Telangana News: వరంగల్‌లో దారుణమైన ఘటన జరిగింది. తెలియని వైద్యంతో నిండు ప్రాణాన్ని తీశాడో ఆర్‌ఎంపీ. జ్వంతో బాధపడుతున్న వ్యక్తికి గంట వ్యవధిలోనే ఏడు ఇంజక్షన్‌లు ఇచ్చి బలి తీసుకున్నాడు. కేసు నమోదు అయ్యేసరికి షటర్ మూసేసి పరార్ అయ్యాడు.
వరంగల్ జిల్లా వర్ధన్నపేటకు చెందిన 28 ఏళ్ల కత్తి నవీన్ ఆటో తొలుతూ జీవనం సాగిస్తున్నాడు. ఈ మధ్య జ్వరంతో బారిన పడ్డాడు. నీరసంగా ఉందని చెప్పడంతో భార్య మేఘన ఆయన్ని ఫిరంగిగడ్డ వద్ద ఉన్న ఆర్ఎంపీ శ్రీనివాస్ వద్దకు తీసుకెళ్లింది. నవీన్ పరిస్థితి చూసిన శ్రీనివాస్ జ్వం తగ్గడానికి ముందుగానే ఇంజక్షన్ ఇచ్చాడు.
ఎలాంటి పరీక్షలు చేయకుండానే నాడి పట్టి చూసి వైద్యం ప్రారంభించేశాడు. అసలు నవీన్‌కు ఉన్న సమస్య ఏంటో కూడా తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. మొదటి ఇంజక్షన్ ఇచ్చిన కాసేపటికే మరో సూది మందు ఇచ్చాడు. తర్వాత సెలైన్ బాటిల్స్ పెట్టాడు. వాటి ద్వార కూడా మరికొన్ని ఇంజక్షన్‌లు ఇచ్చాడు.
ఇలా గంట వ్యవధిలోనే సుమారు 7 సూదిమందులు నవీన్‌కు శ్రీనివాస్ ఇచ్చాడు. అప్పటి వరకు నీరసంగానే ఉన్న నవీన్ మరింత అనారోగ్యం పాలయ్యాడు. అప్పటి వరకు ఏం తినకుండా ఉన్న రోగికి ఒకేసారి బిగ్ డోస్ మందులు పడేసరికి బాడిలోని అన్ని వ్యవస్థలు గతి తప్పడం మొదలయ్యాయి.
నవీన్ మెలికలు తిరగడంతో కంగారుపడ్డ ఆర్‌ఎంపీ శ్రీనివాస్ వెంటనే ప్రైవేటు ఆసుపత్రికి తరలించాలని తొందరపెట్టాడు. హైదరాబాద్ తీసుకెళ్లేందుకు భార్య మేఘన ఏర్పాట్లు చేస్తున్న టైంలోనే నవీన్ తుది శ్వాస విడిచాడు. జ్వరమే అనుకొని ఆర్‌ఎంపీ వద్దకు చికిత్స కోసం తీసుకొస్తే ప్రాణాలు తీశాడని బోరున విలపించింది మేఘనా.
చివరకు మేఘనా పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆర్‌ఎంపీ శ్రీనివాస్ కారణంగానే తన భర్త నవీన్ ప్రాణాలు కోల్పోయాడని పేర్కొంది. బాధితురాలి ఫిర్యాదు తీసుకున్న పోలీసులు కేసు దర్యాప్తులో భాగంగా శ్రీనివాస్ వాంగ్మూలం తీసుకునేందుకు వెళ్తే అతను పరార్ అయ్యాడు. ఫిరంగిగడ్డలో వైద్యం చేసే షరట్‌ను క్లోజ్ చేసి ఎటో వెళ్లిపోయాడు. అతని కోసం గాలిస్తున్నారు.
బాధితురాలిని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు పరామర్శించారు. ధైర్యంగా ఉండాలని కుటుంబాన్ని ఓదార్చారు. కచ్చితంగా ఆర్‌ఎంపీ శ్రీనివాస్‌ను పట్టుకొని బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామన్నారు ఎమ్మెల్యే నాగరాజు