Warangal Fake Doctor Arrest: నకిలీ సర్టిఫికేట్లతో గత 10 సంవత్సరాలుగా వైద్యుడిగా చలామణి అవుతున్న నకిలీ డాక్టర్ ను వరంగల్ పోలీస్ కమిషనరేట్ టాస్క్ ఫోర్స్, స్టేషన్ ఘన్‌పూర్ పోలీసులు సంయుక్తంగా అరెస్ట్ చేశారు. ఈ నకిలీ డాక్టర్ (Warangal Fake Doctor) నుంచి క్లినిక్ నిర్వహణకు సంబంధించిన పరికరాలు, మందులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
పదో తరగతి ఫెయిల్.. కానీ డాక్టర్ అంటూ క్లినిక్ నిర్వహణ
ఈ అరెస్టుకు సంబంధించి వరంగల్ టాస్క్ ఫోర్స్ (Warangal Taskforce Police) అదనపు డీసీపీ వైభవ్ గైక్వాడ్, వివరాలను వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. శివునిపల్లి, స్టేషన్ ఘన్ పూర్‌కు చెందిన ఆకాష్ కుమార్ బిశ్వాస్ అలియాస్ బీఏ కుమార్ అనే వ్యక్తి పదో తరగతి ఫెయిల్ అయ్యాడు. గతంలో ఇతను వైద్యుడైన ఆయన తాత వద్ద సహాయకుడిగా కొంత కాలం పని చేశాడు. ఈయన తాత కూడా ఎలాంటి సర్టిఫికెట్స్ లేకుండానే వైద్యం చేసేవాడు. ఇలా కొంత కాలం పని చేయడం ద్వారా వైద్యం చేయడంలో అనుభవం రావడంతో ఇతను కూడా డాక్టరుగా చెలామణి అయి పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించాలకున్నాడు.
నిందితుడు ప్రియాంక క్లినిక్ (Priyanka Clinic) పేరుతో శివునిపల్లి, స్టేషన్ ఘనపూర్ లో వైద్యశాలను నిర్వహిస్తున్నాడు. సహాయకుడిగా పని చేసిన అనుభవంతో నిందితుడు తన వైద్యశాలకు సాధారణ రోగాలతో వచ్చే రోగులకు చికిత్స అందిస్తూ రోగుల వద్ద పెద్ద మొత్తంలో ఫీజుల రూపంలో డబ్బులు వసూలు చేసేవాడు. జీవితంలో పైల్స్, ఫిషర్, బ్లీడింగ్ పైల్స్, ఫిస్టులా, హైడ్రోసిల్ (Hydrocele diseases) (బుడ్డ) మళ్లీ రాకుండా ఆపరేషన్ లేకుండా వైద్యం చేస్తాను అంటూ గత 10 సంవత్సరాల నుండి దాదాపు 3,560 మంది వరకు వైద్యం చేశాడు.
రోగ తీవ్రత ఎక్కువగా ఉంటే కార్పొరేట్ హాస్పిటల్ కి రెఫర్
ఒకవేళ రోగులకు వ్యాధి తీవ్రత అధికంగా ఉంటే నగరంలోని కార్పొరేట్ హస్పిటళ్లకు వెళ్ళమని సూచించేవారు. నిందితుడు వేరు వేరు హాస్పిటల్స్ నుండి కూడా పెద్ద మొత్తంలో కమీషన్లు తీసుకునేవాడు. ఈ నకిలీ డాక్టర్ భాగవతం కాస్తా టాస్క్ ఫోర్స్ పోలీసులకు తెలియడంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు స్థానిక స్టేషన్ ఘన్ పూర్, డిప్యూటీ DMHO, స్టేషన్ ఘనపూర్ వైద్య విభాగానికి చెందిన వైద్యుల అధ్వర్యంలో క్లినిక్ పై దాడులు నిర్వహించారు. ఆ నకిలీ డాక్టర్ ను విచారణ చేయడంతో నిందితుడు తాను పాల్పడుతున్న నేరాన్ని పోలీసుల ఎదుట అంగీకరించాడు.
ప్రతిభ కనబరిచిన సిబ్బందికి అభినందనలు
ఈ నకిలీ డాక్టర్ (Station Ghanpur Fake Doctor News) వ్యవహారంలో ప్రతిభ కనబరిచిన టాస్క్ ఫోర్స్ ఏసీపీ జితేందర్ రెడ్డి, టాస్క్ ఫోర్స్ ఇన్‌స్పెక్టర్లు నరేష్ కుమార్, వెంకటేశ్వర్లు, ఎస్ఐలు లవణ్ కుమార్, సిబ్బందిని డీసీపీ వైభవ్ గైక్వాడ్, వరంగల్ టాస్క్ ఫోర్స్ అదనపు డీసీపీ అభినందించారు.