వరంగల్ : ములుగు జిల్లాలోని మద్యం వ్యాపారుల బెల్ట్ దందాకు అడ్డు అదుపు లేకుండా పోయింది. ప్రభుత్వ లైసెన్స్ షాపులలో దొరకని మద్యం, బెల్టుషాపులలో లభిస్తుందంటే బెల్టు దందా ఏ స్థాయిలో కొనసాగుతుందో అర్థం చేసుకోవచ్చు. లైసెన్స్ ఉన్న దుకాణాలలో మందుబాబులకు మద్యం దొరకదు.. కానీ అధికంగా మద్యం విక్రయిస్తున్న బెల్టు షాపులకు వాహనాల ద్వారా స్టాకును పంపిస్తున్నారని ఆరోపణలున్నాయి. అధిక లాభాల కోసమే ఈ ప్రయాస అని, తాము ఎంతో నష్టపోతున్నామని మందుబాబులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విక్రయాలు జరిగాల్సిన షాపులో అమ్మకం కంటే బెల్టు షాపులకు విక్రయించడం ద్వారా అధిక ధరలకు విక్రయిస్తూ లాభాలు గడిస్తున్నారు. 
మందు బాబుల జేబులకు చిల్లు
ఎటొచ్చి మద్యం ప్రియుల జేబుకి చిల్లు పడుతుంది. ఈ ప్రాంతాల్లో అత్యధికంగా కూలీ పని, ఇతరత్రా శారీరక శ్రమ చేసే వారు కొనుగోలు చేసే మద్యం లైసెన్స్ షాపులలో దొరకకపోవడంతో వారు బెల్టుషాపులను ఆశ్రయిస్తున్నారు. ఇలా బెల్టు షాపులలో కొనుగోలు చేయడం ద్వారా వారి జేబులకు చిల్లు పడుతుంది. ఎందుకంటే ఎమ్మార్పీ ల కంటే అధిక ధరలకు మద్యం విక్రయాలు జరుగుతున్నాయని ఆరోపణలున్నాయి. జిల్లా వ్యాప్తంగా వందల సంఖ్యలో బెల్టుషాపులు నడుస్తున్నాయి. వీటిపై ఎక్సైజ్ శాఖ, అధికారులు చర్యలు తీసుకుంటే తమకు ప్రయోజనం ఉంటుందని మందుబాబులు అంటున్నారు. ఎవరైనా బెల్టుషాపుల విషయాన్ని ప్రస్తావిస్తే మీరు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తే మేము స్పందిస్తామని అధికారులు సూచినట్లు సమాచారం. దాంతో వివరాలు అందరికి తెలియడం ఇష్టం లేక, రాత పూర్వక ఫిర్యాదు చేయడంపై అవగాహన లేక వెనుదిరుగుతున్నారు. అయితే గుడుంబా స్థావరాలపై దాడులు నిర్వహించినట్లు బెల్టు షాపులపై ఎందుకు దాడులు నిర్వహించడం లేదని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. బెల్టు షాపుల విషయంలో ఆబ్కారీ అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని, దాంతో లైసెన్స్ షాపుల కంటే బెల్టు షాపుల్లో ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు విక్రయాలు జరుగుతున్నాయని ఆరోపించారు.


పేరుకే పర్మిట్ - అంతా అవుట్ సైడ్
మద్యం షాపులు పేరుకే పర్మిట్ రూమ్ ల పేరుతో సెట్టింగ్ నిర్వహిస్తున్నారు. కానీ మద్యం ప్రియులు 80 శాతం మంది బహిరంగ ప్రదేశాల్లోనే మద్యం సేవిస్తున్నారు. దీనిపై టాక్స్ ఫేర్ లను వివరణ అడిగితే పర్మిట్ రూములు పరిశుభ్రంగా ఉండటం లేదని.. అందువల్లే బయట సేవించాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని వారంటున్నారు. పర్మిట్ రూమ్ తీసుకుని మద్యం సేవించే వారికి కావలసిన మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయకపోవడం వల్లే బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తున్నట్లు వారు తెలుపుతున్నారు. అధికారులు ఇకనైనా చర్యలు తీసుకుంటే ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే లైసెన్స్ షాపులలో మద్యం దొరుకుతుందని మందుబాబులు భావిస్తున్నారు.


తినుబండారాలతో అదనపు ఆదాయం
మద్యంతో అమ్మిన వ్యాపారం లాభాలు సరిపోవు అన్నట్టుగా మద్యం వ్యాపారులు వారి మద్యం షాపుల వద్ద ప్రతి నెల 30 నుండి 50 వేల లీజు కిరాయిల పేరుతో అదనంగా వసూలు చేస్తున్నారు. ఎక్సైజ్ శాఖ నిబంధనల ప్రకారం మద్యం షాపుల వద్ద ఎలాంటి తినుబండారాలను విక్రయించవద్దని అధికారులు చెబుతున్న వాటిని పాటించడం లేదు. మటన్, చికెన్, కోడిగుడ్లు రకరకాల ఫ్రైలు చేసి అధిక ధరలకు విక్రయిస్తున్నారు. ధర ఎంత విక్రయిస్తున్న సరుకు ఎలాంటిది నాణ్యమైన కాదా అనే క్వాలిటీని కూడా పరిశీలించడం లేదని, మందుబాబులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
నాణ్యతపై మద్యం ప్రియుల భిన్నాభిప్రాయాలు..
లైసెన్స్ మద్యం షాపులలో కొన్నిసార్లు క్వాలిటీగా ఉండటం లేదని, బెల్టు షాపులలో విక్రయిస్తున్న మద్యం షాపులు మద్యం సైతం క్వాలిటీ లేదన్న భిన్నాభిప్రాయాలను వ్యక్తమవుతున్నాయి. కొందరు మద్యం బాగుందని చెబుతుంటే.. మరికొందరు మద్యం తాగితే దగ్గు వస్తుందని కళ్ళవెంట ఊసులు తోడు తున్నాయని చెబుతున్నారు. క్వాలిటీ లేని మద్యం కాకపోవడంతో అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని వాదనలు ఉన్నాయి. గతంలో లైసెన్స్ మద్యం షాపులోనే కొందరు వ్యక్తులు నైపుణ్యంతో మూతలు తీసివేసి కొంత మద్యాన్ని తొలగించి నకిలీ మద్యాన్ని నింపుతూ పట్టుబడిన సందర్భాలు ఉండడంతో ఈ అనుమానాలు తలెత్తుతున్నాయి. వారు చేస్తున్న పనికి అప్పటి పోలీసులే ఆశ్చర్యపోతున్నారు. పెళ్లిళ్లు, లక్నవరం, మేడారం, బోగత వాటర్ ఫాల్స్, కోంగల జలపాతం, ముత్యాలధార లాంటి పర్యాటక కేంద్రాలకు పర్యాటకుల తాకిడి ఎక్కువ ఉంటుందని,  వీటిని ఆసరాగా చేసుకుని బెల్ట్ షాపు వారు కూడా అక్రమ పద్ధతులకు పాల్పడుతున్నారని ఆరోపణలున్నాయి.