Gudi Mileage Panduga in Medaram Jatara: మేడారం జాతరలో తొలి ఘట్టం మొదలయింది. గుడి మెలిగే పండుగతో ఆదివాసీల్లో సంబరాలు మొదలవుతాయి. ములుగు జిల్లాలోని మేడారం మహా జాతరలో భాగంగా గుడి మెలిగే పండుగ ను ఆదివాసీ పూజారులు ఘనంగా నిర్వహించారు. మేడారంలోని సమ్మక్క, కన్నేపల్లిలోని సారలమ్మ ఆలయాలను, పూజా సామాగ్రిని శుద్ధి చేసి అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంతో మేడారం మహాజాతర తొలి ఘట్టం ప్రారంభమైంది.
మేడారంలోని పూజారులు, వడ్డెలు ఉదయాన్నే స్నానమాచరించి సమ్మక్క, సారలమ్మల ఆలయాలకు చేరుకున్నారు. ముందుగా ఆలయంలో బూజు దులిపి, ఆలయం లోపల, బయట శుభ్రం చేశారు. ఆలయాల్లో గిరిజన మహిళలు అలుకేసి పసుపు, కుంకుమలతో ముగ్గులు వేశారు. ఆలయంలో భద్రపరిచిన అమ్మవారి పూజా సామాగ్రి వస్తువులు, వస్త్రాలను బయటకు తీసి నీటితో శుద్ధి చేసి ధూప దీపాలతో తల్లులకు పూజలు నిర్వహించారు. ఈనెల 21 నుంచి 24వ తేదీ వరకు నాలుగు రోజులపాటు జరిగే మహా జాతర ప్రారంభం అవుతుంది.