ప్రధాని నరేంద్రమోదీ శనివారం వరంగల్‌లో పర్యటించనున్నారు. దీని కోసం బీజేపీ భారీ ఏర్పాట్లు చేసింది. ఉదయం దాదాపు 8 గంటల ప్రాంతంలో వారణాసి నుంచి మోదీ బయల్దేరి తొమ్మిదిన్నరకు హకీంపేట ఎయిర్‌పోర్టుకు రానున్నారు. అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో పది గంటలకు మామునూరు చేరుకుంటారు. తర్వాత రోడ్డు మార్గంలోభద్రకాళి టెంపుల్‌కు చేరుకుంటారు. అక్కడ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు. అక్కడే 15 నుంచి 20 నిమిషాలు గడపనున్నారు మోదీ. 


భద్రకాళి టెంపుల్‌లో పూజలు చేసిన అనంతరం 11 గంటలకు బహిరంగ సభ జరిగే హన్మకొండలోని ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కాలేజీ గ్రౌండ్‌కు వస్తారు. ఆదే వేదికపై నుంచి వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం అక్కడ ప్రజలను ఉద్దేశించి ప్రసగించారు. మొత్తానికి 12.30కి సభను ముగించుకొని తిరిగి పయనమవుతారు. హైదరాబాద్‌ నుంచి రాజస్థాని టూర్‌కు వెళ్తారు. 


ఈ వరంగల్‌ రెండున్నర గంటల టూర్‌లో ప్రధాని మోదీ దాదాపు 6,100 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. ఇందులో రైల్వే వ్యాగన్‌ మ్యానుఫాక్చరింగ్‌ యూనిట్‌, 176కిలోమీటర్ల జాతీయ రహదారులకు శంకుస్థాపన చేస్తారు. హన్మకొండలో రెండు సభలను ఏర్పాటు చేశారు. ఒకటి అభివృద్ధి పనుల శంకుస్థాపనకు ఉపయోగిస్తారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి ప్రసంగించేందుకు మరో సభను ఏర్పాటు చేశారు. ఈ సభకు విజయసంకల్ప సభగా బీజేపీ నాయకులు పిలుస్తున్నారు. 






సీఎం ప్రసంగానికి ఐదు నిమిషాలు కేటాయిస్తూ షెడ్యూల్ విడుదల 
ప్రధాని పాల్గొనే సభలో తెలంగాణ సీఎం ప్రసంగం ఉంటుందని షెడ్యూల్‌లో పెట్టారు. ముందు కిషన్ రెడ్డి తర్వాత నితిన్ గడ్కరీ మాట్లాడిన అనంతరం సీఎంకు ఛాన్స్ ఇచ్చినట్టు అందులో ఉంది. వీళ్ల ప్రసంగాలకు 15 నిమిషాలు కేటాయించారు. ప్రధాని 15 నిమిషాలు మాట్లాడనున్నారు. ఈ సభలో 8 మందే కూర్చుంటారని అందులో వివరించారు. ప్రధానితోపాటు ఇద్దరు కేంద్ర మంత్రులు, గవర్నర్‌ తమిళిసై, సీఎం కేసీఆర్‌, కరీంనగర్‌, వరంగల్‌ ఎంపీలు బండి సంజయ్‌, దయాకర్‌, రాష్ట్ర మంత్రి ప్రశాంత్‌రెడ్డికి మాత్రమే వేదికపై కూర్చునే ఛాన్స్ ఇచ్చారు. 
కిషన్‌రెడ్డి అధ్యక్షుడిగా ఎంపికైన తర్వాత జరుగుతున్న తొలి సభ కావడంతో తెలంగాణ బీజేపీ దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. రాష్ట్రం నలుమూలల నుంచి జనసమీకరణ చేపట్టారు. ఓవైపు కిషన్ రెడ్డి, మరోవైపు ఎంపీ బండి సంజయ్ ఇద్దరూ వరంగల్‌లో మకాం వేసి మరీ ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా బండి సంజయ్‌ థార్‌ వాహనాన్ని నడిపి కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు. 
వరంగల్‌కు చేరుకున్న నేతలు, కార్యకర్తలతో వరంగల్ రోడ్లు కిక్కిరిసిపోయాయి. ప్రజలకు, కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా బీజేపీ స్టేట్‌ పార్టీ ఏర్పాట్లు చేసింది. ప్రత్యేక పార్కింగ్ స్థలాలను కేటాయించింది. ట్రాఫిక్ జామ్‌ లేకుండా ప్రత్యామ్నాయ రూట్లను కూడా సూచించింది. 


రెండు రోజుల క్రితమే హన్మకొండ ఆర్ట్ కాలేజీ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకుంది ప్రధాని సెక్యురిటీ సిబ్బంది. సుమారు పాతిక కిలోమీటర్ల వరకు నో ఫ్లైజోన్‌గా ప్రకటించింది. ఎస్‍పీజీ సెక్యురిటీకి తోడు గ్రేహౌండ్స్, ఆక్టోపస్‍ టీమ్స్‌ కూడా భద్రతను చూస్తున్నాయి. రోడ్డు మార్గంలో మోదీ వెళ్లే ప్రాంతాల్లో జామర్లు ఏర్పాటు చేశారు. యాంటీ డ్రోన్ టీమ్‌ కూడా రంగంలోకి దిగింది. 






వరంగల్ పర్యటనకు వస్తున్న ప్రధాని మోదని మర్యాదపూర్వకంగా హైదరాబాద్‌లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ స్వాగతం పలకనున్నారు. ఇప్పటికే మోదీ టూర్‌ను బహిష్కరిస్తున్నట్టు బీఆర్‌ఎస్‌ ప్రకటించింది. 9 ఏళ్లుగా తెలంగాణ పట్ల మోదీ, కేంద్ర ప్రభుత్వం చూపిస్తున్న వివక్షకు నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేటీఆర్‌ శుక్రవారం ప్రకటించారు.