Warangal News: వరంగల్‌ పోలీసు కమిషనరేట్‌ పరిధిలో మిల్స్‌కాలనీ, రాయపర్తి ప్రాంతాల్లో ఉంటున్న నిరుద్యోగులకు.. ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి వారి వద్ద నుంచి లక్షలు దోచేశారు. డబ్బులు ఇస్తే ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించి నిలువునా ముంచేశారు. మోసపోయామని గ్రహించిన యువకులు పోలీసులను ఆశ్రయించగా... కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితులను పట్టుకున్నారు. అయితే ఇందులో నలుగురిని అరెస్ట్ చేయగా, మరో ముగ్గురు తప్పించుకొని పారిపోయారని వరంగల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు తెలిపారు. నిందితుల నుంచి ఆరున్నర లక్షల డబ్బులతో పాటు కంప్యూటర్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను టాస్క్‌ఫోర్స్‌ కార్యాలయంలో అదనపు డీసీపీ వైభవ్‌ గైక్వాడ్‌ వెల్లడించారు. నిందితులను కూడా మీడియా ముందు హాజరుపరిచారు. 


అసలేం జరిగిందంటే..?


వరంగల్‌ డాక్టర్స్‌ కాలనీకి చెందిన డాకూరి భిక్షం, గోదావరిఖనికి చెందిన కన్నాల రవి, మహబూబాబాద్‌ మండలం గూడూరుకు చెందిన జలగం అశోక్‌, జలగం కవిత, భూపాలపల్లి మండలం మొగుళ్లపల్లి మండలం ఇప్పలపల్లికి చెందిన దూడపాక తిరుపతి, దూడపాక పోచయ్య, జమ్మికుంటకు చెందిన మాణిక్యం సదానందంలు ఈ ముఠాలో సభ్యులుగా ఉన్నారు. డబ్బులు ఇస్తే ప్రభుత్వ, ప్రభుత్వ ఆమోదిత సంస్థలలో ఉద్యోగాలు ఇప్పిస్తామని నిరుద్యోగులకు నమ్మబలుకుతారని పోలీసులు తెలిపారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాలతో పాటు మడికొండలోని కేంద్రీయ విద్యాలయం, ఎంజీఎం, కరీంనగర్‌లోని పలు కార్యాలయాల్లో ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించారు. ఒక్కొక్కరి నుంచి లక్ష రూపాయల నుంచి 5 లక్షల రూపాయల వరకు వసూలు చేశారని వెల్లడించారు.


రాష్ట్ర వ్యాప్తంగా 40 లక్షలు దోచేసిన ముఠా సభ్యులు 


ఉద్యోగాల పేరిట రాష్ట్ర వ్యాప్తంగా రూ. 40 లక్షలు దండుకున్నారు ఈ ముఠాకు చెందిన సభ్యులు. వీరి నుంచి మోసపోయిన కొందరు బాధితులు మిల్స్‌కాలనీ, రాయపర్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై దర్యాప్తు చేసిన పోలీసులు ముందుగా నలుగురిని అరెస్టు చేసి విచారించగా చేసిన తప్పులను ఒప్పుకున్నారు. మిగతా ముగ్గురు తిరుపతి, సదానందం, పోచయ్యలు పరారీలో ఉన్నట్టు వెల్లడించారు. పట్టుబడిన వారి నుంచి రూ. 6.50 లక్షల నగదుతో పాటు నకిలీ అపాయింట్‌మెంట్‌ లెటర్స్‌, కంప్యూటర్లు, స్కానర్లు, సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. ఈ కేసును చేధించిన టాస్క్‌ఫోర్స్‌ సిబ్బందిని సీపీ రంగనాథ్‌ అభినందించారు.


రెండు నెలల క్రితం కూడా ఇలాంటి ఘటనే..


వరంగల్ జిల్లాలో ఆయుష్మాన్ పథకం కింద స్టాఫ్ నర్స్, ఫార్మసిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి నిరుద్యోగుల వద్ద నుంచి లక్షల్లో వసూలు చేశారు కొందరు వ్యక్తులు. నెలలు గడుస్తున్నా ఉద్యోగాలు ఇప్పించకపోవడం, ఇచ్చిన డబ్బు తిరిగి ఇవ్వకపోడంతో మోసపోయామని గ్రహించిన పలువురు యువతీ యువకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో  అసలు విషయం వెలుగులోకి వచ్చింది.


శ్రీకాకుళం జిల్లాకు చెందిన సలాడి రాంగోపాల్, అంకాలు సుభాష్, ధర్మవరం ప్రసాద్, రజనీ ఒక ముఠాగా ఏర్పడి ఈ దందాకు తెరలేపారు. ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ అమాయకపు యువతను మోసం చేయడం ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం, వేలల్లో జీతాలు అంటూ కళ్లబొల్లి మాటలు చెప్పి లక్షల్లో దోచేశారు. ఇంటర్వ్యూలు, పరీక్షలు ఏం అవసరం లేకుండా నేరుగా ఉద్యోగం పొందవచ్చని కలరింగ్ ఇచ్చారు. ఇలా చెప్పేసరికి చాలా మంది వీరిని నమ్మి అడిగినంతా డబ్బులు చెల్లించారు. కానీ డబ్బులు తీసుకున్న నుంచి చడీ చప్పుడు లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు ముఠా గుట్టు తెలుసుకొని నిందుతులు రామ్ గోపాల్, ప్రసాద్, సుభాష్, రజనీని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి లక్షా పది వేల రూపాయల నగదుతో పాటు ఫేక్ కాల్ లెటర్స్, అపాయింట్ మెంట్ లెటర్లు, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అయితే వీరు దొచేసిన సొమ్మును జల్సాలకు ఖర్చు చేసినట్లు పోలీసులు గుర్తించారు.