్పును వాయిదా వేసిన కోర్టు.. తాజాగా శిక్షను ఖరారు చేసింది. మెక్ గిల్ పై డ్రగ్ సప్లై ఆరోపణలు ఉన్నాయి. గత కొంతకాలంగా అతనిపై ఈ కేసు నడుస్తోంది. తాజాగా తీర్పు రావడంతో మెక్ గిల్ కు శిక్ష ఖారారైంది. నిజానికి 2021 ఏప్రిల్లోనే కేజీ కొకెయిన్ ను సరఫరా చేయడానికి మెక్ గిల్ ఒప్పందం చేసుకున్నాడు. అయితే అప్పుడు జరిపిన దాడుల్లో తను ఒక పార్టీకి ఈ డ్రగ్ ను సరఫరా చేయడానికి ఒప్పుకున్నానని తెలిపాడు. అలాగే తనకు ఎవరైతే డ్రగ్ సరఫరా చేస్తాడో తన బావమరిది మారినో సోటిరోపోలస్ కు పరిచయం చేశాడు. ఈ తతంగానికి సిడ్నీ ఉత్తర తీరంలోని తన రెస్టారెంట్ ను వేదికగా చేసుకున్నాడు.
బుకాయించిన మెక్ గిల్.. దాడుల్లో పట్టుబడిన మెక్ గిల్.. అన్యాయంగా తనను ఈ కేసులో ఇరికిస్తున్నారని వాఖ్యానించాడు. ఆ తర్వాత విచారణ అనంతరం తను చేసిన నేరాన్ని అంగీకరించాడు. తన రెస్టారెంట్లో జరిగిన ఈ డీల్.. మెక్ గిల్ కు తెలియకుండా జరగదని, అధికారులు తగిన సాక్ష్యాలు చూపించడంతో మెక్ గిల్ దారికి వచ్చాడు. మరోవైపు గతేడాది మెక్ గిల్ కిడ్నాపు కు గురైనట్లు కూడా కథనాలు వచ్చాయి. అయితే డ్రగ్ డీల్ లోనే ఇద్దరు అన్నదమ్ములు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తేలింది.
బాసటగా స్టీవ్ వా..ఒకప్పటి తన సహచరుడు మెక్ గిల్.. ఇలా డ్రగ్ కేసులో చిక్కుకోవడంతో అతనికి బాసటగా మాజీ కెప్టెన్ స్టీవ్ వా నిలిచాడు. అతనికి బాసటగా ఒక లెటర్ ను కూడా రాశాడు. భవిష్యత్తులో తను ఎలాంటి నేరానికి పాల్పడటంటూ, కష్టపడి పని చేస్తాడని వివరించాడంతో కోర్ట్ కన్విన్స్ అయి శిక్ష తీవ్రతను తగ్గించింది. శుక్రవారం స్తానిక డౌనింగ్ సెంటర్ డిస్ట్రిక్ట్ కోర్టు ఈ శిక్షను ఖరారు చేసింది. ప్రధానంగా లెగ్ స్పిన్నర్ అయిన మెక్ గిల్.. దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్ నీడన ఉండిపోయాడు. వీరిద్దరూ ఒకే సమయంలో కెరీర్ మొదలు పెట్టడంతో వార్న్.. లేని సమయాల్లో మాత్రమే గిల్ కు అవకాశం దక్కింది. ఈ క్రమంలో 44 టెస్టులు, 3 వన్డేలు ఆడిన మెక్ గిల్ ఓవరాల్ గా 214 వికెట్లు తీశాడు. అతని అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన 8/108 కావడం విశేషం. 1998 నుంచి 2008 వరకు దాదాపు 11 సంవత్సరాలు ఆసీస్ తరపున మెక్ గిల్ ప్రాతినిథ్యం వహించాడు.