పశ్చిమ-మధ్య బంగాళాఖాతంలో ఆవర్తనం ఒకటి కోస్తా ఆంధ్రప్రదేశ్ కు దగ్గర పశ్చిమ-మధ్య బంగాళాఖాతంలో సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ. ఎత్తు వరకు కేంద్రీకృతమై ఉందని హైదరాబాద్ లోని వాతావరణ కేంద్రం అధికారులు గురువారం (ఆగస్టు 31) ఓ ప్రకటనలో తెలిపారు. మరో ఆవర్తనం వాయువ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాలలో సెప్టెంబర్ 4వ తేదీన ఏర్పడే అవకాశం ఉందని తెలిపారు. ఈ రోజు  దిగువ స్థాయిలోని గాలులు ఈశాన్య /వాయువ్య  దిశల నుండి తెలంగాణ రాష్ట్రం వైపుకి వీస్తున్నాయి. ఈరోజు, రేపు తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు అక్కడక్కడ ఎల్లుండి కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు రాష్ట్రంలో అక్కడక్కడ కొన్ని జిల్లాలలో వచ్చే అవకాశం ఉంది.


హైదరాబాద్ లో ఆకాశం మేఘావృతం అయి కనిపించనుంది. నగరంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 34 డిగ్రీలు, 23 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఉపరితల గాలులు గంటకు 6 నుంచి 8 కిలో మీటర్ల వేగంతో ఉత్తర దిశగా వీచే అవకాశం ఉంది. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 33.1 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 22.8 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. గాలిలో తేమ 68 శాతంగా నమోదైంది.


సెప్టెంబర్‌ 2,3,4 తేదీల్లో రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్‌, కొమరం భీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, వరంగల్‌, హన్మకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. 


ఏపీలో ఇలా
దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లోనూ నేడు, రేపు అక్కడక్కడ తేలికపాటి చినుకులు ఒకటి లేదా రెండు చోట్ల పడే అవకాశం ఉందని అంచనా వేశారు. కొన్ని ప్రాంతాల్లో గాలులు గంటకు వీచే అవకాశం ఉందని అంచనా వేశారు. రాయలసీమలో రేపు, ఎల్లుండి తేలికపాటి వర్షాలు ఒకటి రెండు ప్రాంతాల్లో పడే అవకాశం ఉందని వివరించారు. కొన్ని చోట్ల బలమైన గాలులు పలు చోట్ల వీచే అవకాశం ఉందని వెల్లడించారు.


‘‘ఎల్‌నినో ప్రభావం ప్రస్తుతానికి తీవ్ర స్థాయిలో ఉంది, కానీ మ్యాడన్ జూలియన్ ఆసిలేషన్ మాత్రం ఎల్నినో ని కాస్త తగ్గించే దిశలో అడుగులు వేస్తోంది. దీని వలన సెప్టెంబర్ మొదటి వారం చివరిలో బలమైన అల్పపీడనం బంగాళాఖాతంలో ఏర్పడనుంది. దీని వలన వర్షాలు తెలుగు రాష్ట్రాల్లో పెరగనున్నాయి. 


నేడు మధ్యాహ్నం నుంచి సాయంకాలం మధ్యలో రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ ముఖ్యంగా సత్యసాయి, అనంతపురం, అన్నమయ్య​, చిత్తూరు, తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో పలు భాగాల్లో మాత్రమే వర్షాలు ఉండనున్నాయి. కానీ రాత్రికి బెంగళూరు దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో ఎక్కువగా వర్షాలు విస్తారంగా మారనున్నాయి. వర్షాలతో పాటుగా పిడుగులు, ఉరుములు ఉంటాయి. మరోవైపున మధ్యాహ్నం నుంచి సాయంకాలం సమయం వరకు మధ్య ఆంధ్ర జిల్లాల్లో అక్కడక్కడ​, ఉభయ గోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాల్లో అక్కడక్కడ మాత్రమే వర్షాలు ఉంటాయి. మారేడుమిల్లి - రంపచోడవరం - పోలవరం - యేలేశ్వరం ప్రాంతాల్లో సాయంకాలం మోస్తరు నుంచి భారీ వర్షాలను చూడగలం. సెప్టెంబర్ మొదటి వారం నుంచి వర్షాలు గణనీయంగా పెరగనున్నాయి’’ అని ఏపీ వెదర్ మ్యాన్ తెలిపారు.