వరంగల్: వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రజా ప్రస్థానం పాదయాత్ర ఆదివారం (డిసెంబర్ 4) నుంచి ప్రారంభం కానుంది. అయితే షర్మిల పాదయాత్రకు అనుమతిపై వరంగల్ ఇంకా ఏ స్పష్టత ఇవ్వలేదు. చెన్నారావు పేట మండలం లింగగిరి నుంచి పాదయాత్ర ప్రారంభం అంటూ వైఎస్ షర్మిల ఇదివరకే ప్రకటించారు. కానీ, లింగగిరి నుంచి యాత్ర చేస్తే శాంతి భద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు. పాదయాత్రకు అనుమతి కోసం సీపీ కార్యాలయం వద్ద YSRTP నేతలు పడిగాపులు కాస్తున్నారు. కోర్ట్ ఆదేశాల ప్రకారం షర్మిల పాదయాత్రకు అనుమతి ఇవ్వాలని YSRTP నేతలు అంటున్నారు. డిసెంబర్ 4న ఉదయం 8 గంటలకువైఎస్ షర్మిల లోటస్ పాండ్ నుంచి నర్సంపేటకి బయలు దేరనున్నారని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. 11 గంటలకు లింగగిరి నుంచి పాదయాత్ర ప్రారంభించేలా ఏర్పాట్లు చక చకా జరుగుతున్నాయి.


తెలంగాణ మలిదశ ఉద్యమంలో తొలి అమరవీరుడు కాసోజు శ్రీకాంతాచారి వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ లోని గన్ పార్క్ వద్ద నివాళి అర్పించారు షర్మిల. అన్యాయానికి గురవుతున్న అమరవీరుల కుటుంబాలకు,ఉద్యమకారులకు YSRTP అండగా ఉంటుందని, అధికారంలోకి వచ్చాక వారికి ఉచిత ఇండ్లు, ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తాం అన్నారు.- 


"ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసింది పోలీసులే అన్న మచ్చ డిపార్ట్ మెంటుకు వస్తుందని చెప్పాం. ఇది తగదు మాకు సరైన భద్రత కల్పించాలని కోరాం. డిసెంబర్ 4వ తేదీన పాదయాత్ర తిరిగి ప్రారంభిస్తాం. పాదయాత్ర ఎక్కడ నిలిచిపోయిందో అక్కడి నుంచి తిరిగి మొదలుపెడతాం. ఇప్పటికే 3500 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తిచేశాం. టీఆర్ఎస్ గూండాల కోసం పోలీసులు ఎక్కడైతే మా పాదయాత్రను అడ్డుకున్నారో అక్కడి నుంచే పాదయాత్రను తిరిగి ప్రారంభిస్తాం. డిసెంబర్ 14న పాదయాత్ర  ముగిస్తాం. దాదాపు 4 వేల కిలోమీటర్ల పాదయాత్ర చేస్తున్నాం " అని వైఎస్ షర్మిల అన్నారు.


వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల శుక్రవారం హైదరాబాద్ లో అడిషనల్ డీజీపీని కలిశారు. తన పాదయాత్రకు భద్రత కల్పించాలని కోరారు. ఇటీవల వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలో షర్మిల పాదయాత్రను టీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. షర్మిల ఫ్లెక్సీలు, ప్రచార రథానికి నిప్పుపెట్టారు. వాహనాలపై రాళ్లదాడి చేశారు. అనంతరం పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు షర్మిలను అరెస్టు చేసి హైదరాబాద్ కు తరలించారు. షర్మిల పాదయాత్రకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో తాను తిరిగి పాదయాత్ర ప్రారంభిస్తున్నట్లు ఆమె ప్రకటించారు. పాదయాత్రకు భద్రత కల్పించాలని అడిషనల్ డీజీపీకి వినతి పత్రం అందించారు.






లోటస్ పాండ్ లో వైఎస్ఆర్టీపీ కార్యకర్తలతో ఆ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల భేటీ అయ్యారు. ఈ సమావేశంలో పాదయాత్ర కొనసాగింపుపై షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు. ఈనెల 4 నుంచి 14 వరకు పాదయాత్రను యథావిధిగా కొనసాగిస్తామన్నారు. ఎన్ని బెదిరింపులు వచ్చినా పాదయాత్ర ఆపేది లేదన్నారు.  వైఎస్సార్టీపీకి ఆదరణ పెరగడంతో టీఆర్ఎస్ భయపడుతుందన్నారు. అందుకే పాదయాత్రను అడ్డుకోవాలని కుట్ర చేశారని ఆరోపించారు. తనను అరెస్ట్ చేస్తే తప్ప పాదయాత్ర ఆపలేమని అందుకే అరెస్టు చేసి రిమాండ్ చేయాలని చూశారన్నారు. ట్రాఫిక్ కు అంతరాయం కలిగిస్తే రిమాండ్ కు పంపిస్తారా అంటూ మండిపడ్డారు. సీఎం కేసీఆర్ డైరక్షన్ లోనే ఇదంతా జరిగిందన్నారు. దేశంలో అత్యంత ధనిక కుటుంబం కేసీఆర్ దే అన్నారు. వైఎస్ఆర్ బిడ్డ తెలంగాణ ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కోరుతున్నారన్నారు.