Minister Harish Rao: రేపటి నుంచి రైతుల ఖాతాల్లో రైతుబంధు సాయాన్ని జమచేస్తామని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. సంగారెడ్డి జిల్లా కోహిర్ మండలం దిగ్వాల్ లో డబుల్ బెడ్రూం ఇండ్లను ప్రారంభించి, లబ్ధిదారులకు సర్టిఫికేట్లను అందజేశారు. మంత్రితో పాటు ఎంపీపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యే మాణిక్ రావు, చేనేత కార్పొరేషన్ ఛైర్మన్ చింత ప్రభాకర్ ఉన్నారు. గేటెడ్ కమ్యూనిటీలా డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మించినట్లు చెప్పారు. కాంగ్రెస్ హయాంలో ఇలాంటి ఇండ్లను ఎప్పుడైనా చూశారా అని ప్రశ్నించారు. గతంలో డబుల్ బెడ్రూం ఇళ్లు కావాలంటే లాంచాలు ఇవ్వాల్సి వచ్చేదని.. ఇప్పుడు రాష్ట్రంలో ఆ పరిస్థితి లేదని స్పష్టం చేశారు. త్వరలోనే స్థలాలు ఉన్న వారికి ఆర్థిక సాయం అందించనున్నట్లు తెలిపారు. రూ.5.60 కోట్ల వ్యయంతో కోహిర్ లో 88 డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మించినట్లు మంత్రి తెలిపారు. 150 కోట్ల రూపాయలతో జహీరాబాద్ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు వివరించారు. 



మాజీ మంత్రి గీతారెడ్డి హయాంలోనే తాగేందుకు నీళ్లు కూడా లేని పరిస్థితి ఉండేదని గుర్తు చేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసూతి ఆపరేషన్లలో సంగారెడ్డి జిల్లా టాప్ లో నిలిచిందన్నారు. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రజలకు నాణ్యమైన వైద్యం అందుతున్నట్లు వెల్లడించారు. దేశంలో కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా తెలంగాణలో ఉన్నన్ని సంక్షేమ పథకాలు లేవని పేర్కొన్నారు. కోహిర్ లో 50 కోట్ల రూపాయలతో ప్రభుత్వ ఆసుపత్రిని నిర్మిస్తున్నట్లు స్పష్టం చేశారు. త్వరలోనే డయాలసిస్ ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. త్వరలో సంగమేస్వర, బసవేశ్వర ప్రాజెక్టులను ప్రారంభించి గోదావరి జలాలను గోదావరికి తీసుకువస్తామని మంత్రి హామీ ఇచ్చారు. తెలంగాణ భూముల ధరలు పెరగడానికి కారణం ఇక్కడ జరుగుతున్న అభివృద్ధేనని మంత్రి హరీష్ రావు వవిరించారు. 


వచ్చే నెల నుంచే రుణమాఫీ


తెలంగాణ రాష్ట్ర రైతులకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు న్యూ ఇయర్ గిఫ్ట్ ఇవ్వబోతున్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు.. 2018 నుంచి పెండింగ్‌లో ఉన్న లక్ష రూపాయల వరకు రుణ మాఫీని వచ్చే నెలలో అమలు చేయబోతున్నారని తెలుస్తోంది. 2020లో మొదటి దశలో 25,000 రూపాయలు, 2021లో రెండోదశలో భాగంగా 50,000 రూపాయల వరకు రుణాలను ప్రభుత్వం మాఫీ చేయగా... జనవరి నుంచి రెండు దశల్లో రూ.75,000, లక్ష రూపాయల వరకు రుణాలను మాఫీ చేయాలని సీఎం నిర్ణయించారు. రైతులకు ఈసారి నేరుగా నగదు జమ కాకుండా ప్రభుత్వం నుంచి చెక్కులు అందుతాయి. 2021 ఆగస్టులో జరిగిన మంత్రివర్గంలో ఆగస్టు 15 నుంచి ఆగస్టు 31 మధ్య రైతుల ఖాతాల్లో జమ చేసిన రూ. 50,000 వరకు పంట రుణాలను మాఫీ చేయాలని నిర్ణయించింది. 2018 డిసెంబర్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా, రూ.1 వరకు పంట రుణాలను మాఫీ చేస్తామని సీఎం హామీ ఇచ్చారు. 36.8 లక్షల మంది రైతుల పంట రుణాలను మాఫీ చేసేందుకు రూ.25,000 కోట్లు అసరం అవుతాయని అప్పట్లో అధికారులు అంచనా వేశారు. ఒకేసారి మొత్తం మంజూరు చేయడం కష్టమని గుర్తించిన సీఎం కేసీఆర్.. నాలుగు దశల్లో పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించారు.