Janagama District News: ఎవరైనా చనిపోతే సమాధి చేస్తాం. లేదా దహన సంస్కారాలు నిర్వహిస్తాం. కానీ మరియపురం గ్రామంలో ఒక వింత ఆచారం ఉంది. ఈ గ్రామంలోని రోమన్ క్యాథలిక్ కుటుంబంలో ఎవరు చనిపోయినా ఒకే సమాధిలో ఒకరిపై ఒకరిని సమాధి చేస్తారు. వీటినే కుటుంబ సమాధులు అంటారు. అది ఎలానో ఈ స్టోరీలో చూద్దాం.


జనాభా పెరుగుతుంది. కానీ భూమి పెరగడం లేదు. దీంతో ఉన్న భూమినే అవసరాలకు అనుగుణంగా వినియోగించుకోవాల్సి వస్తుంది. భూమి తక్కువగా ఉండడం భూముల రేట్లు పెరగడంతో విశాలమైన ఇండిపెండెంట్ హౌస్ ల స్థానంలో అపార్ట్మెంట్ కల్చర్ వచ్చింది. ఇప్పుడు చనిపోయిన మనుషులను సమాధి చేయడంలో కూడా అపార్ట్మెంట్ కల్చర్ వచ్చింది. ఒక్కొక్కరికి ఒక్కొక్క సమాధి కాకుండా ఒకరిపై ఒకరిని సమాధి చేసే ఆచారం మొదలైంది.


గ్రామంలో అందరూ క్రైస్తవులే...
ఇది మరియపురం గ్రామం. ప్రస్తుత జనగామ జిల్లాలో ఈ గ్రామం ఉంది. సుమారు 80 సంవత్సరాల క్రితం ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు ప్రాంతం నుండి వచ్చిన వారు మరియాపురం గ్రామం ను ఏర్పాటు చేసుకున్నారు. వీరంతా రోమన్ క్యాథలిక్ క్రిస్టియన్ కమ్యూనిటీకి చెందినవారు. సాధారణంగా క్రిస్టియన్ మతంలో ఎవరు చనిపోయినా సమాధి చేయడం జరుగుతుంది. ఇప్పటికీ అలాగే సమాధి చేస్తారు. మరియాపురం గ్రామంలో సైతం గత 20 సంవత్సరాల క్రితం వరకు వ్యక్తిగత సమాధులు చేసేవారు. ఆ తరువాత నుండి కుటుంబ సమాధుల పేరుతో ఒకే సమాధిలో ఆ కుటుంబంలో ఎవరు చనిపోయినా అంతస్తులుగా సమాధి చేస్తూ వస్తున్నారు. కుటుంబం అంటే ఒకే దగ్గర ఉంటారు కాబట్టి చనిపోయిన తరువాత కూడా ఒకే దగ్గర ఉండాలని కుటుంబ సమాధులను ఆచరిస్తున్నామని బాలశౌరెడ్డి చెప్పారు.


నిర్మాణ శైలి... సమాధి ఎలా చేస్తారు.
కుటుంబ సమాధులను ఎలా చేస్తారంటే.. ఒక కుటుంబంలో ఎంత మంది ఉంటారో ఆ సంఖ్యను బట్టి సమాధిని ఆరు నుండి ఎనిమిది ఫీట్ల లోతు తీస్తారు. అడుగు భాగం నుండి ఇటుకలతో గోడల నిర్మాణం చేస్తారు. ఇలా ముగ్గురిని లేదా నలుగురిని ఒకరిపై ఒకరిని సమాధి చేసే విధంగా రూపొందిస్తారు. కుటుంబం అంటే పెళ్లి కానీ వారు చనిపోతే తల్లిదండ్రులతో సమాధి చేస్తారు. పెళ్లి అయిన వారు ఉంటే వారిని మరో కుటుంబంగా భావిస్తారు. వ్యక్తిగత సమాధి కంటే కుటుంబ సమాధులే శుభ్రం చేసుకోవడం సులువు అని చెబుతున్నారు.




భూమి కొరత...
కుటుంబ సమాధులకు మరో కారణం ఉంది. భూమి తక్కువ ఉండడం.. సమాధులు పెరుగుతుండడంతో కుటుంబ సమాధులకు ప్రాధాన్యం ఇస్తున్నారు. కుటుంబ సమాధుల కారణంగా 100 సంవత్సరాలకు సరిపడే భూమి రెండు వందల నుంచి మూడు వందల సంవత్సరాలకు సరిపోతుందని అభిప్రాయపడ్డారు. 20 సంవత్సరాల క్రితం నిర్మించిన సమాధిని కూడా ఇప్పుడు కుటుంబం సమాధిగా మారుస్తున్నమని శౌరెడ్డి చెప్పారు.


సమాధులు చేయడానికి భూమి కొరత ఏర్పడుతుండడంతో ఈ సమాధులకు ప్రాధాన్యం ఇస్తున్నామని, భవిష్యత్ లో కుటుంబ సమాధులే వస్తాయని మరియాపురం గ్రామస్తులు చెబుతున్నారు.