Weather News In Telangana Heavy Rains alert for 4 districts in state Red Alert issues to Munneru River హైదరాబాద్: తీవ్ర అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలో పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయి. శనివారం ఉదయం, మధ్యాహ్నం కొన్ని జిల్లాల్లో తేలికపాటి జల్లుల నుంచి మోస్తరు వర్షం కురిసింది. సాయంత్రం నుంచి ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల్లో పలు ప్రాంతాల్లో వర్షం దంచికొడుతోంది. ఇటీవల ఖమ్మం జిల్లాలో వరదల కారణంగా ప్రాణనష్టం సంభవించడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. మున్నేరుకు భారీగా వరద నీరు చేరుతుండటంతో అక్కడ రెడ్ అలర్ట్ జారీ చేశారు. శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు నాలుగు జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు, తెలంగాణ వెదర్ మ్యాన్ అలర్ట్ చేశారు.


100 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు, భారీగా వరద


వరంగల్ రూరల్, మహబూబాబాద్, ఖమ్మం, కొత్తగూడెం భద్రాద్రి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని అక్కడి ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. ఆ జిల్లాల్లో శనివారం రాత్రి వరకే కొన్ని ప్రాంతాల్లో 70 నుంచి 100 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. రాగల 10 గంటల్లో మహబూబాబాద్, ఖమ్మం జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదు కానుందని తెలంగాణ వెదర్ మ్యాన్ తెలిపారు. అందుకే ఖమ్మం, మహబూబాబాద్ ప్రజలు.. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు, పెద్ద పెద్ద వాగులు, నదుల పరివాహక ప్రాంతాల వారు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. 


మహబూబాబాద్ జిల్లాలో కుండపోత వర్షం కురిసింది. జిల్లాలో 179 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు అయింది. మహబూబాబాద్ పట్టణంలోకి వరద నీరు చేరడంతో పలు కాలనీలను వరద ముంచెత్తింది. ఓ వైపు వాగులు, చెరువులు పొంగిపోర్లుతుండగా, పలు రహదార్లపై వరద నీరు ప్రవహిస్తోంది. చిన్న గూడూరులో జిళ్ళేళ్ల వాగు, తాళ్లపూసపల్లి వంతెనపై వరద నీరు ఉధృతంగా ప్రవహించడంతో మహుబూబాద్-తొర్రూర్  రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఖమ్మం జిల్లాలో తీగల బంజర వాగు వరద ఉధృతి పెరగుతోంది. రోడ్డుపై భారీగా వరద నీరు ప్రవహిస్తుండటంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఖమ్మం జిల్లా అంజనపురంలో వాగు ఉదృంగా మారడంతో వంతెన పైనుంచి వరద నీరు ప్రవహిస్తోంది. 


రెస్కూ కేంద్రాలకు ప్రజల తరలింపు


మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశాలతో ఖమ్మంలో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తం అయింది. వరద ముంపు ప్రాంతాల ప్రజలను పోలీసులు, అధికారులు ఖాళీ చేయిస్తున్నారు. రెస్క్యూ కేంద్రాలైన స్వర్ణ భారతి, చర్చి కాంపౌండ్, మహిళా డిగ్రీ కళాశాల, రమణపేట ఉన్నత పాఠశాల, దామసలాపురం పాఠశాలకు ప్రజలను తరలిస్తున్నారు. అక్కడ వారికి వసతి సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు. ఖమ్మం జిల్లా మంత్రులు, అధికారులు అప్రమత్తంగా వ్యవహరించి ప్రజలను వరద నుంచి కాపాడాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.


దాన్వాయిగూడెం, రమణపేట, బొక్కలగడ్డ, ప్రకాష్ నగర్, మోతీ నగర్, వెంకటేశ్వర్ నగర్‌లోని మున్నేరు వెంబడి నివసించే ప్రజలను సమీపంలోని రెస్క్యూ సెంటర్‌కు తరలించాలని అధికారులు సూచించారు. రాత్రి 10.40 గంటలకు మున్నేరు నీటిమట్టం 12.80 అడుగులకు చేరినట్లు అధికారులు తెలిపారు. కేవలం రెండు గంటల వ్యవధిలో దాదాపు మూడు అడుగుల నీరు మున్నేరుకు చేరింది. రాత్రి 11 గంటలకు 13.2 అడుగులకు మున్నేరు నీటిమట్టం పెరిగింది. వరద ఇలాగే కొనసాగితే నేటి రాత్రికే మున్నేరు వద్ద తొలి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది. 16 అడుగులకు చేరితే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు. నీటిమట్టం 24 అడుగులకు చేరితే రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు.  
Also Read: తెలంగాణ సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు భారీ విరాళాలు - పెద్ద మనసుతో ఎవరెవరు ఎంతిచ్చారంటే!