Warangal Kakatiya Zoological Park: పక్షులు, జంతువుల సంరక్షణ, నిర్వహణలో పాలుపంచుకోవడానికి పక్షులు, జంతు ప్రేమికులకు ఆహ్వానం పలుకుతుంది వరంగల్ లోని జులాజికల్ పార్క్. స్వయంగా పక్షుల ఆలన పాలన చూసుకోలేని వారికి, వాటి సంరక్షణ లో భాగస్వాములు కావాలనుకునే వారికి జూ పార్కు పక్షులను, జంతువులను దత్తత ఇస్తుంది. సంరక్షణ, దత్తత ను మూడు, ఆరు, సంవత్సరం ఎవరి వీలును బట్టి వారు దత్తత తీసుకోవచ్చు.
వరంగల్ నగరంలోని హంటర్ రోడ్ లో ఉన్న కాకతీయ జూలాజికల్ పార్క్ రాష్ట్రంలోనే రెండవ అతిపెద్ద జూలాజికల్ పార్క్ గా పేరుంది. ఈ పార్కులో చిరుతపులి, మొసలి, జంగిల్ క్యాట్, సాంబార్ జింక, మౌస్ డీర్, నెమలి, తెల్ల నెమలి, ప్రేమ పక్షులు, కాకాటిల్స్, క్రిష్ణ జింక, వైట్ రియా పక్షి, నక్షత్ర తాబేలు ఇలా 440 కి పైగా జంతు, పక్షి జాతులు సందర్శకుల సందర్శనార్థం అందుబాటులో ఉన్నాయి. కాకతీయ జూలాజికల్ పార్క్ సందర్శకులకు విజ్ఞానం, వినోదాన్ని పంచడంతోపాటు జూ పార్క్ సంరక్షణలో భాగంగా అనేక జంతు, పక్షులను దత్తత ఇస్తుంది. సంరక్షణ, నిర్వహణలో భాగస్వాములను చేయడానికి 2016 సంవత్సరం నుండి దత్తత స్కీంను మొదలుపెట్టారు జూ పార్క్ అధికారులు.
92 ఎకరాల్లో విస్తరించి ఉన్న జూలాజికల్ పార్క్ లో అనువైన వాతావరణంలో జంతువులు, పక్షులు ఆలన పాలన సాగుతుంది. వీటి సంరక్షణ లో భాగంగా ఖరీదైన పౌష్టికాహారం, వైద్యం అందించడం జరుగుతుంది. జంతువుల, పక్షుల దత్తతను తీసుకొని వాటి నిర్వహణ, సంరక్షణ లో భాగస్వాములను చేయడానికి కార్పొరేట్ సంస్థలను, విద్య సంస్థలను, స్వచ్ఛంద సంస్థలను, జంతు, పక్షు ప్రేమికులను, పౌరులను ఆహ్వానిస్తుంది. దత్తత తీసుకొనేవారికి భారం కాకుండా మూడు, ఆరు నెలలు, సంవత్సరం స్కీమ్ లను అందుబాటులో ఉంచారు పారెస్ట్ అధికారులు.
పక్షులు, జంతువుల ఎన్ క్లోజర్ల వద్ద దత్తత తీసుకున్న వారి పేర్లను బోర్డు రూపంలో పెడతారు. వాటికి అందించే ఫుడ్ మెను ను దాతలకు వివరిస్తారు. అంతేకాకుండా పక్షుల, జంతువుల యోగ క్షేమాలు అడిగి తెలుసుకోవచ్చని జులాజికల్ పార్క్ రేంజర్ మయూరి చెప్పారు. అంతే కాకుండా దత్తత తీసుకున్న దాతల ఫ్యామిలీకి సంవత్సరంలో రెండు లేదా మూడు సార్లు జూ పార్క్ ను ఫ్రీ చూడడానికి అవకాశం కల్పిస్తున్నట్లు అధికారి తెలిపారు. 2016 నుండి ఇప్పటి వరకు 90 మంది వివిధ జంతువులు, పక్షులను దత్తత తీసుకున్నారని జూ అధికారి చెప్పారు. దాతలు ముందుకు రావడానికి జూ పార్కులో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, పెద్ద సంఖ్యలో దాతలు ముందుకు రావాలని అధికారి మయూరి అభిప్రాయపడ్డారు.
జూ అధికారులు దాతలకు మరో అవకాశం కల్పిస్తున్నారు. దత్తత తీసుకున్న పత్రాలను ఇన్ కమ్ టాక్స్ లో చూపించుకోవచ్చని మయూరి తెలిపారు. దత్తత తీసుకున్న దాతలు వారి వారి కాల పరిమితిని బట్టి జూలాజికల్ పార్క్ వరంగల్ పేరిట చెక్కు లేదా క్యాష్ అకౌంట్లో వేయవచ్చని ఆమె తెలిపారు. పక్షులు జంతువులను దత్తత తీసుకోవాలనుకొనే దాతలు ఈ ఫోన్ నంబర్లను లేదా జూ పార్కు వెబ్ సైట్ ను సందర్శిస్తే పూర్తి వివరాలు చెప్పడంతో పాటు తెలుస్తాయని జూ పార్క్ రేంజర్ మయూరి చెప్పారు.
944 081 0093 జిల్లా ఫారెస్ట్ అధికారి హన్మకొండ.
8019919959 ఫారెస్ట్ రేంజర్ జులాజికల్ పార్క్.
778037 89 72 సెక్షన్ ఆఫీసర్ జులాజికల్ పార్క్.
వెబ్ సైట్: www.kakatiyazoo.in ను సందర్శిస్తే పూర్తి వివరాలు అందుబాటులో ఉంటాయి.