BRS Party Latest News: ఉమ్మడి వరంగల్ జిల్లాలో టిఆర్ఎస్ పార్టీ జడ్పీ చైర్మన్ ల అకాల మరణం ఆ పార్టీకి తీరని లోటు ఏర్పడింది. ఆరు నెలల క్రితం ములుగు జిల్లా జడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్ గుండెపోటుతో మరణించారు. ఆ లోటు వెంటాడుతుండ గానే మరో చైర్మన్ మృతి చెందారు. నిన్న సాయంత్రం జనగామ జిల్లా పరిషత్ చైర్మన్, బీఆర్ ఎస్ జిల్లా అధ్యక్షులు పాకాల సంపత్ రెడ్డి గుండెపోటుతో చనిపోయాడు. ఇద్దరూ జడ్పీ చైర్మన్లు తెలంగాణ ఉద్యమ కాలం నుండి అప్పటి తెలంగాణ రాష్ట్ర సమితిలో కీలకంగా కొత్తగా ఏర్పడిన జిల్లాలో కీలక నేతలు. ములుగు జిల్లా దివంగత జిల్లా పరిషత్ చైర్మన్ కుసుమ జగదీష్ మాజీ మావోయిస్టుగా ఉండేవారు. తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితి స్థాపించిన నాటి నుంచి ఉద్యమనేతగా కొనసారు. కేసీఆర్ కు ఉద్యమ కాలం నుంచి నమ్మిన నాయకునిగా కొనసాగుతూ వచ్చారు. 


ములుగు జిల్లాలో కీలక నేతగా ఎదగడంతో జిల్లా పరిషత్ చైర్మన్ గా , పార్టీ జిల్లా అధ్యక్షులు గా అవకాశం కలిపించారు. జగదీష్ మరణం ములుగు జిల్లాలో తీవ్రప్రభావాన్ని చూపింది. ములుగు నియోజకవర్గం బీఆర్ ఎస్ అభ్యర్థి ఓటమికి జగదీష్ మృతి  ప్రధాన కారణంగా చెప్పవచ్చు. జగదీష్ లోటు తీరకముందే నిన్న సాయంత్రం జనగామ జిల్లా జడ్పీ చైర్మన్ పాగాల సంపత్ రెడ్డి మృతి చెందడంతో పార్టీ శ్రేణులు సంపత్ రెడ్డి లేని లోటును జీర్ణించుకోలేక పోతున్నారు. దివంగత జనగామ చైర్మన్ సంపత్ రెడ్డి హైదరాబాద్ లో ఉద్యోగం చేస్తుండగా కేసీఆర్ పిలుపు మేరకు అప్పటి టీఆర్ ఎస్ లో చేరి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. ఉద్యమనేత, కేసీఆర్ కు అత్యంత సన్నిహితులు కావడంతో జనగామ జిల్లా పరిషత్ చైర్మన్ గా, జనగామ జిల్లా పార్టీ అధ్యక్షుడు గా కేసీఆర్ నియమించారు. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో సంపత్ రెడ్డి కీలకంగా వ్యవహరించి జిల్లాలో ఇద్దరు ఎమ్మెల్యే ల గెలుపుకు కృషి చేసారు. సంపత్ రెడ్డి అకాల మరణం ఆ పార్టీకి ఇప్పుడున్న పరిస్థితుల్లో తీరని లోటుగా చెప్పవచ్చు.


కేటీఆర్ నివాళి
బీఆర్ఎస్ పార్టీ జనగామ జిల్లా అధ్యక్షుడు, జెడ్పి ఛైర్మన్ పాగాల సంపత్‌ రెడ్డి పార్ధివదేహానికి బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నివాళి అర్పించారు. అనంతరం సంపత్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని మంత్రి కేటీఆర్ ప్రార్థించారు. బీఆర్‌ఎస్ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరైన పాగాల సంపత్‌ రెడ్డి హఠాన్మరణం బాధాకరం అన్నారు. 14 ఏళ్లు కేసీఆర్ వెంట సైనికుడిలా ఉండి పని చేశారని, సంపత్‌ రెడ్డి మరణం ప్రతి బీఆర్‌ఎస్ కార్యకర్తను కలచి వేసిందని అన్నారు. జిల్లా పార్టీ అధ్యక్షుడిగా సంపత్‌రెడ్డి క్రియాశీలకంగా పని చేశారని, పార్టీ ఏ కార్యక్రమం ఇచ్చినా నిబద్ధతతో పనిచేస్తూ విజయవంతం చేశారన్నారు. సంపత్‌ రెడ్డి కుటుంబానికి కేసీఆర్, పార్టీ శ్రేణుల తరపున ప్రగాఢ సానుభూతి తెలిపారు. సంపత్‌ రెడ్డి మరణం పార్టీకి తీరని లోటన్న కేటీఆర్, వారి కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని అన్నారు.


రేపు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల జెడ్పీ ఛైర్మన్లు, జిల్లా అధ్యక్షులు పార్టీ కార్యాలయాల్లో ఘనంగా నివాళులు అర్పించాలని పార్టీ శ్రేణులకు కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.