కూతుర్ని ప్రేమిస్తున్నాడని తెలిసి ఓ యువకుడిపై ఆమె తండ్రి అత్యంత అమానుషంగా ప్రవర్తించాడు. అతణ్ని నమ్మించి రప్పించి చిత్రహింసలు పెట్టాడు. ఇంట్లో బంధించి బట్టలు విప్పించి శారీరకంగా హింసించాడు. ఈ ఘటన కాజీపేట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ సంఘటన ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది.


ఈ ఘటనపై బాధిత యువకుడి తండ్రి ఫిర్యాదు చేస్తే.. యువకుడే మోసం చేస్తున్నాడని యువతి బంధువులు తిరిగి కేస్‌ పెట్టారు. ఇలా పోలీసులకు ఒకరిపై మరొకరు పరస్పర ఫిర్యాదులు చేసుకోవడంతో విషయం బయటికి వచ్చింది. దీంతో పోలీసులు ఇరువర్గాలపై కేసులు నమోదు చేశారు. 


హన్మకొండ జిల్లా ధర్మసాగర్‌ మండలం ధర్మపురం గ్రామానికి చెందిన బైరపాక ప్రభుదాస్‌ అనే వ్యక్తి కాంట్రాక్టర్‌గా పని చేస్తున్నాడు. స్థానికంగా ఉన్న డీజిల్‌ కాలనీలో భార్యా పిల్లలతో కలిసి అద్దెకు ఉండేవాడు. అతని కుమారుడు ప్రసాద్‌ ఇంటి యజమాని కూతురుతో సన్నిహితంగా ఉంటున్నాడని అనుమానపడ్డాడు. ఈ విషంలో గతంలో కూడా చాలాసార్లు గొడవలు జరిగాయి. ఈ గొడవలు కారణంగా ప్రభుదాస్‌ కుటుంబం  ఇళ్లు మారిపోయింది. అయినా వారిద్దరి మధ్య ప్రేమ కొనసాగుతూనే ఉంది.


ఇళ్లు దూరమైన ఇద్దరి మధ్య ప్రేమకు బ్రేక్‌ పడలేదని తెలుసుకున్నాడు ఇంటి యజమాని. సెటిల్ చేద్దామంటూ గత బుధవారం అమ్మాయితో ప్రసాద్‌కు ఫోన్‌ చేయించి ఇంటికి రమ్మని పిలిపించారు బంధువులు . 


ఇంటికి వచ్చిన అతణ్ని ఇంట్లోకి తీసుకెళ్లి తాళ్లతో కాళ్లు, చేతులు కట్టేసి అర్థనగ్నంగా చేసి విచక్షణారహితంగా కొట్టారు. దీంతో ప్రసాద్‌ తీవ్రంగా గాయపడ్డాడు. దాడి చేస్తూ ఫొటోలు, వీడియోలు కూడా తీశారు. ఆ ఫోటోలు, వీడియోలు ప్రసాద్‌ మిత్రులకు పంపించడంతో విషయం స్నేహితులకు, కుటుంబ సభ్యులకు తెలిసింది. బాధితుడి తండ్రి బంధువులు, మిత్రులతో వెళ్లి ప్రసాద్‌ను విడిచిపెట్టాలని వేడుకోగా మరోసారి అమ్మాయి జోలికి రావొద్దని పేపర్ పై రాయించుకుని వదిలి పెట్టారు. 


తీవ్రంగా గాయపడిన యువకుడి పరిస్థితి విషమంగా ఉండడంతో అతణ్ని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ఇదిలా ఉండగా యువకుడితో పాటు అతడి కుటుంబ సభ్యులపై అమ్మాయిని వేధిస్తున్నట్లు అందిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. వీరితోపాటు యువకుడిని చితకబాదిన యువతి తండ్రితోపాటు సహకరించిన మరో ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు చెప్పారు.


ఇరువర్గాలను పోలీసులు విచారిస్తున్నారు. ఆ యువతీయువకులను కూడా ప్రశ్నిచనున్నారు. ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు ప్రజలు. ప్రేమించారన్న కారణంతో ఇంటికి పిలిచి కొట్టడమేంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.