అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ నెల 8న వరంగల్ జిల్లా వర్ధన్నపేట నియోజకవర్గం పర్వత గిరి మండలం, పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరు పట్టణానికి మంత్రి కేటీఆర్ రానున్నారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. 


మంత్రి కేటీఆర్ వరంగల్ జిల్లా వర్ధన్నపేట పర్యటన సందర్భంగా రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్, వర్ధన్నపేట ఎమ్మెల్యే రమేశ్ లతో కలిసి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అక్కడ హెలి ప్యాడ్, సభా స్థలం, పార్కింగ్ ప్లేస్ లను, ఇతర ఏర్పాట్లను పరిశీలించారు. అక్కడ చేయాల్సిన ఏర్పాట్లను అధికారులతో మంత్రి చర్చించారు. ప్రతిమ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ అధ్వర్యంలో అక్కడ ఏర్పాటు చేయనున్న మహిళలకు క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరాన్ని కేటీఆర్ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ 8వ తేదీన ప్రారంభించనున్నారు. ఈ స్క్రీనింగ్ ని మహిళలు ఉపయోగించుకోవాలని మంత్రి ఎర్రబెల్లి, బోయిన పల్లి వినోద్ కుమార్, ఎమ్మెల్యే రమేశ్ సూచించారు.


పాలకుర్తి నియోజకవర్గానికి మంత్రి కేటీఆర్
మహిళా దినోత్సవం సందర్భంగా ఈ నెల 8న పాలకుర్తి నియోజకవర్గంలో మంత్రి కేటీఆర్ పర్యటించనున్నారు. కేటీఆర్ పర్యటనలో పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అధికారులను ఆదేశించారు. సంబంధిత అధికారులతో మంత్రి ఎర్రబెల్లి ఆదివారం నాడు సమీక్ష నిర్వహించారు. మంత్రి కేటీఆర్ తన పర్యటనలో భాగంగా తొర్రూరు పట్టణంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. 
మహిళలతో భారీ బహిరంగ సభ
పలు కార్యక్రమాలు ప్రారంభించిన అనంతరం 20 వేల మంది మహిళలతో మంత్రి కేటీఆర్ భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. సభలో కేటీఆర్ కొన్ని కీలక విషయాలపై ప్రసంగించనున్నారని తెలుస్తోంది. అదే సందర్భంగా డ్వాక్రా మహిళలకు మంత్రి కేటీఆర్ శుభవార్త చెప్పే అవకాశం ఉందని మంత్రి ఎర్రబెల్లి వెల్లడించారు. సభ పూర్తయ్యాక బీఆర్ఎస్ నేతలు, ముఖ్య కార్యకర్తలతో స్థానిక బీఆర్ఎస్ కార్యాలయంలో సమావేశం కానున్నారు. కేటీఆర్ పర్యటన సందర్భంగా అధికారులు, ప్రజా ప్రతినిధులతో కలిసి, హెలిప్యాడ్, బహిరంగ సభా స్థలం, పార్కింగ్ స్థలాలను మంత్రి ఎర్రబెల్లి పరిశీలించారు. తొర్రూరు పట్టణ అభివృద్ధికి కావాల్సిన మరిన్ని నిధులు, అవసరాల గురించి మంత్రి ఎర్రబెల్లి చర్చించారు. కేటీర్ పర్యటన సందర్భంగా అధికారులు, పార్టీ శ్రేణులకు అంశాల వారీగా బాధ్యతలు అప్పగించారు. 


త్వరలో ఆశా వర్కర్లకు జీతాల పెంపు..
ఆశా వర్కర్లకు అత్యధిక జీతాలు ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ అని మంత్రి కేటీఆర్ అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ సొంత రాష్ట్రం గుజరాత్ కంటే ఎక్కువ వేతనాలు తెలంగాణలో ఇస్తున్నట్లు చెప్పారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలంలోని జిల్లెల్లలో రూ.20 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన పల్లె దవాఖానాను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. స్వలాభం కోసం కొందరు ఆశా వర్కర్లను రెచ్చగొడతారని, దీనిపై ఆలోచించాలన్నారు. కరోనా సంక్షోభం వల్ల జీతాలు పెంచలేకపోయామని, పరిస్థితులు మారాక ఆశా వర్కర్లకు జీతాలు పెంచుతామని మంత్రి కేటీఆర్ గుడ్ న్యూస్ చెప్పారు.