తెలంగాణలో చలి తీవ్రత రోజురోజుకి పెరుగుతోంది. రాత్రి వేళల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో జనాలు వణికిపోతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోనే కాకుండా పట్టణాల్లోనూ రాత్రి, పగటి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. సాయంత్రం అయ్యిందంటే ఇంటి నుంచి బయట కాలుపెట్టలేని పరిస్థితి నెలకొంది. రాత్రి ఎనిమిది గంటలు దాటితే రహదారులు నిర్మానుష్యంగా మారిపోతున్నాయి. బస్టాండులోనూ రహదారులపైనా యాచకులూ, వృద్ధులు చలికి గజగజ వణికిపోతున్నారు.


తెలంగాణలో చలి వణికిస్తోంది. రోజురోజుకు పడి పోతున్న ఉష్ణోగ్రతలు ఆందోళన కలిగిస్తున్నాయి. సాధారణం కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఉత్తర ఈశాన్య దిశ నుంచి వీస్తున్న గాలుల ప్రభావంతో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. తెలంగాణలో అతి తక్కువ ఉష్ణోగ్రత కామారెడ్డి జిల్లా గాందారి మండలం రామలక్ష్మణ్‌పల్లిలో 7.6 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది. మరో మూడు రోజులు ఇదే పరిస్థితి ఉంటుందని అధికారులు హెచ్చరించారు. 


బయటకొచ్చేందుకు జంకుతున్న ప్రజలు






సాయంత్రం 7గంటల నుంచే తెలంగాణలో చలి వణుకు పుట్టిస్తోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో వారం రోజులుగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం బయటకు రావడానికి ప్రజలు జంకుతున్నారు. పొగమంచు ఎక్కువగా ఉండడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.






వరంగల్ ఉమ్మడి జిల్లాలోని మూలుగు, భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లా కేంద్రాల్లో 9 గంటల వరకు కూడా చలి తీవ్రంగానే ఉంటోంది. ఇక గ్రామీణ ప్రాంతాల్లో చలి తన ప్రతాపాన్ని చూపుతుంది. రాత్రి, ఉదయం పూట చలి ఎక్కువగా ఉంటుండడంతో ప్రజలు ఉన్ని దుస్తులు ఉంటే కానీ బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. చాలా చోట్ల మంటలు పెట్టుకొని చలి కాచుకుంటూ కనిపిస్తున్నారు.రోడ్ల పై మంచుతో ఇబ్బందులు పడుతున్నారు.






చలితో యాచకుల ఇబ్బందులు


వరంగల్‌ ఉమ్మడి జిల్లాలో చలి తీవ్రత అధికంగా ఉంది. రాత్రి పూట ప్రయాణం చేసే వారు చలితో ఇబ్బందులు పడుతున్నారు. యాచకులు.. చలితో అనేక అవస్థలు పడుతున్నారు. దుప్పట్లు ఉన్నా చలికి తట్టుకోలేక పోతున్నారు. చలిగాలులు వణికిస్తుండటంతో స్వెట్టర్ల అమ్మకాలు హనుమకొండలో ఊపందుకున్నాయి. వినియోగదారులను ఆకట్టుకునేలా రంగు రంగుల స్వెట్టర్లు, టోపీలు ఇతర దుస్తులను వ్యాపారులు అందుబాటులో ఉంచారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి..ఉత్తరభారతం నుంచి వచ్చే గాలుల ప్రభావంతో రాత్రిపూట చలి తీవ్రత మరింతగా పెరుగుతుందని వాతావరణ శాఖ చెబుతోంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరుతున్నారు.