నేడు దిగువ స్థాయిలోని గాలులు దక్షిణ/ఆగ్నేయ దిశల నుండి తెలంగాణ రాష్ట్రం వైపుకి వీస్తున్నాయని హైదరాబాద్‌లోని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. రాగల మూడు రోజులు తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు అక్కడక్కడ వచ్చే అవకాశం ఉంది. ఈ రోజు రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు  41 డిగ్రీల నుండి 44 డిగ్రీల సెంటీగ్రేడ్  మధ్యన అనేక చోట్ల, రేపు 40 డిగ్రీల నుండి 42 డిగ్రీలు దకొన్ని చోట్ల నమోదు అయ్యే అవకాశం ఉంది. తెలంగాణ వ్యాప్తంగా హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాలు మినహా అన్ని జిల్లాల్లోనూ ఎండల విషయంలో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు.


21వ తేదీ నుండి 4, 5 రోజుల పాటు తెలంగాణ రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు, గణనీయంగా తగ్గి  అనేక చోట్ల 40 డిగ్రీల కన్నా తక్కువగా నమోదు అయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. GHMC పరిధిలో  21 వ తేదీ నుండి 35 డిగ్రీల నుండి 37 డిగ్రీల మధ్య నమోదు అయ్యే అవకాశం ఉంది.  ఈరోజు, వాయువ్య తెలంగాణ, రేపు తూర్పు తెలంగాణ జిల్లాలలో, ఉరుములు మెరుపులతో పాటు ఈదురు గాలులు ( గాలి  గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో) వీచే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు.


ఉత్తర తెలంగాణలో నిప్పుల కొలిమే
నిర్మల్‌, జగిత్యాల జిల్లాల్లో గరిష్ఠంగా 44.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. 11 జిల్లాల్లో 44 డిగ్రీలపైన నమోదయ్యాయి. గ్రామాల్లో ప్రజలు బయటికి రావాలంటే భయపడ్డారు. ఈ నెల 21 నుంచి 25వ తేదీ వరకు కొంత ఉపశమనం లభించవచ్చని, ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలలోపే నమోదుకు అవకాశం ఉందని వాతావరణ అధికారులు తెలిపారు. 


తెలంగాణ రాష్ట్రంలోని జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగామ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వాతావరణం, ఈదురు గాలులు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని తెలిపారు. ఈ మేరకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. 


హైదరాబాద్ లో ఇలా
‘‘హైదరాబాద్ లో ఆకాశం పాక్షికంగా మేఘాలు పట్టి ఉంటుంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 40 డిగ్రీలు, 26 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఆగ్నేయ దిశ నుంచి గాలులు గంటకు 6 నుంచి 8 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది’’ అని వెదర్ బులెటిన్ లో పేర్కొ్న్నారు. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 39.4 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 25 డిగ్రీలుగా నమోదైంది. గాలిలో తేమ 44 శాతం నమోదైంది. 


ఏపీలో ఎండలు ఇలా
ఏపీలో ఎండలు విపరీతం అయ్యాయి. నేడు వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉందని, ఉష్ణోగ్రతలు 2 డిగ్రీల మేర అధికంగా నమోదయ్యే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. వడగాలులు కూడా ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశం ఉంది. ఉత్తర కోస్తాంధ్ర, రాయలసీమ, దక్షిణ కోస్తాల్లో కూడా ఇదే రకమైన వాతావరణం ఉంటుందని వెదర్ బులెటిన్ లో తెలిపారు.


‘‘ఏపీలో 21, 22 తేదీల్లో ఉష్ణోగ్రతలు తగ్గుతాయని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఉరుములు, మెరుపులు కొన్ని చోట్ల వర్షాలు, గాలులు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో వర్షాలు కురుస్తాయని తెలిపారు. వాడగాడ్పులు శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, శ్రీ అల్లూరి సీతారామరాజు, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, కాకినాడ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్, క్రిష్ణా, పల్నాడు, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో కాస్త ఎక్కువగా వడగాడ్పులు ఉంటాయని అంచనా వేశారు.


‘‘కర్నూలు నగరం పరిసర ప్రాంతాల్లో అత్యధికంగా 45.6 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదయ్యింది. ఇది ఇలా ఉండగా మొత్తం ఆంధ్ర రాష్ట్రంలో వేడి అనేది 40 డిగ్రీలను దాటుతోంది. తిరుపతి, నెల్లూరు, ప్రకాశం, ఎన్.టీ.ఆర్., ఏలూరు, కడప​, అన్నమయ్య​, అనంతపురం, నంధ్యాల​, కాకినాడ​, అనకాపల్లి, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో మాత్రం ఉష్ణోగ్రతలు 42-44 డిగ్రీలను తాకుతోంది. ఏప్రిల్ నెలలో ఇలా ఉండగా మే నెలలో మాత్రం వేడి ఇకా ఎక్కువగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎల్.నినో పసిఫిక్ లో ఏర్పడుతోంది కాబట్టి భారత భూభాగంలో ఉన్న తేమను లాగుతోంది. దీని వలన ఎండలు తీవ్రంగా మారుతున్నాయి. విశాఖ నగరంలో 40.7 డిగ్రీలు నమోదవుతోంది. అలాగే విజయవాడలో 43 డిగ్రీలు నమోదవుతోంది’’ అని ఏపీ వెదర్ మ్యాన్ తెలిపారు.