సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేడ్కర్ చౌరస్తాలో రాష్ట్రంలో నేడు ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనను నిరసిస్తూ అధికార టీఆర్ఎస్, సీపీఐ పార్టీ శ్రేణులు ధర్నా నిర్వహించాయి. ప్రధాని మోదీ తెలంగాణలో కాలు పెడుతున్న సందర్భంగా.. 'మోడీ గో బ్యాక్' అంటూ నినాదాలు చేశారు. ధర్నా చేస్తుండగా సీపీఐ నాయకుడు గడిపే మల్లేష్ ను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్న క్రమంలో పోలీసులకు, సీపీఐ శ్రేణులకు మధ్య స్వల్ప తోపులాట, ఘర్షణ చోటు చేసుకుంది. పోలీసులు సీపీఐ నాయకుడు గడిపే మల్లేష్ ను అక్రమంగా అరెస్టు చేయడాన్ని టీఆర్ఎస్, సీసీఐ పార్టీ నేతలు తీవ్రంగా ఖండించారు. 
టీఆర్ఎస్, సీపీఐ నేతలు మాట్లాడుతూ ప్రజా, రైతు, కార్మిక వ్యతిరేక విధానాలను అనుసరిస్తున్న ప్రధాని మోదీ పాలనకు చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర విభజన హామీలను విస్మరించిన ప్రధాని మోదీ తెలంగాణ ప్రజలకు చేసిందేమి లేదన్నారు. నిత్యవసర సరుకులు, వస్తువుల ధరలు పెంచి సామాన్య ప్రజల నడ్డి విరుస్తున్న మోదీ, దేశంలో ప్రజాస్వామ్య బద్దంగా ఏర్పడ్డ ప్రభుత్వాలను కూల్చే కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. ప్రజాస్వామ్య వ్యతిరేక పాలనను కొనసాగిస్తున్న ప్రధాని మోదీ రాష్ట్రంలో పర్యటించకుండా వెనుదిరగాలని డిమాండ్ చేశారు.


హైదరాబాద్‌లో తెలంగాణ చేనేత యూత్ ఫోర్స్ నిరసన
హైదరాబాద్: ప్రధాని మోదీ తెలంగాణకు రాకను వ్యతిరేకిస్తూ తెలంగాణ చేనేత యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో కేబీఆర్ పార్క్ దగ్గర నల్ల బెలూన్లను ఎగరవేసి నిరసన తెలిపారు. గో బ్యాక్ మోదీ.. నో ఎంట్రీ టూ తెలంగాణ ప్లకార్డులు ప్రదర్శిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ప్రధాని మోదీ తెలంగాణ వ్యతిరేకి అని, తెలంగాణకు వచ్చే ప్రాజెక్టులు, పరిశ్రమలను ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారని ఆరోపించారు.


ప్రధాని మోదీ మన ప్రాజెక్టులను జాతికి అంకితం ఇవ్వడం.. ఆ తర్వాత వాటిని కుబేరులు ఆదాని, అంబానీలకు కట్టబెట్టడం పరిపాటిగా మారిందంటూ మండిపడ్డారు. చేనేత పై విధించిన 5 శాతం జీఎస్టీని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. నరేంద్ర మోదీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్లకు కొమ్ముకాసే ప్రభుత్వంగా మారిందని, సామాన్యుల సంక్షేమాన్ని గాలికొదిలేసిందని తెలంగాణ చేనేత యూత్ ఫోర్స్ రాష్ట్ర అధ్యక్షుడు అలిశెట్టి అరవింద్ విమర్శించారు.


ఆ ఘనత బీజేపీ ప్రభుత్వానిదే.. 
వేల కోట్ల రూపాయలతో రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని పునరుద్ధరించిన ఘనత కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికే దక్కుతుందనే అక్కసుతో కాంగ్రెస్, టీఆర్ఎస్, సీపీఐ పార్టీలు 'మోదీ గో బ్యాక్' అంటూ విమర్శలు చేస్తున్నాయని హుస్నాబాద్ నియోజకవర్గ బీజేపీ నేత బొమ్మ శ్రీరామ్ ఆరోపించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బొమ్మ శ్రీరామ్ మాట్లాడుతూ.. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ ఉత్పత్తిలో 50% ఎరువుల ఉత్పత్తి తెలంగాణ రాష్ట్రానికే చెందుతుందని, దీనికి టిఆర్ఎస్, కాంగ్రెస్, సీపీఐ పార్టీ నాయకులకు ముందు సంతోషంగా ఉందో లేదో చెప్పాలన్నారు. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ ద్వారా రైతులకు కలిగే నష్టమేంటో ముందు తెలియజేసిన తర్వాతే టిఆర్ఎస్, కాంగ్రెస్, సిపిఐ పార్టీ నాయకులు ప్రధాని మోడీ పై విమర్శలు చేయాలని హితవు పలికారు.


విమర్శలు చేస్తున్న అఖిలపక్ష పార్టీల నాయకులు నిజంగా రైతు బిడ్డలయితే ముందు ఈ విమర్శలను మానుకొని క్షమాపణ చెప్పాలన్నారు. మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ పై పెళ్లయ్యక వాయిద్యాలు వాయిస్తున్నట్లు ఉందని విమర్శించడాన్ని మానుకొని, తాను ఎంపీగా ఉన్నప్పుడు ఇంత పెద్ద ఎత్తున కోట్ల రూపాయలతో ఈ ప్రాంతానికి ఏదైనా ప్రాజెక్టు తీసుకువచ్చారో ఆలోచించుకోవాలన్నారు. మెదక్, సిద్దిపేట, హుస్నాబాద్, ఎల్కతుర్తి వరకు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కృషి ఫలితంగా దాదాపు 650 కోట్ల రూపాయలతో చేపడుతున్న జాతీయ రహదారి పనులను రేపు ప్రధాని మోడీ శంకుస్థాపన చేస్తుండడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ, బిజెపి ఆధ్వర్యంలో నియోజకవర్గ కేంద్రంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ప్రధాని మోదీ చిత్రపటానికి పాలాభిషేకం కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. హుస్నాబాద్ ప్రాంతం నాలుగు లైన్ల జాతీయ రహదారితో మరింత అభివృద్ధి చెందుతుందని ఆకాంక్షించారు.