Airport in Warangal: విమానాశ్రయాల విషయంలో తెలంగాణ వెనకబడి ఉందన్నది వాస్తవం. హైదరాబాద్ (Hyderabad) మినహా రాష్ట్రంలో మరెక్కడా ఎయిర్ పోర్టు లేదు. రాష్ట్రానికి ఒక్కటంటే ఒక్కటే విమానాశ్రయం దశాబ్దాలుగా ఉంది. రాష్ట్రం దాటి బయటకు ఎక్కడికి వెళ్లాలన్నా హైదరాబాద్‌పై ఆధారపడాల్సిందే. రాష్ట్రంలోనే రెండో పెద్ద నగరమైన వరంగల్‌ (Warangal)లో స్వాతంత్య్రానికి పూర్వమే విమానాశ్రయం ఉంది. స్వల్ప మరమ్మతులు చేస్తే ప్రజలకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నా.. దశాబ్దాల కాలంగా తెలంగాణ (Telangana) ప్రజలకు ఎదురు చూపులు తప్పడం లేదు


భారతదేశంలోనే అతిపెద్ద విమానాశ్రయం


వరంగల్ నగరంలోని మామునూరు వద్ద చివరి నిజా మీర్ ఉస్మాన్ అలీఖాన్ 1930లోనే అతిపెద్ద విమానాశ్రయం (Airport) నిర్మించారు. దాదాపు 700 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో 6 కిలోమీటర్ల అతిపెద్ద రన్‌వే తో భారత్‌లోనే అతిపెద్ద విమానాశ్రయాన్ని అందుబాటులోకి తెచ్చారు. ఉత్తర తెలంగాణలోని వివిధ వ్యాపారాల అభివృద్ధికి రాకపోకల కోసం ఈ విమానాశ్రయాన్ని వినియోగించుకునే వారు. అనేకమంది రాష్ట్రపతులు, ప్రధానులు, ఇటీవల కాలంలో హోంమంత్రి అమిత్‌షా సైతం ఈ విమానాశ్రయాన్ని వినియోగించుకున్నారు. ప్రముఖుల పర్యటనల రాకపోకలతో 1980 వరకు విమానాశ్రయం అందుబాటులో ఉంది. కానీ ఆ తర్వాత పూర్తిగా మూపడింది.


యుద్ధకాలంలోనూ సేవలు


భారత్, చైనా యుద్ధ సమయంలో శత్రువులు ఢిల్లీ (Delhi) విమానాశ్రయాన్ని టార్గెట్ చేసుకోడంతో.. ప్రత్నామ్నయంగా రాకపోకల కోసం వరంగల్ విమానాశ్రయాన్ని వినియోగించుకున్నారు. కార్గిల్ యుద్ధ సమయంలోనూ శత్రువులు ఏదైనా విమానాశ్రయాన్ని టార్గెట్ చేస్తే అత్యవసరంగా వాడుకునేందుకు వరంగల్ ఎయిర్ పోర్టును సిద్ధం చేసి ఉంచారు. ఇంతటి ఘన చరిత్ర ఉన్న ఈ విమానాశ్రయం మాత్రం సామాన్య ప్రజల రాకపోకలకు మాత్రం ఉపయోగపడకపోవడానికి పాలకుల నిర్లక్ష్యమే కారణమని చెప్పాలి.


6.6 కి.మీ రన్ వే, పైలట్, సిబ్బంది గృహాలు, పైలట్ శిక్షణా కేంద్రం, ఒకటి కన్నా ఎక్కువ టెర్మినల్స్ తో 700 ఎకరాలకు పైగా భూమి కలిగిన ఉన్న ఈ విమానాశ్రయం ప్రస్తుతానికి నిరూపయోగంగా పడి ఉంది.


ప్రతిపాదనలకే పరిమితం


తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో ఆరు విమానాశ్రయాల ఏర్పాటుకు కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపింది. ఎయిర్ పోర్ట్అథారిటీ ఆఫ్ ఇండియా టెక్నికల్ సర్వే నిర్వహించిన తర్వాత మూడు విమానాశ్రయాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా.. అందులో ఈ వరంగల్ విమానాశ్రం ఒకటి. అయితే దశాబ్దాలుగా నిరూపయోగంగా ఉండటంతో విమానాశ్రయానికి చెందిన కొంత భూమి కబ్జాకు గురైంది. ఈ విమానాశ్రయాన్ని మళ్లీ అందుబాటులోకి తీసుకురావాలంటే మరికొంత భూమి అవసరం ఉంది. భూసేకరణకు ప్రభుత్వం సైతం ఆదేశాలు జారీ చేసింది. అప్పట్లో కేంద్రంపై కొంత ఒత్తిడి తీసుకురాగా వరంగల్ (Warangal) ఎయిర్ పోర్టు ప్రారంభించాలని నిర్ణయించింది. ముందుగా తక్కువ సీటింగ్ ఉన్న చిన్న విమానాలను నడపాలని నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తెలిపాయి. కానీ ఇప్పటికీ ఆ హామీ అమలుకు నోచుకోలేదు.


ఎదురు చూపులు తప్పడం లేదు


కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టిన ప్రతిసారీ వరంగల్ విమానాశ్రయానికి నిధుల కేటాయింపు జరుగుతుందని ఎదురు చూడటం.. నిరాశ చెందడం పరిపాటిగా మారింది. తమ ప్రాంతం నుంచే విమానాల్లో ఎగరాలనుకుంటున్న వరంగల్‌ వాసుల కల కలగానే మిగిలిపోతోంది. ఈసారి బడ్జెట్‌లోనూ ప్రభుత్వం మొండి చేయి చూపింది.