Warangal News: వరంగల్ జిల్లా పరకాల నియోజకవర్గంలోని గీసుకొండలో ఉద్రిక్తత చోట చేసుకుంది. సీఐ కుర్చీలో మంత్రి కొండా సురేఖ కూర్చోవడంతో ఆమె వర్గీయులు భారీగా పోలీస్ స్టేషన్‌కు రావడంతో అర్థరాత్రి ఉద్రిక్త నెలకొంది. ఇరు వర్గాల నుంచి పది నెలలుగా తీవ్రమైన వర్గ విభేదాలు తలెత్తాయి. పలు మార్లు అధినాయకత్వం జోక్యం చేసుకున్నప్పటికీ ఈ వివాదాలు మాత్రం కొలిక్కి రావడం లేదు.  


గీసుకొండ పీఎస్‌లో హడావుడి


గీసుకొండలో ఏర్పాటు చేసిన ఓ ఫ్లెక్సీ మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి మధ్య వర్గ విభేదాలు మరోసారి బయటపెట్టాయి. తన అనుచరులను అరెస్టు చేశారని పోలీస్ స్టేషన్‌కు వచ్చిన కొండా సురేఖ్ వ్యవహరించి తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆమె ఏకంగా సీఐ కుర్చీలో కూర్చొని మరో వివాదంలో చిక్కుకున్నారు. ఈ మధ్యకాలంలోనే కేటీఆర్, సినిమా ఇండస్ట్రీపై తీవ్రమైన కామెంట్స్ చేసి సర్వత్రా విమర్శలు పాలయ్యారు. ఇప్పుడు పోలీస్ స్టేషన్‌లో ఇలా చేసి ప్రత్యర్థులకు అవకాశం ఇచ్చారు. 


ఏం జరిగిందంటే?


గ్రేటర్‌ వరంగల్‌ పరిధిలోని పరకాల నియోజకవర్గం గీసుగొండ మండలం ధర్మారంలో స్థానిక ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి ఫొటో లేకుండానే మంత్రి కొండా సురేఖ వర్గీయులు ఫ్లెక్సీ కట్టారు. ఫ్లెక్సీలో ఎమ్మెల్యే ఫొటో ఎందుకు పెట్టలేదని రేవూరి అనుచరులు ప్రశ్నించారు. ఇది గొడవకు కారణమైంది. ఫ్లెక్సీల ఎమ్మెల్యే వర్గీయులు చించేశారు. ఈ ఘర్షణలో ఇరు వర్గాలకు చెందిన వారు గాయపడ్డారు. ధర్మారంలో గొడవలు చెలరేగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. మంత్రి అనుచరులపై కేసులు పెట్టారు. వారిని స్టేషన్‌కు తీసుకొచ్చారు.


మంత్రి అనుచరులను పోలీసులు విడిచి పెట్టకపోవడంతో మంత్రి సురేఖకు సమాచారం అందిచండంతో ఆమె వచ్చారు. మంత్రి అనుచరుల ధర్నా కారణంగా రోడ్డులో ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో ఆమె తన కాన్వాయ్‌ను విడిచి పెట్టి ఆటోలో వచ్చార. ఈ వివాదంపై పోలీసులతో మాట్లాడుతూ సీఐ కుర్చీలో కూర్చుకున్నారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పడంతో ఆమె వెళ్లిపోయారు. కొండా కుటుంబం అంటే గిట్టని వాళ్లు బురదజల్లుతున్నారని తమ వారిని టచ్ చేస్తే సహించేది లేదని మంత్రి సురేఖ హెచ్చరించారు. తమ అనుచరులను పోలీస్‌స్టేషన్‌లో నిర్బంధించారని తెలిసి వచ్చామన్నారు. 


రేవూరితో విభేదాలు


వరంగల్‌ ఉమ్మడి జిల్లా కాంగ్రెస్‌లో ఆధిపత్య పోరు పది నెలలుగా తారా స్థాయికి చేరుకుంది. ముఖ్యంగా మంత్రి పోకడలతో కాంగ్రెస్ నాయకులు విభేదిస్తున్నారు. ముఖ్యమంగా మంత్రి కొండా సురేఖ, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి మధ్య పచ్చగడ్డి కూడా భగ్గుమనేలా పరిస్థితి ఉంది. అందుకే పది రోజుల క్రితమే ఇన్‌ఛార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉమ్మడి జిల్లాకు చెందిన కాంగ్రెస్ లీడర్లతో మాట్లాడు. అంతర్గత కలహాలకు స్వస్తి చెప్పి ప్రజాసమస్యలపై ఫోకస్ చేయాలని హితవు పలికారు. అయినా వారి తీరులో ఎలాంటి మార్పు కనిపించడం లేదు. 


మరోసారి ఫ్రెక్సీ చిచ్చు


అధినాయకత్వం ఎన్ని హెచ్చరికలు చేస్తున్నా పట్టించుకోని సురేఖ, రేవూరి వర్గీయులు గీసుకొండ మండలం ధర్మారం గ్రామంలో గొడవ పడ్డారు. ఫ్లెక్సీ కోసం రోడ్డు ఎక్కారు. నర్సంపేట-వరంగల్‌ ప్రధాన రహదారిపై బైఠాయించి ట్రాఫిక్‌కు అంతరాయం కల్పించారు. అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, స్థానిక ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి పరకాలపై పట్టు కోసం హోరాహోరీగా తలపడుతుండటంతో ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పాడుతున్నాయి. 


పరకాల నియోజకవర్గంలోని గీసుకొండ మండలంలో తనకు సంబంధం లేకుండానే నేతలను పార్టీలో మంత్రి సురేఖ చేరుస్తున్నారని ఎమ్మెల్యే రేవూరి గుర్రుగా ఉన్నారు. ఈ విషయంపైనే వాళ్లిద్దరి మధ్య జరిగిన ఫోన్ ఆడియో ఈ మధ్య వైరల్‌ అయింది. ఈ సంతృప్తి కేసుల వరకు వెళ్లింది. కొండా సురేఖ వర్గానికి చెందిన వారిపై కేసులు రిజిస్టర్ అయ్యాయి. 
అదే టైంలో కామారెడ్డిపల్లి శివారులో వరంగల్‌ పార్లమెంట్‌ విస్తృత స్థాయి సన్నాహక సమావేశం నిర్వహించడం వివాదాన్ని మరింతగా పెంచింది. మంత్రి రాకుండానే సమావేశం ఎలా నిర్వహిస్తారని కొండా వర్గీయులు నిలదీయడంతో ఘర్షణఏర్పడింది. దీంతో కొందరిపై వేటు వేస్తున్ట్టు డీసీసీ అధ్యక్షుడు ప్రకటించారు. 


ఆఖరి నిమిషంలో బీజేపీ నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చిన రేవూరి ప్రకాష్ రెడ్డి హస్తం గుర్తుపై పోటీ చేసి విజయం సాధించారు. అప్పటి వరకు కొండా సురేఖ, రేవూరి మధ్య మంచి సంబంధాలు ఉండేవి. రేవూరి గెలవడం, కొండా సురేఖ్ మంత్రి అవ్వడంతో పరిస్థితిలో మార్పు వచ్చింది. 


మంత్రి ప్రమేయం లేకుండా కార్యక్రమాలు చేపట్టడంపై సురేఖ వర్గీయులు గుర్రుగా ఉంటే... తమపై పెత్తనం ఏంటని రేవూరి అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీంతో కొండా సురేఖ వర్గీయులపై కేసులు నమోదు అవుతుండటంతో ఆమె రంగ ప్రవేశం చేశారు. ఎమ్మెల్యే రేవూరి కావాలనే ఇదంతా చేస్తున్నారని గతంలోనే ఆమె ఆరోపణలు చేశారు. ఇప్పుడు నేరుగా పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఖాకీలకే వార్నింగ్ ఇచ్చారు. ఇది వైరల్ అవుతోంది. 


Also Read: తెలంగాణ గ్రూప్‌ వన్‌ హాల్ టికెట్లు వచ్చేశాయ్‌- ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి!