Jangaon District: 30 ఏళ్ల పాటు విశేష ఆదరణ పొందిన యూరప్ సాంప్రదాయ హస్తకళలు కొన్ని సంవత్సరాలుగా నిరాదరణకు గురవుతున్నాయి. యూరప్ హస్తకళల గురించి ఇక్కడెందుకు ప్రస్తావన అని అనుకుంటున్నారా? అవి నిరాదరణకు గురవుతోంది మన తెలంగాణలోనే. అవును ఉమ్మడి వరంగల్ జిల్లా స్టేషన్ ఘనపూర్ కేంద్రంలో యూరప్ హస్తకళలు గతంలో విశేష ప్రాచుర్యం పొంది వేలమంది జీవనోపాధి కల్పించాయి. కొన్నేళ్ల  క్రితం వేల సంఖ్యలో ఇక్కడ కళాకారులకు ఆర్డర్లు ఉండేవి. వారికి అసలు ఖాళీనే ఉండేది కాదు. కానీ ప్రస్తుతం కనీసం వందల సంఖ్యలో ఆర్డర్లున్నా తమ జీవితం వెళ్లిపోతుందని ఆశపడే ధైన్యానికి ఇక్కడి కళాకారులొచ్చారు. 


30 ఏళ్లకుపైగా ఉపాధి.. 


రావి ఆకులపై అందమైన పెయింటింగ్స్, తెల్లటి వస్త్రంపై అందమైన కళాకృతులు, చీరలపై మైమరిపించే డిజైన్లు.. ఇవన్నీ యూరోపియన్ హస్తకళలు. ఫాదర్ కొలంబో ఈ యూరోపియన్ హస్తకళలను ఉమ్మడి వరంగల్ జిల్లా స్టేషన్ ఘనపూర్ ప్రాంతానికి పరిచయం చేశారు. ఇక్కడి వారికి నేర్పించి ఈ హస్తకళలకు ఊపిరిపోశారు. 1970 దశకంలో ఫాదర్ కొలంబో స్టేషన్ ఘన్ పూర్ వచ్చి స్థిరపడ్డారు. తనకు తెలిసిన కళను ఇక్కడి వారికి పంచి.. చాలా మంది మహిళలకు, పురుషులకు హస్త కళల్లో నిష్ణాతులను చేసి ఉపాధి అవకాశాలు కల్పించారు. స్టేషన్ ఘన్పూర్ కేంద్రంగా వేలమంది ఈ హస్తకళల్లో ఉపాధి పొందేవారు. అలాంటి హస్తకళలు ఇప్పుడు ఆశించిన మేర ఆదరణకు నోచుకోవడం లేదు.


ఫాదర్ కొలంబో యూరోపియన్ దేశాలకు చెందిన నాలుగు కళలు, కేరళకు చెందిన ఒక హస్తకళలను స్టేషన్ ఘన్పూర్ ప్రజలకు పరిచయం చేశారు.  రావి ఆకులపై పెయింటింగ్స్, బాబిన్ లేస్, టాటింగ్ లేస్, క్రాస్ స్టిచింగ్, హ్యాండ్ ఎంబ్రాయిడరీ కళలను నేర్పించి ఉపాధి అవకాశాలు కల్పించారు. సుమారు 4 వేల మంది ఈ హస్తకళలతో ఉపాధి పొందేవారు. ఫాదర్ కొలంబో యూరప్ దేశాల నుంచి ఆర్డర్స్ తీసుకురావడంతోపాటు వీరి చేతిలో రూపుదిద్దుకున్న హస్తకళలను స్పెయిన్, ఇటలీ, అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, లండన్ ఇలా తొమ్మిది దేశాలకు ఎగుమతి చేసేవారు. ఇలా సుమారు 30 సంవత్సరాలకు పైగా ఇక్కడి ఈ హస్తకళలకు విశేష ప్రాచుర్యం ఉండేది.


ఫాదర్ కొలంబో మృతితో.. 


2009 లో ఫాదర్ కొలంబో మృతి చెందడంతో ఈ హస్తకళల విక్రయాలకు ఆదరణ కరువైంది. యూరప్ సాంప్రదాయ హస్త కళలు కావడంతో అక్కడ తయారు చేసేవారు లేక ఇక్కడ రూపుదిద్దుకున్న కళాకృతులకు గతంలో అక్కడ విశేష ఆదరణ ఉండేది. అలాంటిది ఫాదర్ మరణం తర్వాత విదేశాలకు ఎగుమతి చేసేవారు లేక హస్తకళలకు ఆదరణ తగ్గిపోయింది. ‘‘గతంలో స్టేషన్ ఘన్పూర్ కేంద్రంగా ఒక పరిశ్రమే కొనసాగేది. ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి అనేకమంది కళాకారులు ఇక్కడికి వచ్చి తయారు చేసేవారు. ఇప్పుడు ఉపాధి అవకాశాలు లేకపోవడంతో చాలా మంది కళాకారులు ఈ వృత్తిని వదిలేసి ఇతర ఉపాధి రంగాల్లో కొనసాగుతున్నారు’’ అని రావి ఆకు కళాకారుడు ప్రసాద్ చెప్పారు.


రావి ఆకు పెయింటింగ్స్ భలే.. 


యూరోపియన్ హస్త కళల్లో ప్రధానంగా ఆకట్టుకునేది రావి ఆకులపై పెయింటింగ్. రావి ఆకులను సేకరించి వాటిని నెలరోజుల పాటు నీటిలో నానబెట్టిన తర్వాత ఆకు పూర్తిగా కుళ్ళిపోయి జాలిలా మారుతుంది. ఆ ఆకులపై 25 రకాల అందమైన పెయింటింగ్స్ ను వేస్తారు. రావి ఆకులపైన వేసిన పెయింటింగ్స్ 50 రూపాయల నుంచి 3 వేల వరకు అందుబాటులో ఉన్నాయి. ఇక బాబిన్ లెస్, టాటింగ్ లేస్ క్రాస్ స్టిచ్చింగ్, హ్యాండ్ ఎంబ్రాయిడరీ లు 15 వందల రూపాయల నుండి 10 వేల రూపాయల వరకు పలుకుతాయి. 


ఈ ఐదు హస్తకళలకు ప్రస్తుతం ఆదరణ లేక. ఎలాంటి ఆర్డర్స్ లేక వీటిని నమ్ముకొని ఏళ్లుగా ఉపాధి పొందిన కళాకారులు రోడ్డున పడ్డారు. రావిఆకులపై పెయింటింగ్స్ కు గోల్కొండ హస్తకళల సొసైటీ ఆధ్వర్యంలో శిక్షణ ఇస్తున్నారు. మిగతా హస్తకళలకు కూడా తెలంగాణ హ్యాండ్ క్రాఫ్ట్ ద్వారా ఆర్డర్స్ తీసుకువచ్చే ప్రయత్నం తెలంగాణ ప్రభుత్వం చేయాలని యూరోపియన్ హస్తకళల కళాకారులు కోరుతున్నారు.