ప్రధానమంత్రి నరేంద్రమోదీ వరంగల్‌లో పర్యటిస్తున్నారు. ఈ ఉదయం వారణాసి నుంచి హైదరాబాద్‌లోని హకీంపేట చేరుకున్న నరేంద్రమోదీని మంత్రులు, బీజేపీ అధికారులు స్వాగతం పలికారు. అక్కడి నుంచి ఆయన నేరుగా ప్రత్యేక హెలికాప్టర్‌లో మమూనూరు చేరుకున్నారు. అక్కడి నుంచి మళ్లీ రోడ్డు మార్గంలో భద్రకాళి అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు. ఆలయంలో పండితులు పూర్ణకుంభంతో మోదీకి ఘనస్వాగతం పలికారు. 


భద్రకాళి అమ్మవారిని దర్శనం చేసుకున్న మోదీ ప్రత్యేక పూజలు చేశారు. అక్కడే సుమారు 20 నిమిషాలు గడిపారు. వేదపండితులతో మాట్లాడారు. అక్కడి నుంచి బయల్దేరి హన్మకొండలో ఏర్పాటు చేసిన సభ వద్దకు చేరుకుంటారు. అక్కడ రెండు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు. 






మోదీ తెలంగాణ టూర్‌కు బయల్దేరి ముందు ఓ ట్వీట్ చేశారు. తాను తెలంగాణలో పర్యటిస్తున్నానని... ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయబోతున్నట్టు ట్వీట్‌లో పేర్కొన్నారు. వాటి విలువ 6100 కోట్లు అని తెలిపారు. ఈ అభివృద్ధి పనులు హైవే నుంచి రైల్వేస్ వరకు ఉన్నాయని వివరించారు. ఇవి తెలంగాణ ప్రజలకు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు.