ములుగు జిల్లా వీరభద్రవరం అడవుల్లో 84 మంది పర్యాటకులు చిక్కుకున్నారు. ముత్యంధార జలపాతం సందర్శనకు వెళ్లిన వీళ్లంతా దారి తప్పి అడవిలో ఉండిపోవాల్సి వచ్చింది. ఓవైపు కుండపోత వాన మరోవైపు చిమ్మ చీకటి దీంతో ఏం చేయాలో తెలియక అధికారులకు సమాచారం ఇచ్చారు. 


ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రానికి 9కిలోమీటర్ల దూరంలో ఉందీ ముత్యంధార జలపాతం. సెలవులు కావడంతో సందర్శకులు ఈ జలపాతం చూసేందుకు వెళ్లారు. తిరిగి వస్తుండగా వాగు పొంగి అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. 


సమాచారం అందుకున్న అధికారులు అప్రమత్తమయ్యారు. మంత్రి సత్యవతి రాథోడ్‌ కూడా స్పందించారు. జిల్లా కలెక్టర్,ఎస్పీలకు ఫోన్ చేసి పరిస్థితులపై ఆరా తీశారు. వరద ధాటికి అడవిలో చిక్కుకున్న  పర్యటకులను గ్రామానికి చేర్చేందుకు తక్షణమే చర్యలు చేపట్టమని మంత్రికి అధికారులు వివరించారు. పోలీసులు, రెస్క్యూ టీమ్‌లు సంఘటన స్థలానికి చేరుకుని పర్యటకులను రక్షించేందుకు చర్యలు చేపట్టారు.


మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు కూడా ఈ ఘటనపై స్పందించారు. పర్యాటకుల పరిస్థితిపై జిల్లా కలెక్టర్, ఎస్పీ తో ఫోన్‌లో మాట్లాడారు. తక్షణ సహాయచర్యలు చేపట్టి, పర్యాటకులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని ఆదేశించారు మంత్రి.  


ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పర్యాటకులంతా క్షేమంగానే ఉన్నారని బాధిత కుటుంబసభ్యులు ధైర్యంగా ఉండాలని మంత్రి ఎర్రబెల్లి సూచించారు. 


రాత్రంతా కురుస్తున్న వర్షంతో ఈ సహాయక చర్యల్లో తీవ్ర జాప్యం జరిగింది. ఎనిమిది గంటల పాటు శ్రమించి వారిని సురక్షితంగా అక్కడి నుంచి తరలించారు.