Warangal Medico Preethi Death Case: వరంగల్ వైద్య విద్యార్థిని ప్రీతి మృతి కేసులో కీలక పరిణామం జరిగింది. నిందితుడు సైఫ్ ను నాలుగు రోజుల కస్టడీకి జిల్లా కోర్టు అనుమతి ఇచ్చింది. వాస్తవానికి ప్రీతి మృతి కేసులో విచారించేందుకుగానూ డాక్టర్ సైఫ్ ను వారం రోజులు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ ను బుధవారం విచారించిన జిల్లా కోర్టు సైఫ్ ను నాలుగు రోజులు పోలీస్ కస్టడీకి అనుమతి ఇచ్చింది. రేపటి (మార్చి 2వ తేదీ) నుంచి నాలుగు రోజుల పాటు పోలీసులు సైఫ్ ను విచారించనున్నారు.  


ప్రీతిని సైఫ్ ర్యాగింగ్ చేశాడు.. కమిటీ నిర్ధారణ 
వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీలో ప్రీతి మరణంపై యాంటీ ర్యాగింగ్ కమిటీ బుధవారం సమావేశమైంది. దాదాపు నాలుగు గంటలపాటు కమిటీ సభ్యులు పలు అంశాలపై చర్చించి కొన్ని విషయాలు తెలుసుకున్నారు. ప్రీతిని సైఫ్ మానసికంగా వేధించాని, ఇది కచ్చితంగా ర్యాగింగ్ కిందకి వస్తుందని, ర్యాగింగ్ జరిగిందని కమిటీ నిర్ధారించింది. మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ మోహన్ దాస్ అధ్యక్షతన మొత్తం 13 మంది యాంటీ ర్యాగింగ్ కమిటీ సభ్యులు సమావేశంలో పాల్గొన్నారు. ప్రీతి ఆత్మహత్యాయత్నానికి ముందు ఏం జరిగింది, అందుకు గల కారణాలపై కీలకంగా చర్చ జరిగింది. 


ఇద్దరికీ కౌన్సెలింగ్ ఇచ్చామన్న హెచ్ఓడీ
వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీలో గత ఏడాది నవంబర్ 18న ప్రీతి అడ్మిషన్ పొందింది. అయితే సీనియర్ సైఫ్, ప్రీతికి మధ్య విభేదాలు ఎందుకు వచ్చాయి అనే అంశంపై కమిటీ చర్చించింది. జీఎంహెచ్ ఆసుపత్రిలో అనస్తీషియా రిపోర్ట్ విషయం ఒక్కటే సైఫ్, ప్రీతికి మధ్య గొడవకు కారణం కాదని తేలింది. సైఫ్ తనను టార్గెట్ చేసి వేధిస్తున్నాడని హెచ్ఓడీ నాగార్జున రెడ్డికి ప్రీతి ఫిర్యాదు చేసింది. ఏడుస్తూ తనకు తలెత్తిన సమస్యను, వేధింపులను ప్రీతి ఫిర్యాదు చేసినట్లు హెచ్ఓ‌డీ వెల్లడించారు. దీనిపై ప్రీతి, సైఫ్ ను పిలిచి కొందరు వైద్యుల సమక్షంలో ఇద్దరికీ కౌన్సెలింగ్ ఇచ్చి జాగ్రత్తగా నడుచుకోవాలని సూచించినట్లు యాంటీ ర్యాగింగ్ కమిటీకి HOD తెలిపారు. 


ఇద్దరికీ కౌన్సెలింగ్ ఇచ్చిన తరువాత సైతం ప్రీతిని సైఫ్ వేధించాడని కమిటీ గుర్తించింది. కనుక మానసిక వేధింపులు సైతం ర్యాగింగ్ కిందకే వస్తుందని, ర్యాగింగ్ జరిగినట్లు ప్రిన్సిపల్ మోహన్ దాస్ తెలిపారు. అయితే మానసిక వేధింపులు జరిగాయి, కానీ లైంగిక వేధింపులు లేవన్నారు. ఇదే నివేదికను ఢిల్లీలోని యూజీసీతో పాటు నేషనల్ మెడికల్ కౌన్సిల్ కు పంపిస్తామని చెప్పారు. పైనుంచి వచ్చే ఆదేశాలతో తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పారు. 


2 విషయాల్లో ప్రీతిని టార్గెట్ చేసిన సైఫ్ !  
ప్రీతి ఆత్మహత్య కేసుకు సంబంధించి యాంటీ ర్యాగింగ్ కమిటీ సమావేశమైంది. అయితే ఈ కేసులో నిందితుడిగా ఉన్న ప్రీతి సీనియర్, డాక్టర్ సైఫ్ రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు వెలుగుచూశాయి. సైఫ్ ఫోన్ లో 17 వాట్సాప్ చాట్స్ పోలీసులు పరిశీలించారు. ముఖ్యంగా రెండు విషయాలలో ప్రీతిని డాక్టర్ సైఫ్ టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. గతంలో ఓ రోడ్డు ప్రమాదం కేసులో అనస్తీషియా రిపోర్ట్ ప్రీతి రాయడం, మరోవైపు రిజర్వేషన్ కారణంగా ప్రీతి ఫ్రీ సీటు పొందడంపై సైఫ్ ఆమెను టార్గెట్ చేసుకున్నాడని ప్రాథమికంగా గుర్తించారు.


సైఫ్ ఫోన్ పరిశీలించిన పోలీసులు, యాంటీ ర్యాగింగ్ కమిటీ పలు కీలక విషయాలను గుర్తించారు. అనుషా, భార్గవి, LDD+ knockouts వాట్స్ అప్ గ్రూప్ చాట్స్ వివరాలు సేకరించి పరిశీలించారు. అందులో అనస్తీషియా డిపార్ట్మెంట్ లో ప్రీతిని సూపర్వైజ్ చేస్తున్న సీనియర్, డాక్టర్ గా సైఫ్ ఉన్నాడు. రెండు ఘటనల ఆధారంగా ప్రీతిపై సీనియర్ సైఫ్ కోపం పెంచుకున్నాడు. డిసెంబర్ లో ఒక యాక్సిడెట్ కేస్ విషయం లో ప్రీతిని సైఫ్ గైడ్ చేశాడు. ఆ ప్రమాదానికి సంబంధించి ప్రిలిమినరీ అనస్తీషియా రిపోర్టును మెడికో ప్రీతి (Medical Student Preethi) రాసింది. ప్రీతి రాసిన రిపోర్టును తమ వాట్సాప్ గ్రూప్ లో పెట్టి హేళన చేశాడు సైఫ్.- రిజర్వేషన్ లో ఆమెకు ఫ్రీ సీట్ వచ్చిందంటూ ప్రీతిని అవమానించాడని కమిటీ, పోలీసులు గుర్తించారు.