తెలంగాణలో సంచలనం సృష్టించిన మహబూబాబాద్‌ కౌన్సిలర్ హత్యలో ఏడుగుర్ని పోలీసులు అరెస్టు చేశారు. హత్యకు ఉపయోగించిన మారణాయుధాలు స్వాధీనం చేసుకున్నారు. పారిపోవడానికి యూజ్ చేసిన వెహికల్స్‌ని కూడా పోలీసులు గుర్తించారు. 


గురువారం ఉదయం నడిరోడ్డుపై మహబూబాబాద్‌ 8వ వార్డు కౌన్సిల్‌ బానోత్ రవినాయక్‌ను కొందరు దుండగులు హత్య చేశారు. దీనిపై విచారణ చేపట్టిన కొన్ని గంటల్లోనే ఏడుగురు నిందితులను అరెస్టు చేశారు. వారి నుంచి కత్తి, గొడ్డలితోపాటు ట్రాక్టర్, స్విఫ్ట్ డిజైర్‌ కారు, 7 సెల్‌ఫోన్స్‌ స్వాధీనం చేసుకున్నారు. 


రవి హత్య కేసు నిందితులను మహబూబాబాద్ టౌన్ పొలీస్ స్టేషన్‌లో మీడియా ముందు ప్రవేశపెట్టారు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్. బాబునాయక్ తండాకు చెందిన వార్డ్ కౌన్సిలర్ బానోత్ రవినాయక్ గతంలో నల్లబెల్లం వ్యాపారం చేసేవాడిని చెప్పారు. ఆనయతోపాటు భూక్య విజయ్, అరుణ్ కూడా వ్యాపారంలో భాగస్తులను తెలిపారు. తర్వాత విడిపోయి వ్యాపారం చేశారని వివరించారు. ఈ క్రమంలో తన వ్యాపారానికి అడ్డుపడుతూ అధికారులకు సమాచారం ఇస్తున్నాడని భావించిన రవి హత్యకు విజయ్ ప్లాన్ చేశాడు. ఇతనికి అరుణ్‌తోపాటు మరో ఐదురుగు సహకరించారు.


రవి హత్య కేసులో ఎమ్మెల్యే శంకర్‌ నాయక్‌ను మొదటి ముద్దాయిగా చేర్చాలన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు. 
రవి మృతదేహాన్ని ఆయన సందర్శించి నివాళి అర్పించారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో రోజురోజుకు హత్యల సంస్కృతి పెరుగుతోందన్నారాయన. అందుకు ఉదాహరణే బానోత్‌ రవి హత్య అన్నారు. మొన్న మంథనీలో లాయర్ దంపతులు, మానుకోటలో రవి ఇలా చాలా మందిని చంపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ ప్రాంతంలో స్థానిక ఎమ్మెల్యే శంకర్ నాయక్ భూకబ్జాలకు పాల్పడుతున్నారన్నారు. ఆయనపై కలెక్టర్‌, కేటీఆర్‌కు రవి ఫిర్యాదు చేశారని అందుకే ఆయన్ని చంపేశారని ఆరోపించారు. సీఎంకు చిత్తశుద్ది ఉంటే ఎమ్మెల్యేను వెంటనే భర్తరఫ్ చేయాలన్నారు. రవి హత్య కేసులో ఎమ్మెల్యే శంకర్ నాయక్‌ను తొలి ముద్దాయిగా పెట్టాలని డిమాండ్ చేశారు. రవి కుటుంబానికి 50 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియ ప్రభుత్వం ఇవ్వాలన్ననారు. 


మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో రవిని దారుణంగా హత్య చేశారు. ద్విచక్రవాహనంపై వెళ్తుండగా ట్రాక్టర్‌తో ఢీ కొట్టారు. తర్వాత మారణాయుధాలతో విచక్షణరహితంగా నరికి చంపారు. వెంటనే ఆసుపత్రికి తరలించినా ప్రయోజనం లేకపోయింది. అప్పటికే చనిపోయినట్టు వైద్యులు ప్రకటించారు. ఇది కచ్చితంగా రాజకీయా హత్యగా కుటుంబ సభ్యులు ఆరోపించారు. నేరుగా శంకర్ నాయక్‌పైనే విమర్శలు చేశారు. అలాంటిదేమీ లేదన్నారు పోలీసులు. రాజకీయ జోక్యం లేదని తేల్చేశారు.