Warangal Crime : గేటుకు తాళం వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ చేసుకుని చోరీలకు పాల్పడిన ఓ దొంగతో సహా ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టైన ఐదుగురు నిందితుల నుంచి సుమారు రూ.17 లక్షలకు పైగా విలువైన 330.7 గ్రాముల బంగారం, 115 తులాల వెండి నగలను స్వాధీనం చేసుకున్నారు.
జల్సాల కోసం దొంగతనాలు
వరంగల్ జిల్లా నర్సంపేటలో ఈస్ట్ జోన్ డీసీపీ వెంకటలక్ష్మి మీడియాతో మాట్లాడారు. పోలీసులు కథనం ప్రకారం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలంలోని సంకెపల్లి గ్రామానికి చెందిన జింక నాగరాజు చిన్నతనం నుంచే జల్సాలకు అలవాటు పడి దొంగతనాలు చేయడం మొదలుపెట్టాడు. సులువైన మార్గంలో డబ్బు సంపాదించడానికి దొంగతనాలకు ఎంచుకున్నాడు. ఈ క్రమంలో 2010 నుంచి నాగరాజు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో పలు దొంగతనాలు చేసి జైలుకు వెళ్లి వచ్చాడు. తర్వాత కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో తనను గుర్తుపడతారని చోరీల కోసం ఇతర ప్రాంతాలను సెలెక్ట్ చేసుకున్నాడు. ఈ క్రమంలో వరంగల్ జిల్లాలోని నర్సంపేట, గీసుకొండ ప్రాంతాల్లో గేటుకి తాళం వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకొని గత రెండు సంవత్సరాల నుంచి పలు దొంగతనాలు చేశాడు. చోరీల్లో దొంగిలించిన బంగారం, వెండి నగలు, ఇతర సొమ్మును వేములవాడ పరిసర ప్రాంతాలకు చెందిన తన మిత్రులైన నాగుల ప్రవీణ్, కట్ట రాజు, ఉల్లందుల ప్రశాంత్, వల్లంపట్ల పరమేష్ ద్వారా అమ్మాడు.
తాళం వేసిన ఇళ్లే టార్గెట్
చోరీల్లో భాగంగా బుధవారం రాత్రి కూడా నాగరాజు దొంగతనం కోసం నర్సంపేటకు స్కూటీపై బయల్దేరాడు. నర్సంపేట సమీపంలోని అయ్యప్ప గుడి వద్ద వాహనాల తనిఖీ నిర్వహిస్తున్న పోలీసులు అతన్ని పట్టుకున్నారు. పోలీసులు విచారించిగా నిందితుడు నాగరాజు అసలు విషయం చెప్పారు. నిందితుడితో పాటు అతనికి సహకరించిన నలుగురు స్నేహితుల నుంచి 330.7 గ్రాముల బంగారం, 115 తులాల వెండి, హోండా యాక్టివా స్కూటీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గేటుకు తాళం వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ గా చేసుకుని నిందితుడు నాగరాజు నర్సంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో 7, గీసుకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక దొంగతనం చేసినట్లు డీసీపీ వెంకటలక్ష్మి వెల్లడించారు. నిందితులను ఐదుగురిని అరెస్టు చేసి రిమాండ్ కు పంపినట్లు చెప్పారు. ఈ చోరీ కేసులను ఛేదించడంలో ప్రతిభ కనబరిచిన నర్సంపేట ఇన్స్పెక్టర్ రమేష్, ఎస్సైలు రవీందర్, సురేష్, హెడ్ కానిస్టేబుల్ సూర్యనారాయణ, కానిస్టేబుల్స్ సునీల్, రవి, ఐటి కోర్ టీం సల్మాన్ లను డీసీపీ వెంకటలక్ష్మి అభినందించారు.
చిత్తూరులో అంతర్రాష్ట్ర దొంగ అరెస్టు
మోస్ట్ వాంటెడ్ అంతర్రాష్ట్ర దొంగను చిత్తూరు పోలీసులు అరెస్టు చేశారు. ఒంటరి ప్రదేశాల్లో, పొలాల వద్ద ఇళ్లే టార్గెట్ గా చేసుకుని దొంగతనాలకు పాల్పడమే అతని హాబీ. దొంగతనాలకు పాల్పడి పోలీసుల నుంచి తప్పించుకునేందుకు ఎవరికి అనుమానం రాకుండా మారుమూల గ్రామాల్లో తలదాచుకుంటాడు. దోచుకున్న నగదు ఖాళీ కాగానే తిరిగి దొంగతనాలకు పాల్పడి మరో మారుమూల గ్రామానికి వెళ్లేవాడు. ఇలా ఏళ్ల తరబడి నాలుగు రాష్ట్రాల పోలీసుల కళ్లు కప్పి తప్పించుకుని తిరుగుతున్న అంతర్రాష్ట్ర దొంగను ఎట్టకేలకు చిత్తూరు పోలీసులు అరెస్టు చేశారు. అంతర్రాష్ట్ర దొంగను చిత్తూరు పోలీసులు చాకచక్యంగా పట్టుకోవడమే కాకుండా, భారీ మొత్తంలో సొత్తును స్వాధీనం చేసుకున్నారు. చిత్తూరు ఎస్పీ రిశాంత్ రెడ్డి వెల్లడించిన వివరాల మేరకు.. జిల్లాలో ఇటీవల పంజాణి పోలీసు స్టేషన్ పరిధిలో పొలాల దగ్గర ఉన్న ఇంట్లో జరిగిన భారీ దొంగతనం కేసును ప్రతిష్టత్మకంగా తీసుకొన్న పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా రెండు నెలల నుంచి ఈ కేసును దక్షిణ భారతదేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాలలో తిరిగి నేరస్తులకు సంబంధించి ఆధారాలు సేకరించారు. వీటి ఆధారంగా పలమనేరు పోలీసులకు వచ్చిన కచ్చితమైన సమాచారంతో పంజాణి మండలం పలమనేరు– మదనపల్లి రోడ్డులోని కళ్లుపల్లి క్రాస్ వద్ద నిందితుడుని అరెస్టు చేశారు.