Red Alert has been issues to people living along with Munneru River | ఖమ్మం జిల్లాలో కురిసిన భారీ వర్షాల వలన మున్నేరు వాగు ప్రవాహం మరోసారి పెరుగుతోంది. ఆ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ మరియు టెక్స్టైల్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు విజ్ఞప్తి చేశారు. ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని, ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకుంటుందని చెప్పారు. మున్నేరుకు తొలి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. రాత్రి 12.30కి మున్నేరు వద్ద నీటిమట్టం 16.50 అడుగులకు చేరడంతో ఫస్ట్ వార్నింగ్ జారీ చేశారు. 16 అడుగులకు చేరితే తొలి హెచ్చరిక, ఒకవేళ 24 అడుగులకు నీటిమట్టం చేరుకుంటే రెండో ప్రమాద హెచ్చరిక జారీ కానుంది.


భారీ వర్షాలతో వేగంగా పెరిగిన మున్నేరు నీటిమట్టం..


మహబూబాబాద్, వరంగల్‌లో కురుస్తున్న భారీ వర్షాలకు మున్నేరులో నీటిమట్టం పెరుగుతోంది. దాన్వాయిగూడెం, రమణపేట, బొక్కలగడ్డ, ప్రకాష్ నగర్, మోతీ నగర్, వెంకటేశ్వర్ నగర్‌లోని మున్నేరు వెంబడి నివసించే ప్రజలను సమీపంలోని రెస్క్యూ సెంటర్‌కు తరలిస్తున్నారు. అవసరమైతే సహాయక శిబిరాలు మళ్లీ తెరవాలని అధికారులను మంత్రి ఆదేశించారు. జిల్లాలో లోతట్టు ప్రాంతాలలో ఉన్న ప్రజలు వెంటనే అక్కడినుండి తరలి, ప్రభుత్వం ఏర్పాటు చేసిన సహాయ శిబిరాలకు వెళ్లాలని ప్రజలకు మంత్రి తుమ్మల, అధికారులు విజ్ఞప్తి చేశారు. భారీగా వరద నీరు చేరుతుంది, కనుక ప్రభుత్వ సూచనలను పాటించి, తగినంత జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. అత్యవసర పరిస్థితుల్లో సంబంధిత అధికారులతో సంప్రదించాలని ప్రజలకు సూచించారు.






రెస్క్యూ కేంద్రాలు ఇవే
స్వర్ణ భారతి 
చర్చి కాంపౌండ్ 
మహిళా డిగ్రీ కళాశాల 
రమణపేట ఉన్నత పాఠశాల 
దామసలాపురం పాఠశాల 
శనివారం సాయంత్రం వరకు మున్నేరులో నీటిమట్టం 6, 7 అడుగులు మాత్రమే. కానీ వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం జిల్లాలో కురుస్తున్న వర్షానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఈ క్రమంలో రాత్రి 8.30కి 9.50 అడుగులకు చేరింది. అంతకు గంట ముందు 8.4 అడుగలకు నీరు ఉండేది. శనివారం రాత్రి 10.40 గంటలకు నీటిమట్టం 12.80 అడుగులకు చేరింది. రాత్రి 11 గంటలకు మున్నేరు నీటిమట్టం 13.2 అడుగులకు పెరిగింది. 12 గంటలకు 15 అడుగులు ఆ తరువాత అరగంటకే తొలి ప్రమాద హెచ్చరిక స్థాయి దాటిపోయింది. 






ఇటీవల వచ్చిన వరదను దృష్టిలో ఉంచుకుని అధికారులు అన్ని రకాల ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని మంత్రి తుమ్మల ఆదేశించారు. వరద ప్రవాహం, మున్నేరు వాగులో ఫ్లో పూర్తిగా అదుపులోకి వచ్చేవరకు, ప్రజలకు అధికారులు నిరంతరం అందుబాటులో ఉంచేందుకు ఏర్పాట్లు చేశామన్నారు.


Also Read: ఖమ్మం వరదల్లో 9 మందిని రక్షించిన హీరోను సన్మానించిన అసదుద్దీన్, నగదు నజరానా


Also Read: తెలంగాణ సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు భారీ విరాళాలు - పెద్ద మనసుతో ఎవరెవరు ఎంతిచ్చారంటే!