Minister Indrakaran Reddy: మావోయిస్టు పార్టీ మాజీ అగ్రనేత, ఆ పార్టీ కేంద్ర కమిటీ మాజీ సభ్యుడు ఒగ్గు సట్వాజీ అలియాస్ సుధాకర్ ను మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ఆదివారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఆయన ఇంటికి వెళ్లి.. అతడితో కలిసి భోజనం చేశారు. 1990 దశకంలో పీపుల్స్ వార్ పార్టీలో చేరి సుదీర్ఘ కాలం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పనిచేసిన సుధాకర్.. మావోయిస్టు పార్టీలో కీలక నేతగా ఎదిగారు. కేంద్ర కమిటీ సభ్యునిగా, ఆంధ్ర, ఒడిషా బోర్డర్ పొలిటికల్ సెక్రటరీగా ఆయన పదవులు చేపట్టారు. ఇటీ వలే సుధాకర్ ప్రభుత్వానికి సరెండర్ అయిన తర్వాత తనతో పాటే లొంగిపోయిన భార్యతో కలిసి సాధారణ జీవనం గడుపుతున్నాడు. కాగా ఆయన ఇంటికి వెళ్లి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి భోజనం చేసి యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. నిషేధిత మావోయిస్టు పార్టీని వీడి సాధారణ జీవితం గడిపే నక్సలైట్ కుటుంబాలకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందని ఈ సందర్భంగా మంత్రి హామీ ఇచ్చారు. ప్రభుత్వం తరఫున లొంగిపోయిన నక్సలైట్లకు ఇచ్చే ఆర్థిక సహాయంతో పాటు పునరావాస కార్యక్రమాలను సైతం కొనసాగిస్తామని చెప్పారు.
"కలెక్టరేట్ పనులను డిసెంబర్ లోగా పూర్తి చేయాలి"
అనంతరం సమీకృత కలెక్టరేట్ భవన నిర్మాణ పనులను మంత్రి ఇంద్ర కరణ్ రెడ్డి పరిశీలించారు. ప్రజలకు సకాలంలో మెరుగైన సేవలు అందించాలన్న లక్ష్యంతో నిర్మిస్తున్న నూతన కలెక్టరేట్ భవన నిర్మాణ పనులను సత్వరమే పూర్తి అయ్యేలా చర్యలు తీసుకోవాలని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి జిల్లా అధికారులు, కాంట్రాక్టర్ ను ఆదేశించారు. స్థానిక ప్రజా ప్రతినిదులతో కలిసి ఆదివారం ఆయన నిర్మల్ జిల్లాలోని సమీకృత కలెక్టరేట్ నిర్మాణ పనులను పరిశీలించారు. కలెక్టరేట్ ప్రాంగణమంతా కలియ తిరుగుతూ, అక్కడ జరుగుతున్న పనులను అధికారులను అడిగి తెలుసుకున్నారు. దాదాపుగా కలెక్టరేట్ భవన నిర్మాణ పనులు పూర్తి కావచ్చాయని, మిగితా పెండింగ్ పనులు డిసెంబర్ లోగా పూర్తి చేయాలన్నారు. అనంతరం రేపు ప్రారంభం కానున్న కలెక్టరేట్ అప్రోచ్ రోడ్డు ప్రాంతాన్ని మంత్రి పరిశీలించారు. అప్రోచ్ రోడ్, ఇతర సుందరీకరణ పనులు పూర్తయితే నిర్మల్ పట్టణానికి దీని వల్ల అదనపు హంగులు వస్తాయని పేర్కొన్నారు.
అంబేడ్కర్ కాంస్య విగ్రహా ప్రతిష్టాపనకు భూమి పూజ..
నిర్మల్ పట్టణ సమీపంలోని చించోలి చౌరస్తా వద్ద రాజ్యాంగ నిర్మాత, భారత రత్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహ ప్రతిష్టాపనకు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అందరివాడని, సీఎం కేసీఆర్ అంబేడ్కర్ అడుగుజాడల్లో నడుస్తూ... ప్రతి ఒక్కరి సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని అనేక పథకాలను అమలు చేస్తున్నారన్నారు. ముఖ్యంగా దళితుల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని పేర్కొన్నారు. అన్ని వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన అంబేడ్కర్ మహనీయుడని, అందరికీ ఆదర్శప్రాయుడని అలాంటి గొప్ప వ్యక్తి సేవలకు గుర్తుగా ఇక్కడ విగ్రహా ప్రతిష్ట చేయడం సంతోషదాయకమని తెలిపారు.