KCR New Year Gift: తెలంగాణ రాష్ట్ర రైతులకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు న్యూ ఇయర్ గిఫ్ట్ ఇవ్వబోతున్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు.. 2018 నుంచి పెండింగ్‌లో ఉన్న లక్ష రూపాయల వరకు రుణ మాఫీని వచ్చే నెలలో అమలు చేయబోతున్నారని తెలుస్తోంది. 2020లో మొదటి దశలో 25,000 రూపాయలు, 2021లో రెండోదశలో భాగంగా 50,000 రూపాయల వరకు రుణాలను ప్రభుత్వం మాఫీ చేయగా... జనవరి నుంచి రెండు దశల్లో రూ.75,000, లక్ష రూపాయల వరకు రుణాలను మాఫీ చేయాలని సీఎం నిర్ణయించారు. రైతులకు ఈసారి నేరుగా నగదు జమ కాకుండా ప్రభుత్వం నుంచి చెక్కులు అందుతాయి. 2021 ఆగస్టులో జరిగిన మంత్రివర్గంలో ఆగస్టు 15 నుంచి ఆగస్టు 31 మధ్య రైతుల ఖాతాల్లో జమ చేసిన రూ. 50,000 వరకు పంట రుణాలను మాఫీ చేయాలని నిర్ణయించింది. 2018 డిసెంబర్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా, రూ.1 వరకు పంట రుణాలను మాఫీ చేస్తామని సీఎం హామీ ఇచ్చారు. 


ఒకేసారి ఇవ్వడం కష్టమని దశల వారీగా రుణమాఫీలు..


36.8 లక్షల మంది రైతుల పంట రుణాలను మాఫీ చేసేందుకు రూ.25,000 కోట్లు అసరం అవుతాయని అప్పట్లో అధికారులు అంచనా వేశారు. ఒకేసారి మొత్తం మంజూరు చేయడం కష్టమని గుర్తించిన సీఎం కేసీఆర్.. నాలుగు దశల్లో పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించారు. 2.96 లక్షల మంది రైతులకు రూ.25 వేల వరకు పంట రుణాలను మాఫీ చేసేందుకు ప్రభుత్వం రూ.408 కోట్లు ఖర్చు చేసింది. రెండో దశలో రూ.50 వేల వరకు రుణం తీసుకున్న దాదాపు 6.06 లక్షల మంది రైతుల పంట రుణాలను మాఫీ చేసేందుకు ప్రభుత్వం రూ.4,900 కోట్లు చెల్లించింది. 


ఒక కుటుంబం - ఒక లబ్ధిదారుడుతో సర్కారుకు గణనీయంగా తగ్గిన భారం


ఆధార్ లింకు, పట్టాదార్ పాసు పుస్తకాలు, రేషన్ కార్డులతో క్రాస్ చెకింగ్‌ ద్వారా బోగస్ హక్కుదారులను తొలగించడం వల్ల వ్యవసాయ రుణమాఫీ పథకం ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వంపై ఆర్థిక భారం గణనీయంగా తగ్గింది. ప్రభుత్వం ఒక ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించి ఆధార్ అనుసంధానం కారణంగా ఒకే కుటుంబంలో ఎక్కువ రుణాలు తీసుకునే వారిని సులభంగా గుర్తించి, 'ఒక కుటుంబం - ఒక లబ్ధిదారుడు' అనే పంట రుణమాఫీ పథకం ప్రకారం లబ్ధిదారుల జాబితా నుంచి పలువురిని తొలగించారు. కొన్ని సందర్భాల్లో ఎక్కువ బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్న వారిని కూడా గుర్తించారు. వెంటనే వారని లబ్ధిదారుల జాబితాలోంచి తొలగించారు. 10 లక్షలకుపైగా బహుళ రుణ దరఖాస్తు దారులను లబ్ధిదారుల జాబితా నుంచి గుర్తించి తొలగించారు. దీని వల్ల మొదటి రెండు దశల్లో రాష్ట్ర ప్రభుత్వానికి దాదాపు రూ. 4,000 కోట్లు ఆదా అయ్యాయి. అయితే ఈ నూతన సంవత్సరం సందర్భంగా మూడు, నాలుగో దశ రైతు పంట రుణమాఫీలను ప్రభుత్వం మాఫీ చేయబోతోంది.