నిన్న ఒడిశా నుండి ఉన్న ద్రోణి/ గాలిలోని అనిచ్చితి, ఈ రోజు దక్షిణ మధ్య మహారాష్ట్ర నుండి ఇంటీరియర్ కర్ణాటక మీదగా తమిళనాడు వరకు సగటు సముద్రం మట్టంకి 0.9 కి మీ ఎత్తు వద్ద కొనసాగుతుంది. దీని ప్రభావంతో రాగల మూడు రోజులు  తెలంగాణ రాష్ట్రంలో  పొడి వాతావరణం నెలకొనే అవకాశం ఉంది. ఈ రోజు రేపు మరియు ఎల్లుండి రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు  41 డిగ్రీల సెంటీగ్రేడ్ నుండి 43 డిగ్రీల సెంటీగ్రేడ్ మధ్యన కొన్ని చోట్ల నమోదు అయ్యే అవకాశం ఉంది. GHMC మరియు చుట్టు ప్రక్కల జిల్లాలలో 40 డిగ్రీల సెంటీగ్రేడ్ కన్నా తక్కువగా నమోదు అయ్యే అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో అక్కడక్కడ ఉష్ణోగ్రతలు 2 డిగ్రీల మేర పెరిగే అవకాశం ఉంది. 


హైదరాబాద్ లో ఇలా


‘‘హైదరాబాద్ లో ఆకాశం పాక్షికంగా మేఘాలు పట్టి ఉంటుంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 38 డిగ్రీలు, 25 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఉత్తర దిశ నుంచి గాలులు గంటకు 4 నుంచి 8 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది’’ అని వెదర్ బులెటిన్ లో పేర్కొ్న్నారు. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 36.4 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 24.6 డిగ్రీలుగా నమోదైంది. గాలిలో తేమ 49 శాతం నమోదైంది. 


ఏపీలో ఎండలు ఇలా


ఏపీలో ఎండలు విపరీతం అయ్యాయి. నేడు వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉందని, ఉష్ణోగ్రతలు 2 డిగ్రీల మేర అధికంగా నమోదయ్యే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. వడగాలులు కూడా ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశం ఉంది. ఉత్తర కోస్తాంధ్ర, రాయలసీమ, దక్షిణ కోస్తాల్లో కూడా ఇదే రకమైన వాతావరణం ఉంటుందని వెదర్ బులెటిన్ లో తెలిపారు.


శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, శ్రీఅల్లూరి సీతారామరాజు, కాకినాడ, పశ్చిమ గోదావరి, క్రిష్ణా, పల్నాడు, గుంటూరు, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో వడగాలుల ప్రభావం అధికంగా ఉండనుంది. అందుకని, ప్రజలు ఇంటిపట్టునే ఉండాలని, అవసరం అయితే తప్ప బయటకు వెళ్లవద్దని వాతావరణ అధికారులు సూచించారు. బిగుతైన దుస్తులు ధరించవద్దని, వదులుగా తేలిగ్గా ఉండే లేత రంగుల బట్టలు ధరించాలని సూచించారు. బయటకు వెళ్లిన పక్షంలో టోపీ, గొడుగు వాడాలని సూచించారు.


ఢిల్లీలో విపరీతమైన ఎండలు


దేశ రాజధాని ఢిల్లీలో ఎండ వేడిమికి జనం అవస్థలు పడ్డారు. బలమైన తీక్షణమైన ఎండ ఉదయం నుంచే ప్రారంభం అవుతోంది. ఎండ తీవ్రతతో పగటిపూట ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. సూర్యుని వేడితో పాటు, రాబోయే కొద్ది రోజులలో వేడి గాలులు అంటే హీట్ వేవ్ గురించి హెచ్చరిక జారీ అయింది. ఆదివారం (ఏప్రిల్ 16) కనిష్ఠ ఉష్ణోగ్రత 20 డిగ్రీల సెల్సియస్, గరిష్టంగా 40 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది.


వాతావరణ విభాగం అంచనాల ప్రకారం.. ఢిల్లీ, హరియాణా, పంజాబ్ సహా ఉత్తర భారతదేశంలో రాబోయే రోజులు ప్రజలకు చాలా కష్టంగా మారనుంది. ఉష్ణోగ్రతలో మరింత పెరుగుదల కనిపిస్తుంది. భారతదేశంలో గరిష్ట ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్సియస్‌ను దాటినపుడు హీట్‌వేవ్ ప్రకటిస్తారు.


ఈ ఏడాది తొలిసారిగా 40కి పైగా ఉష్ణోగ్రత 


వడగాలులు వీచే అవకాశం ఉన్నందున పశ్చిమ బెంగాల్‌తో పాటు పలు రాష్ట్రాల్లో ఆరెంజ్ అలర్ట్‌ను జారీ చేసినట్లు వాతావరణ శాఖకు చెందిన నరేష్ కుమార్ తెలిపారు. వెస్ట్రర్న్ డిస్ట్రబెన్స్ కారణంగా, రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రత కాస్త పడిపోవచ్చు. వచ్చే వారం వాతావరణంలో మార్పు వచ్చే అవకాశం ఉంది. ఈ ఏడాది తొలిసారిగా ఢిల్లీలో ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకున్న సంగతి తెలిసిందే.