తెలంగాణలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడానికి వచ్చిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలంగాణ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. హనమకొండ ఆర్ట్స్‌ కాలేజీలో ఏర్పాటు చేసిన బహబిరంగ సభలో మాట్లాడుతూ కేసీఆర్‌ ప్రభుత్వం పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిందన్నారు. అవినీతి ఆరోపణలు లేని ప్రాజెక్టు తెలంగాణలో లేదన్నారు. 


తెలంగాణ ప్రభుత్వం రోజూ నాలుగు పనులే చేస్తోందన్నారు మోదీ. ఉదయం నుంచి సాయంత్రం వరకు మోదీని తిట్టడం మొదటి పని అయితే... కుటుంబ పార్టీని పెంచి పోషించడం రెండో పనిగా చెప్పారు మోదీ. తెలంగాణ ఆర్థిక వ్యవస్థను నాశనం చేయడం మూడో పనిగా పెట్టుకున్నారని ఆరోపించారు. నాల్గో పనిగా  తెలంగాణను అవినీతిలో కూరుకుపోయేలా చేస్తున్నారని ధ్వజమెత్తారు. 


గతంలో రెండు రాష్ట్రాల మధ్య అభివృద్ధి కోసం ఒప్పందాలు జరిగేవి అన్నారు. ఇప్పుడు రెండు రాష్ట్రాల మధ్య అవినీతి ఒప్పందాలు జరుగుతున్నాయని ఢిల్లీ, తెలంగాణ ప్రభుత్వాలపై విమర్శలు చేశారు. ఇక్కడ అధికారంలో ఉన్న ప్రభుత్వం కోట్ల రూపాయల అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటోందన్నారు మోదీ. అవన్నీ ఇప్పుడు బహిర్గతమయ్యాయని గుర్తు చేశారు. ఇప్పుడు వాటి నుంచి మైండ్ డైవర్ట్ చేయడానికి కొత్త వ్యూహాలు పన్నుతోందన్నారు అన్నారు. ఆ వ్యూహాల నుంచి ఆలోచనల నుంచి ప్రజలకు అప్రమత్తంగా ఉండాలని సూచించారు మోదీ. 


కుటుంబ పార్టీల పాలనలో తెలంగాణ కూరుకుపోతుందని ఏనాడు అనుకోలేదన్నారు మోదీ. కుటుంబ పార్టీల డీఎన్‌ఏ మొత్తం అవినీతి మయమే అన్నారు. జనాల నమ్మకాన్ని బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వమ్ముచేసిందన్నారు. 9 ఏళ్లుగా బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని ఆరోపించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో చాలా పెద్ద పెద్ద మాటలు చెప్పారని ఎన్నో ఉద్యోగాలు ఇస్తామని చెప్పారని అవన్నీ అబద్దాలని ఇప్పుడు నిరూపిస్తున్నారని అన్నారు. టీఎస్‌పీఎస్‌సీ స్కామ్ గురించి అందరికీ తెలుసన్నారు. 


తెలంగాణలో 12 వర్సిటీల్లో ఉన్నత విద్యను తొక్కిపెట్టారన్నారు మోదీ. లక్షల మంది విద్యార్థుల భవిష్యత్‌ను అణిచివేస్తున్నారని ఆరోపించారు. వర్శిటీల్లో 3 వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. నిరుద్యోగులకు 3వేల భృతి ఇస్తామని హామీ ఇచ్చారని అది ఇవ్వకుండా మోసం చేస్తున్నారని ఆరోపించారు. పేదలకు డబుల్ డెబ్‌రూమ్ ఇళ్లు ఇస్తామని చెప్పి మోసం చేశారని విమర్శించారు. రైతులకు లక్ష రూపాయలకు రుణమాఫీ చేస్తామని చెప్పి అది కూడా చేయలేదన్నారు.  


తెలంగాణ గ్రామపంచాయతీలకు కేంద్రం నేరుగా నిధులు ఇస్తోందని తెలిపారు మోదీ. గ్రామీణాభివృద్ధి కోసం ఎన్నో పనులు కేంద్రం చేస్తోందన్నారు. గ్రామీణుల ఆదాయం పెంచేందుకు ఎన్నో చర్యలు చేపట్టామన్నారు. పప్పు ధాన్యాల ఎంఎస్‌పీ పెంచామన్నారు. దేశవ్యాప్తంగా 7 మెగా టెక్స్‌టైల్ పార్కులు ఏర్పాటు చేశాని వివరించారు. అందులో ఒకటి తెలంగాణకు కేటాయించామన్నారు. దళితులు, బలహీన వర్గాలను తెలంగాణ ప్రభుత్వం మోసం చేస్తోందన్నారు. 


గత ప్రభుత్వాలు గిరిజనులపై సవతి తల్లి ప్రేమను చూపేవని...గిరిజన ప్రాంతాల అభివృద్ధి విషయంలో బీజేపీ సర్కారు ఆలోచనలు మార్చిందన్నారు మోదీ. అనేక ఏకలవ్య స్కూల్స్ ఏర్పాటు చేశామని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ పార్టీల పత్తా లేకుండా చేస్తామన్నారు మోదీ. కచ్చితంగా వచ్చే ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందని చెబుతూ సభకు వచ్చిన వారితో నినాదాలు చేయించారు.